
న్యూఢిల్లీ: టెలివిజన్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, ఎల్‌ఈడీ ల్యాంపులు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై గత వారం కేంద్రం సుంకం పెంచడంతో వీటి కొనుగోలుకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకారం టెలివిజన్లపై సుంకం 20 శాతానికి, స్మార్ట్‌ఫోన్లపై సుంకం 15 శాతానికి పెరిగింది. ఎల్‌ఈడీ ల్యాంపులు, మైక్రోవేవ్ ఓవెన్లపైనా దిగుమతి సుంకం 20 శాతానికి చేరింది. ఎల్‌ఈడీ టీవీల ధరలు సగటున రూ.2,000 నుంచి రూ.10,000 వరకు వాటి సైజుల ఆధారంగా పెరగనున్నట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల స్థానిక తయారీదారులు లాభపడతారని, దేశీయ తయారీని పెంచడమే కాకుండా ‘భారత్‌లోనే తయారీ’కి డిమాండ్ ఏర్పడుతుందన్నారు. ఓవెన్లపై రూ.400-500 వరకు పెంపు ఉంటుందని గోద్రేజ్ అప్లియన్సెస్ బిజినెస్ హెచ్ కమల్‌నంది తెలిపారు. డ్యూటీ పెంపు తర్వాత యాపిల్ ఐఫోన్ల ధరలను రూ.3,720 వరకు పెంచిన విషయం విదితమే.