
సాక్షి, న్యూఢిల్లీ : డ్రైవింగ్ లైసెన్స్ నుంచి ఆరోగ్య బీమా వరకూ అక్టోబర్ 1 నుంచి పలు నూతన నిబంధనలు అమలవనున్నాయి. పలు వస్తువులపై పన్ను భారాలతో పాటు కొన్ని వెసులుబాట్లూ అందుబాటులోకి రానున్నాయి. టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది. నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్ లైసెన్సు పొందడం సులభతరం కానుంది. గురువారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఈ చలాన్‌ను ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయని, హార్డ్ కాపీని అధికారులు అడగరని తెలిపింది. అనర్హతకు గురైన డ్రైవింగ్ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను ఈ పోర్టల్‌లో రికార్డు చేస్తూ ఎప్పటికప్పుడు తాజాపరుస్తారు. ఇక ఆరోగ్య బీమా రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు బీమా నియంతరణ సంస్థ ఐఆర్‌డీఏ వెల్లడించింది. బీమా కంపెనీలు వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్‌కూ బీమా కవరేజ్‌ను వర్తింపచేస్తాయి. బీమా క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సులభంగా పరిష్కరించనున్నాయి.
పెరగనున్న టీవీల ధరలు
మరోవైపు అక్టోబర్ 1 నుంచి టీవీల ధరలు భారం కానున్నాయి. టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్ సుంకాలను ప్రభుత్వం విధించనుంది. తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి.
చదవండి : బడ్జెట్ ధరల్లో శాంసంగ్ స్మార్ట్ టీవీలు
విదేశాలకు పంపే నగదుపై మరింత పన్ను
విదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం మూలం వద్ద పన్ను (టీసీఎస్) విధిస్తారు. ఆర్‌బీఐ రెమిటెన్స్ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్ చెల్లించాలని ఫైనాన్స్ చట్టం, 2020 పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment