నంద్యాలలో పడితరం నిధులు అందని ఆంజనేయ కోదండరామ స్వామి దేవాలయం
దేవుడి ప్రసాదమంటే ఎంతో భక్తితో స్వీకరిస్తాం. కొన్ని సందర్భాల్లో స్వామి దర్శనం దొరికినా..దొరక్కపోయినా ప్రసాదం అందితే చాలను కుంటాం. అంతటి ప్రాశస్త్యం కలిగిన ప్రసాదం తయారీకి ఇవ్వాల్సిన నిధుల విషయంలో దేవదాయశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పురోహితులు ఆరోపిస్తున్నారు.
కర్నూలు(న్యూసిటీ): దేవదాయ ధర్మదాయ శాఖ పరిధిలో 6 బి గ్రూపు కింద జిల్లాలో 88 దేవాలయాలు ఉన్నాయి. వాటి ఆదాయం ఏడాదికి రూ. 25 లక్షలలోపు ఉంటుంది. లక్షకు నెలకు రూ. 1000 చొప్పున ఆయా ఆలయాల్లో ప్రసాదం (పడితరం) తయారీ కోసం ఈఓ నిధులు కేటాయించాలి. ఈమేరకు ఆ శాఖ కమిషనర్ వై.వి.అనురాధ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. దీనిని అమలు చేయాల్సిన ఆలయ ఈఓలు బేఖాతరు చేస్తున్నారు.
నంద్యాల, ఆత్మకూరు, బనగానపల్లె, కోవెలకుంట్ల తదితర మండలాల్లోని ఆలయాలకు పడితరం నిధులు ఇవ్వకుండా ఈఓలు మొండికేసినట్లు తెలిసింది. పాములపాడు మండల వేంపెట గ్రామంలో ఉన్న రాముల వారి, ఈశ్వరస్వామి తదితర ఆలయాల్లో ప్రసాదం తయారీకి డబ్బులు ఇవ్వడం లేదని సహాయ కమిషనర్ కార్యాలయంలో పురోహితులు ఫిర్యాదు చేశారు. అయినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆళ్లగడ్డలో వేణుగోపాలస్వామి , నంద్యాల, బేతంచెర్లలో చెన్నకేశవస్వామి, ఆదోనిలో నరసింహస్వామి, కర్నూలు పాతబస్టాండ్‌లో నగరేశ్వరస్వామి తదితర ఆలయాలకు సైతం పడితరం నిధులు అందడం లేదు. ఇలా అయితే భక్తులకు ప్రసాదాల పంపిణీ కష్టమవుతుందని పురోహితులు వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ప్రసాదం ఇవ్వలే ని పరిస్థితి ఉంది. దీనిపై దేవదాయశాఖ సహాయ కమిషనర్ డి. ఆనంద్‌కుమార్‌ను వివరణ అడగగా.. ఈఓలు ప్రసాదానికి నిధులు ఇవ్వడం లేదని తెలిసిందని,ఇక నుంచి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment