TVV
-
టీవీవీ గౌరవాధ్యక్షుడు రవీందర్రావు అరెస్టు
సాక్షి, రామకృష్ణాపూర్(చెన్నూర్): తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గురిజాల రవీందర్రావును పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మావోయిస్టు భావజాల వ్యాప్తి చేస్తున్నారన్న అభియోగాలతో ఆయన స్వగృహం రామకృష్ణాపూర్ పరిధి క్యాతనపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఆయన ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సిమ్ కార్డులు, విప్లవ సాహిత్యంతో కూడిన సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ‘రవీందర్రావు టీవీవీ ముసుగులో మావోయిస్టులకు సహకరిస్తున్నారు. రవీందర్రావు ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యానికి ఆశ్రయమిచ్చారు. సుబ్రహ్మణ్యం గత నవంబర్‌లో 20 రోజుల పాటు రవీందర్రావు ఇంట్లో తలదాచుకున్నాడు. రవీందర్రావు మావోయిస్టు కీలక నేతలతో అందుబాటులో ఉంటూ అర్బన్ నక్సలిజాన్ని విస్తరింపజేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్ పోలీసుల పక్కా సమాచారం మేరకు రవీందర్రావు ఇంట్లో సోదాలు నిర్వహించాం. రవీందర్‌రావుపై 120, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నాం..’అని సీపీ తెలిపారు. పీపుల్స్‌వార్‌లో క్రియాశీలకంగా.. క్యాతనపల్లికి చెందిన రవీందర్రావు 1978 నుంచే ర్యాడికల్ యూత్ వింగ్‌లో పనిచేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ‘రవీందర్రావు ఆ క్రమంలోనే ఎదుగుతూ అప్పటి పీపుల్స్‌వార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కొన్నాళ్ల అనంతరం సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస)లో కీలక బాధ్యతలు చేపట్టారు. కొంతకాలం అజ్ఞాతంలో ఉంటూ పనిచేసి.. రెండు దశాబ్దాల క్రితం లొంగిపోయారు. ప్రస్తుతం టీవీవీని ఆయన ఆసరాగా చేసుకుని మావోయిస్టు భావజాల వ్యాప్తికి హితోధికంగా సహకరిస్తున్నారు..’ అని సీపీ పేర్కొన్నారు. నాకే సంబంధం లేదు.. అరెస్టు అక్రమం: రవీందర్రావు ఇటు పోలీస్‌స్టేషన్‌లో గురిజాల రవీందర్రావు విలే కరులతో మాట్లాడారు.. అకారణంగా తనను పోలీ సులు అరెస్టు చేయడం అక్రమమన్నారు. తాను టీవీవీలో మాత్రమే పనిచేస్తున్నానని, మావోయిస్టు పార్టీతో తనకు సంబంధం లేదని వెల్లడించారు. చదవండి: గెలుపు సంబరాల్లో గన్‌తో హల్చల్ -
మద్దిలేటిని కోర్టులో హాజరుపర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ ఆఫీసులో ఓ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన వీరిద్దరిని పోలీసులు నేరుగా కస్టడీలోకి తీసుకొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండటమేగాక, చురుకైన కార్యకర్తలుగా పనిచేస్తూ.. కొత్త క్యాడర్‌ను నియమించడం, నిధులను సేకరించడం వంటివి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహించే బంద్‌లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని, అందుకే నిందితులను అరెస్ట్ చేశామని గద్వాల్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో అరెస్ట్ చేసిన నలమాస కృష్ణ, మద్దిలేటిని కోర్టులో హాజరు పర్చాలని వారి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
పోలీసుల అదుపులో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి!
ఊట్కూర్ (మక్తల్): మావోయిస్టులతో పరిచయాలున్నాయన్న అనుమానంతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ విద్యానగర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఆయన నుంచి సెల్ఫోన్లు, వివిధ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మక్తల్‌లో ఉన్న తల్లి వెంకటమ్మ, ఇతర కుటుంబసభ్యులకు ఆదివారం తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన శంకరప్ప, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా రెండో కుమారుడు మద్దిలేటి ఉద్యమ బాటలో పయనించారు. మద్దిలేటి భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడే న్యాయవాది పరీక్షకు శిక్షణ పొందుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థి దశ నుంచి ఉద్యమ బాటలో పయనించిన ఆయన చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. దీంతో ఆయన కదలికలపై పోలీసులు నిఘా వేయగా మావోలతో పరిచయాలు ఉన్నాయని అనుమానంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
మద్దిలేటి కేసు సిట్‌కు బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటిపై తూర్పు మండలంలోని నల్లకుంట పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు బాధ్యతల్ని నగర నేర పరిశోధన విభాగం ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అప్పగిస్తూ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆ విభాగం ఏసీపీ నేతృత్వంలో ఈ కేసు దర్యాప్తు సాగుతుందని స్పష్టం చేశారు. గద్వాల్ పోలీసుల సమాచారంతో అడిక్‌మెట్‌లోని మద్దిలేటి ఇంట్లో మంగళవారం సోదాలు చేసిన పోలీసులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. దీని దర్యాప్తు పరిధిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మద్దిలేటి ఇంట్లో చేసిన సోదాల్లో నిషేధిత సాహిత్యంతో పాటు బెదిరింపు లేఖలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ రాసిన లేఖ సైతం పోలీసులకు దొరికింది. ఇందులో ప్రముఖ విద్యా సంస్థల్ని బెదిరించి డబ్బు వసూలు చేయాలనే ఆదేశాలు ఉన్నట్లు కమిషనర్ తెలిపారు. దీంతో పాటు ‘సందేశం’పేరుతో కరపత్రాలు లభించాయని, వీటిలో హింసను ప్రేరేపించే విషయాలు, చైనీయుల కమ్యూనిస్టు విప్లవం తదితరాలు ఉన్నాయన్నారు. నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థలు అనేకం ఉన్నాయని వీటి కార్యకలాపాలపై డేగకన్ను వేశామని తెలిపారు. టీవీవీకి చెందిన అనేక మందిపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఉన్నాయని తెలిపారు. ఎల్ఎల్బీ మధ్యలోనే మానేసిన మద్దిలేటి టీవీవీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అతనిపై వరంగల్‌లోని సుబేదారీ, కొత్తగూడెం జిల్లా, గద్వాల్ టౌన్, కాజీపేటల్లోనూ తీవ్రమైన కేసులు నమోదై ఉన్నట్లు వివరించారు. -
బాబు పాలననే కొనసాగిస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ల పేరిట నక్సలైట్లను కాల్చి చంపేవారని.. సీఎం కేసీఆర్ కూడా అప్పటి చంద్రబాబు పాలననే కొనసాగిస్తున్నారని తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) ఆరోపించింది. ‘రక్తపు మరకలు, పోలీసు బూట్ల చప్పుడు లేని తెలంగాణ’అని చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారన్నారు. అయితే అధికారం చేపట్టిన నాటి నుంచే రక్త దాహంతో ప్రతీకారం తీర్చుకుంటూ చంద్రబాబు పాలననే కేసీఆర్ కొనసాగిస్తున్నారని విమర్శించారు. కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, మనిషిని మనిషే చంపుకునే సంస్కృతి పోవాలని పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ముట్టడి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ టీవీవీ నాయకులు, కళాశాలల విద్యార్థులు గురువారం కలెక్టరేట్ ముట్టడించారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ప్రధాన గేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీవీవీ జిల్లా అధ్యక్షుడు రాహుల్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెడుతామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు దాని ఊసేత్తడం లేదని ఆరోపించారు. కళాశాలలు ప్రారంభమైన నెలన్నర గడుస్తున్నా మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని పేర్కొన్నారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇబ్బందులను దష్టిలో ఉంచుకుని మరుగుదొడ్లు నిర్మించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్యను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విద్యార్థులు, నాయకులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీవీవీ నాయకులు వసంత్, సాగర్, సతీష్, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు. -
అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరు
హైదరాబాద్: అణచివేతను తెలంగాణ ప్రజలు సహించరని, ఎంత ప్రజాస్వామ్యం ఉంటే అంత స్వేచ్ఛ ఉంటుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ విద్యార్థి వేదిక(టీవీవీ) ఆధ్వర్యంలో ‘టీవీవీ మహాసభల’పై నిర్బంధాన్ని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి సంఘాల మీద దాడి చేసినా, అణచివేసినా ఎవరు ఏమి ప్రశ్నించరని భావించే నేతలకు కనువిప్పు కలగాలన్నారు. ఒక్క విద్యార్థి సంఘాన్ని అణచివేస్తే అన్ని విద్యార్థి సంఘాలు ఐక్యం కావటం శుభపరిణామమన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యమం చేయాల్సి వస్తుందని, ప్రజల్ని మరో ఉద్యమంలోకి నెట్టవద్దని కోరారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు జీవన్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థును నిర్బంధంలోకి నెట్టటం హక్కులను ఉల్లంఘించడమేనన్నారు. ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సమస్యపై సదస్సు నిర్వహించుకునే విద్యార్థ్ధి సంఘంపై నిర్బంధంరాజ్యాంగానికి విరుద్ధమన్నారు. టీవీవీ అధ్యక్షుడు ఎన్.మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీవీవీ కార్యదర్శి ఆజాద్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, టీపీఎఫ్ అధ్యక్షుడు పులిమామిడి మద్దిలేటి, పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. -
విద్యార్థి గళం..తెలంగాణ విద్యార్థి వేదిక
నల్లగొండ అర్బన్ : ఉద్యమాల ఖిల్లాగా పేరుగాంచిన నల్లగొండ జిల్లా తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర 4వ మహాసభలకు వేదికయ్యింది. ప్రజా ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమనే లక్ష్యంతో 2006 అక్టోబర్ 26న ఆవిర్భవించింది. లక్ష్యసాధనలో మొదటి మెట్టును చేరుకున్న క్రమంలో ప్రజాస్వామిక తెలంగాణే ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందనే విశ్వా సంతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో క్రియాశీలక ఉద్యమాలు నిర్వహిస్తున్న టీవీవీ నేడు, రేపు జరిగే మహాసభల ద్వారా భవిష్యత్ కార్యచరణపై గళం విప్పనుంది. ఉద్యమ వారధిగా.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ క్రియాశీలక పాత్రను పోషించిన ఘనత టీవీ వీది. విద్యార్థి జేఏసీని ఏర్పాటు చేసి ఆ సంఘానికి నాయకత్వం వహించడమే కాకుండా ఉద్యమానికి వారధిగా నిలిచింది. గడచిన ఆరేళ్లలో తెలంగాణ విద్యార్థి వేదిక సాగించిన పోరాటాల పరంపరపై సింహవలోకనం. 2009వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) కేంద్రంగా ప్రారంభమైన ఉద్యమంలో అత్యంత కీలకపాత్రను పోషించింది. 2010 ఫిబ్రవరిలో ఏర్పడిన విద్యార్థి జేఏసీకి చైర్మన్‌గా వ్యవహరించే నాయకత్వాన్ని స్వీకరించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది టీవీవీ. చలో అసెంబ్లీ, రాజ్‌భవన్, మిలియన్ మార్చ్‌లాంటి పోరాటాల్లో క్రియాశీలక పాత్ర. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా 16 మంది విద్యార్థినులు అసెంబ్లీలోకి ప్రవేశించి జైలుకెళ్లి తెలంగాణ నినాదాన్ని ఢిల్లీకి వినిపించారు. వరంగల్ జిల్లా రాయినిగూడెంలో రచ్చబండకు హాజ రైన సమైక్యాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని అడ్డుకొని ప్రజలందరిచేత జై తెలంగాణ నినాదాలిప్పించడంతో కిరణ్ సభను రద్దు చేసుకొని వెళ్లిపోయారు. పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని, ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలపవద్దని పాదయాత్ర నిర్వహించి భద్రాచలంలో ప్రజాసంఘాలు, ప్రజలతో సమావేశం నిర్వహించింది. ఆదిలాబాద్‌లోని కత్వాల్ టైగర్‌జోన్‌కు వ్యతిరేకంగా ఆప్రాంతంలో పాదయాత్ర నిర్వహణ ద్వారా ప్రజా చైతన్యానికి కృషి చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కుతరలింపునకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించి బయ్యారంలో సభ ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను అటువైపు మళ్లించడంలో కీలకపాత్ర వహించింది. సకలజనుల సమ్మెలో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్‌లో క్రియాశీలక పాత్ర పోషించింది. నకిరేకల్‌లో జరిగిన పోరాటంలో అగ్రభాగాననిలిచి జిల్లా నాయకత్వం జైలుకు వెళ్లింది. మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని పాదయాత్ర నిర్వహణ. సాంస్కృతిక అణచివేతకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్‌ఫెస్టివల్ (పెద్దకూరపండుగ) నిర్వహించి దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసింది. కామన్‌స్కూల్ విద్యా విధానం అమలు చేయాలని అఖిల భారత విద్యాహక్కు వేదిక ఆధ్వర్యంలో జరిగిన యాత్రలో క్రియాశీలకంగా పాల్గొన్నది. ప్రజాస్వామిక తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ విద్యార్థి వేదిక ముందుకు సాగుతున్నది. -
ఉద్యమ మార్గదర్శి.. టీవీవీ
నల్లగొండ కల్చరల్: తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శిగా నిలిచింది తెలంగాణ విద్యావంతుల వేదిక (టీవీవీ) అని ఆ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫె సర్ కోదండరాం అన్నారు. ఆదివారం టీవీవీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్లో నిర్వహించిన వేదిక దశాబ్ది ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వేదిక ఆవిర్భవించి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబురాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ వేదిక గమ్యాన్ని చేరుకుందన్నారు. చంద్రబాబు పరిపాలనలో, తెలంగాణ పేరెత్తాలంటే భయపడే పరిస్థితుల్లో దొంగతనంగా సమావేశాలు నిర్వహించుకోవాల్సి వచ్చేదన్నారు. అప్పటికీ పోలీసులకు భయపడి, విద్యావంతులు కూడా రాని పరిస్థితుల్లో ప్రొఫెసర్ జయశంకర్‌సార్ మదిలో మెదిలిన ఆలోచన, ఉద్యమానికి మార్గదర్శకత్వం చేయాలనే పిలుపుతో కదలిక వచ్చి అతి కొద్దిమందితో టీవీవీ పురుడుపోసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సరిపోలేదని, ఇంకా సీమాంధ్రుల ఆర్థిక పెత్తనం పోలేదన్నారు. ఇన్నాళ్లూ కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి నిర్మించుకోవాలని, గవర్నర్ పెత్తనం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, ప్రజల అవసరాలను ప్రభుత్వానికి తెలుపుతూ వారధిగా పనిచేయాలన్నారు. టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో తెలంగాణ అస్థిత్వ పోరాటానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ఒక బలమైన రాచరికపు వ్యవస్థను కూలదోసి ప్రజాస్వామ్యానికి పట్టంగట్టిన పోరాట చరిత్ర తెలంగాణ ప్రజలదన్నారు. సీమాంధ్రుల పాలనలో ఉద్యోగాలు, నిధులు నీళ్లు కొల్లగొట్టారని, ఆ ఆక్రోశంలోనుంచి పుట్టిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం అందివచ్చిందన్నారు. ఆశించిన మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా తెలంగాణ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన ప్రభుత్వమైనా సరే తప్పు జరిగితే నిర్భయంగా ఎత్తిచూపుతామని, ఆ దిశగానే టీవీవీ పనిచేస్తుందన్నారు. జిల్లా అధ్యక్షుడు కె.ధర్మార్జున్ మాట్లాడుతూ 2004లో పులిచింతల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మొదటిసారిగా కోదాడలో జిల్లా టీవీవీ నిర్మాణం జరిగిందన్నారు. రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపును అందుకుని ఉద్యమాన్ని ఉరకలేయించామన్నారు. టీవీవీ బాధ్యులు వేణు సంకోజు, జి.వెంకటేశ్వర్లు, పందుల సైదులు, ఆర్.విజయ్‌కుమార్, అంబటి నాగయ్య, చిన్న, తిప్పర్తి యాదయ్య ప్రసంగించారు. అంతకుముందు ప్రొఫెసర్ కోదాండరాం టీవీవీ జెండా ఆవిష్కరించారు.ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోలి అమరేందర్‌రెడ్డి, అడ్వకేట్ డి.అమరేందర్‌రావు, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు అంబటి వెంకన్న, జవహర్లాల్, సోమమల్లయ్య, పి.మధుసూదన్‌రావు, వేముల యల్లయ్య, దేవేందర్, లీల పాల్గొన్నారు.