సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి | Development Of Temples With Sarvashreyo Fund At Vizayanagaram | Sakshi
Sakshi News home page

సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి

Published Sat, Jun 11 2022 4:31 PM | Last Updated on Sat, Jun 11 2022 4:43 PM

Development Of Temples With Sarvashreyo Fund At Vizayanagaram - Sakshi

విజయనగరం టౌన్‌: జీర్ణోద్ధరణకు గురైన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్, కామన్‌ గ్రాంట్‌ ఫండ్‌) కింద జిల్లాకు రూ.20 కోట్లు కేటాయించింది. జిల్లాలోని 44 ఆలయాల అభివృద్ధి పనులను చేపట్టింది. పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆలయాలు కొత్తశోభను సంతరించుకుంటుండడంతో భక్తులు సంతోషపడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అర్చకులు, ఆయా ఆలయాల అధికారులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.   

జిల్లాలో మొత్తం 461 ఆలయాలు ఉన్నాయి. ఇందులో రూ.25 లక్షలకు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (ఎ) కేటగిరీకి చెందిన ఆలయాలు 6 వరకూ ఉన్నాయి. రూ.2లక్షలు పైబడి వార్షిక ఆదాయం వస్తున్న 6 (బి) కేటగిరీకి చెందిన ఆలయాలు 15 వరకూ ఉన్నాయి. వీటితో పాటు 6(సి) కేటగిరీలో రెండు లక్షల రూపాయలలోపు ఆదాయం ఉన్న ఆలయాలు 30 వరకూ ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా ఆలయాలకు ఎటువంటి ఆదాయం లేదు.

వీటిలో అధిక ఆలయాలు జీర్ణోద్ధరణకు గురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సర్వ శ్రేయోనిధి కింద రూ. 20 కోట్లు కేటాయించడంతో  జిల్లాలో 44 ఆలయాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి. ఇటీవల కాలంలో రామతీర్థం బోడికొండపైన నూతనంగా నిర్మాణమైన ఆలయమే దీనికి నిదర్శనం. దాంతో పాటు రామతీర్థం ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం విశేషం.  

విజయనగరం డివిజన్‌ పరిధిలో ఇప్పిలి వీధి శ్రీరామమందిరానికి రూ. 20 లక్షలు, నాగవంశపు వీధి రామమందిరానికి రూ.50 లక్షలు, మండపం వీధి సంపత్‌ వినాయకస్వామి ఆలయానికి రూ.75 లక్షలు, కొత్తపేట రామమందిరానికి రూ.50 లక్షలు,  గాయత్రీనగర్‌ వెంకటేశ్వరస్వామి ఆలయానికి  రూ.40 లక్షలు,  బోయవీధి రామమందిరానికి రూ.20 లక్షలు, పల్లివీధి కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మండపం వీధి జగన్నాథస్వామి పురాణకాలక్షేప మండపానికి రూ. 80లక్షలను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయానికి రూ.50 లక్షలు కేటాయింపులు జరిగాయి. 

చీపురుపల్లి డివిజన్‌ పరిధిలో నిమ్మలవలస గ్రామం శ్రీరామమందిరానికి రూ.30 లక్షలు, గరివిడి మండలం ఆర్తమూరు కోదండరామాలయానికి రూ.40 లక్షలు, మెరకముడిదాం పులిగుమ్మి రామాలయానికి రూ. 30 లక్షలు, చీపురుపల్లి కనకమహాలక్ష్మి ఆలయానికి రూ.15 లక్షలు, గరివిడి నీలాద్రిపురం రామాలయానికి రూ.25 లక్షలు, రామతీర్థం శ్రీరామస్వామి దేవస్థానానికి  కోటి రూపాయలు, బోడికొండపై కోదండరామ ఆలయ నిర్మాణానికి రూ. 3 కోట్లు కేటాయించింది.

పోలిపల్లి గ్రామం పైడితల్లి ఆలయానికి రూ. 50 లక్షలు, భోగాపురం మండలం నందిగాం రామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, చీపురుపల్లి మండలం పత్తికాయలవలసలో ఉన్న శ్రీరామమందిరానికి రూ.16 లక్షలు, చీపురుపల్లి మండలం పర్లలో ఉన్న శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, మెంటాడలో ఉన్న సీతారామఆలయానికి రూ. 25లక్షలు మంజూరు చేసింది.

ఎస్‌.కోట డివిజన్‌ పరిధిలో  కొత్తవలస గులివిందాడ శ్రీరామలయానికి రూ.40 లక్షలు,  ఎల్‌.కోట జమ్మాదేవిపేట రామాలయానికి రూ. 44 లక్షలు, గంట్యాడ పెదవేమలి శ్రీరామాలయానికి రూ.16 లక్షలు,  వేపాడ రామయ్యపేట రాములవారు, బంగారమ్మ తల్లి ఆలయానికి రూ.20 లక్షలు, గంట్యాడ కొర్లాం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, జామి శ్రీరామాలయానికి రూ.50 లక్షలు  ఎల్‌.కోటకొత్తపాలం మల్లివీడు పంచాయతీ శ్రీరామాలయానికి రూ.30 లక్షలను కేటాయించింది.

ఎల్‌.కోట రాగరాయిపురం భూలోకమాత ఆలయానికి రూ.30 లక్షలు, వేపాడ వల్లంపూడి సీతారామస్వామి ఆలయానికి రూ.50 లక్షలు, కొత్తవలస గనిశెట్టిపాలెం శ్రీరామాలయానికి రూ.19లక్షల 30వేలు, ఎస్‌.కోట గవరపాలెం శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, ఎస్‌.కోట పుణ్యగిరి ధారగంగమ్మ, శివాలయానికి రూ.30 లక్షలు కేటాయింపులు జరిపింది. బొబ్బిలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని గరుగుబిల్లి తోటపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి రూ.83 లక్షలు, సాలూరు వడ్డివీధి రామాలయానికి రూ. 13 లక్షలు,  సీతానగరం కాసాపేట శ్రీరామాలయానికి రూ.40 లక్షలు, సీతానగరం నిడగల్లు శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు,  కొమరాడ దేవునిగుంప సోమేశ్వరస్వామి ఆలయానికి రూ. 50 లక్షలు,

బొబ్బిలి కారడ గ్రామంలో ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.40 లక్షలు, పార్వతీపురం పిట్టలవలస నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి రూ. 25 లక్షలు, మక్కువ డి.సిర్లం సంగమేశ్వరస్వామి ఆలయానికి  రూ. 49 లక్షలు,  గరివిడి నీలాద్రిపురం శ్రీరామాలయానికి రూ. 25 లక్షలు, బాడంగి మండలం ముగడలో ఉన్న శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు, రేజేరులోని శ్రీరామమందిరానికి రూ. 12 లక్షలు కేటాయించింది. కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తికాగా, మరికొన్ని చోట్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో ఆయా గ్రామాల్లో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి.      

శరవేగంగా పునరుద్ధరణ పనులు 
ప్రభుత్వం సర్వశ్రేయోనిధి కింద మంజూరు చేసిన నిధులతో ఆలయాలు పునరుద్ధరణ పనులు చేపట్టాం. ప్రస్తుతం శరవేగంగా పనులు జరుగుతున్నాయి. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామస్వామి ఆలయ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొండకింద రామస్వామి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు దేవాలయాల పునరుద్ధరణ, కొత్తదేవాలయాల నిర్మాణ పనులకు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కేటాయించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనికోసం జిల్లా నుంచి 54 దరఖాస్తులు అందాయి.  
– జె.వినోద్‌కుమార్, దేవదాయశాఖ సహాయకమిషనర్, విజయనగరం   

(చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement