సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలోని అతి తక్కువ ఆదాయ వనరులున్న చిన్న ఆలయాలకు ధూపదీప నైవేద్యం పథకం కింద నిధులను ప్రభుత్వం పెంచింది. ఆ ఆలయాలకు ఇప్పటివరకు ఇస్తున్న రూ.6 వేలను రూ.10 వేలకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ధూపదీప నైవేద్యం పథకం కింద గుర్తించిన 6,541 ఆలయాలకు ఇది వర్తించనుంది. ఈ పథకం ప్రారంభమైన కొత్తలో ఒక్కో ఆలయానికి రూ.2,500 ఇచ్చేవారు. తర్వాత రూ.6 వేలకు పెంచారు.
అందులో రూ.2 వేలు ఆలయంలో పూజాదికాల ఖర్చుకు, మిగతా మొత్తాన్ని అర్చకుడి కుటుంబ పోషణ కోసం అందించేవారు. ఇప్పుడీ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచటంతో.. పూజాదికాలకు రూ.4 వేలు, అర్చకుల కుటుంబాలకు రూ.6 వేలు వినియోగించుకునే వీలుంటుందని అంటున్నారు. ఈ పథకం పరిధిలోకి మరిన్ని ఆలయాలను తీసుకురావాలన్న ప్రతిపాదన ఉంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా.. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడిగా పాత్రికేయుడు విష్ణుదాస్ శ్రీకాంత్‌ను నియమిస్తూ ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాంస్కృతిక సారథి కళాకారులకూ ఊరట
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్చించే విధుల్లో ఉన్న సాంస్కృతిక సారథి కళాకారుల వేత నాలను ప్రభుత్వం పెంచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించిన 583 మంది కళాకారులతో.. రాష్ట్ర అవతరణ తర్వాత సాంస్కృతిక సారథి బృందాన్ని ఏర్పా టు చేసిన విషయం తెలిసిందే. వీరికి ప్రస్తుతం రూ.24,514గా ఉన్న వేతనాలను రూ.31,868 చేసింది. 2021 జూన్ 1వ తేదీ నుంచే ఈ పెంపు వర్తిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల సాంస్కృతిక సారథి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో సీఎం కేసీఆర్ చిత్రాలకు స్వర–క్షీరాభిషెకాలు నిర్వహించాలని నిర్ణయించామని కళాకారుల ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment