బీడీకార్మికులూ.. ఆందోళన వద్దు
సిరిసిల్ల : జీవనభృతి రాని బీడీ కార్మికులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఈ నెలలో దరఖాస్తు చేసుకుంటే విచారణ జరిపి అర్హత ఉంటే వచ్చే నెలలోనే మంజూరు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
బుధవారం సాయంత్రం అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో బీడీ కార్మికుల జీవనభృతి పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మంది కార్మికులకు ప్రతినెలా రూ.వెరుు్య చొప్పున జీవనభృతి అందిస్తున్నామన్నారు. ఇంత పెద్ద కార్యక్రమంలో తప్పులు జరిగి ఉంటే అధికారులు సవరిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. పంఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియగా సాగుతుందన్నారు. అర్హత కలిగిన వారికి పింఛన్లు ఇవ్వడం భారమేమీ కాదన్నారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే పింఛన్ వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
బీడీ కార్మికుల కష్టాలు సీఎంకు తెలుసు
డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన వాడిగా వారిని ఆదుకునేందుకు జీవనభృతి అందిస్తున్నారని అన్నారు. బీడీ కార్మికులు ఆకు, తంబాకు విషం మింగుతూ అరోగ్యం పాడవుతుందని తెలిసినా కుటుంబం కోసం త్యాగాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో సిరిసిల్ల అభివృద్ధి
‘సిరిసిల్ల అన్ని రంగాల్లో వెనకబడి ఉంది. నేను పుట్టింటి ఇక్కడే కాబట్టి నాకు తెలుసు. మంత్రి కేటీఆర్ సిరిసిల్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారు’ అని పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. కేటీఆర్ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రిగా రెండు కీలక పదవుల్లో సవ్యసాచిలా పని చేస్తున్నారని పేర్కొన్నారు. సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలబెడతారని, సమర్థవంతమైన పాలన అందిస్తారని చెప్పారు.
కార్యక్రమంలో సెస్ పర్సన్ ఇన్‌ఛార్జి దోర్నాల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, వైస్ చైర్మన్ తవుటు కనకయ్య, జెడ్పీటీసీ సభ్యులు తోట ఆగయ్య, మల్లుగారి పద్మ, జె.శరత్‌రావు, ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, ఆర్డీవో భిక్షానాయక్, డీఎస్పీ దామెర నర్సయ్య, తహశీల్దార్ మన్నె ప్రభాకర్, టౌన్ సీఐ జి.విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.సుమన్‌రావు, ఎంపీడీవో మదన్మోహన్, ఈవోపీఆర్డీ రవీందర్, కౌన్సిలర్లు యెల్లె లక్ష్మీనారాయణ, గుండ్లపల్లి పూర్ణచందర్, రాపెల్లి లక్ష్మీనారాయణ, జి.హన్మంతునాయక్, ఉప్పుల విఠల్‌రెడ్డి, పత్తిపాక పద్మ, దార్నం అరుణ, గుండ్లపల్లి రామానుజం, కుల్ల నిర్మల, మంచె శ్రీనివాస్, బత్తుల వనజ, బింగి రాంబాబు, రిక్కమల్ల సంపత్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.