న్యూఢిల్లీ: టీవీల రేట్లకు మరోసారి రెక్కలు రానున్నాయి. టెలివిజన్ స్క్రీన్ల తయారీలో కీలకమైన ఓపెన్–సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీని పెంచాలని కేంద్రం భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. దీన్ని వచ్చే మూడేళ్లలో క్రమంగా 10–12 శాతానికి పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో దీన్ని అమల్లోకి తేవచ్చని.. ఫలితంగా అక్టోబర్ నాటికి టీవీల రేట్లు 3–5 శాతం మేర పెరగవచ్చని పేర్కొన్నాయి. ఓపెన్ సెల్ ప్యానెళ్లు ఎక్కువగా చైనా నుంచి దిగుమతవుతున్నాయి. దేశీయంగా భారీ బ్రాండ్లలో శాంసంగ్, ఎల్‌జీ, సోనీ, థామ్సన్, కొడక్, వ్యూ, మి, వన్‌ప్లస్ వంటివి ఉన్నాయి. ఇలాంటి బ్రాండ్లన్నీ కూడా చైనా వంటి మార్కెట్ల నుంచి ఓపెన్–సెల్ ప్యానెళ్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ‘గత రెండేళ్లుగా (2020, 2021) భారత టీవీ పరిశ్రమకు గడ్డుకాలంగానే ఉంది. కోవిడ్–19 పరిస్థితులు తిరిగి సాధారణ స్థాయికి వచ్చే దాకానైనా కాస్తంత ఊరట ఉండాలి‘ అని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. జీఎస్‌టీ రేటును తక్షణం తగ్గించడం లేదా వచ్చే రెండేళ్ల పాటు ఓపెన్–సెల్ ప్యానెళ్లపై సుంకాలను రద్దు చేయడం.. ఈ రెండింటిలో ఏదో ఒక చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాయి.
ఈ ఏడాది ఇది మూడోసారి..
టీవీ రేట్లు పెరగడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కానుంది. ప్యానెళ్ల రేట్లు పెరుగుతాయనే కారణంతో జనవరి, ఏప్రిల్‌లో టీవీల ధరలను కంపెనీలు పెంచాయి. చైనాకు చెందిన ప్యానెళ్ల తయారీ సంస్థలు ధరలను పెంచడం కూడా ఇందుకు కొంత కారణం. కస్టమ్స్ డ్యూటీతో పాటు టీవీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కూడా వర్తిస్తోంది. 32 అంగుళాల దాకా టీవీలపై 18%, అంతకు మించిన వాటిపై గరిష్టంగా 28% మేర జీఎస్‌టీ ఉంటోంది.
2019 నుంచి మల్లగుల్లాలు..
వాస్తవానికి మేకిన్ ఇండియా నినాదానికి ఊతమిచ్చేలా ఓపెన్ సెల్ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ గణనీయంగా పెంచాలని కేంద్రం గతంలోనే ప్రతిపాదించింది. అయితే, అప్పట్లో టీవీల తయారీ సంస్థలు దీన్ని వ్యతిరేకించాయి. దీంతో ఏడాది వ్యవధిలో దేశీయంగా వాటి తయారీ సామర్థ్యాలను పెంచుకుంటే ఓపెన్–సెల్ ప్యానెళ్లపై ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ విధించబోమంటూ 2019 సెప్టెంబర్‌లో పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు (సీబీఐసీ) ప్రకటించింది. కానీ టీవీల తయారీ సంస్థలు ఇప్పటిదాకా దేశీయంగా ప్యానెళ్ల తయారీకి ఏర్పాట్లు చేసుకోలేకపోయాయి. కరోనా వైరస్ వ్యాప్తి, తదుపరి లాక్‌డౌన్ తదితర పరిణామాలతో వాటి ప్రణాళికలకు అంతరాయం ఏర్పడింది.
ప్రతీ మూణ్నెల్లకోసారి పెరుగుదల
కరోనా వైరస్ మహమ్మారి తెరపైకి వచ్చినప్పట్నుంచీ టీవీల ధరలు దాదాపు ప్రతీ త్రైమాసికానికోసారి పెరుగుతూనే ఉన్నాయి. తొలుత చైనాలో తయారీ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల రేట్లు పెరిగాయి. కానీ ఆ తర్వాత డిమాండ్–సరఫరా పరిస్థితి స్థిరపడిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. 2019 డిసెంబర్ ఆఖరు వారంలో చైనాలో కోవిడ్ కేసులు బైటపడినప్పుడు టీవీ తయారీ సంస్థల్లో ఆందోళన నెలకొంది. టీవీల తయారీకి కీలకమైన ప్యానెళ్లను ఎక్కువగా చైనానే సరఫరా చేస్తున్నందున .. అక్కడ కార్యకలాపాలు కుంటుపడితే ముడి వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనని కంపెనీలు భయపడ్డాయి. ఆ భయాలన్నీ తర్వాత నెలలోనే నిజమయ్యాయి. 2020 జనవరిలో .. చైనాలోని తయారీ హబ్‌లలో ఉత్పత్తి నిల్చిపోయింది. దీంతో ప్యానెళ్లు సహా ఇతరత్రా కీలక విడిభాగాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా 2020 ఫిబ్రవరి నుంచే రేట్లు 10% పెరిగాయి. అటుపైన మార్చి వచ్చేసరికి భారత్‌లో దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఒకవైపు విడిభాగాలు, మరోవైపు టీవీ సెట్లకు కూడా కొరత ఏర్పడింది. జూన్ నుంచి తయారీ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో .. అన్ని సైజుల్లోని కలర్ టీవీల దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) జూలై ఆఖరున నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా 80 అంగుళాలు ఆ పైన పరిమాణమున్న హై–ఎండ్ టీవీ సెట్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటోంది. ఇక ఇదే సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో వివాదం రాజుకోవడంతో భారత్‌లో చైనా వ్యతిరేక సెంటిమెంటు ఎగిసింది. అప్పట్నుంచి చైనా నుంచి వచ్చే విడిభాగాలు, ఫినిష్డ్ గూడ్స్‌పై నిఘా కొనసాగుతుండటం.. భారత్‌లో ఉత్పత్తి జాప్యానికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా సరిగ్గా దీపావళి పండుగ సీజన్‌కు ముందు సెప్టెంబర్‌లో ప్యానెళ్ల రేట్లు పెరగడంతో టీవీల ధరలు దాదాపు 25 శాతం దాకా ఎగిశాయి. ఆ వెంటనే అక్టోబర్ 1 నుంచి ఓపెన్–సెల్స్‌పై 5% కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం తిరిగి విధించింది.
Comments
Please login to add a commentAdd a comment