అప్పుడే రెండు లక్షల మంది బుక్ చేశారు!
బోల్ట్ చివరి పరుగుకు భారీ డిమాండ్
లండన్: జస్ట్ ఇప్పుడే ఒలింపిక్స్ ముగిశాయి... మూడు ఈవెంట్లలో స్వర్ణాలు గెలిచి ఉసేన్ బోల్ట్ అందరినీ మురిపించాడు. కానీ వచ్చే ఏడాది జరిగే అతని ఆఖరి పరుగు చూసేందుకు అభిమానులు అప్పుడే ఎగబడిపోతున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ జరుగుతుంది. బోల్ట్‌తో పాటు బ్రిటన్ స్టార్ మో ఫరాకు కూడా ఇదే ఆఖరి ఈవెంట్ కావడంతో ఈ రెండు పోటీలపై ఆసక్తి మరింత పెరిగింది. బోల్ట్ 100 మీటర్ల రేస్‌లో పరుగెత్తనున్న స్టేడియం సామర్థ్యం 50 వేలు కాగా... ఇప్పటికే 2 లక్షల దరఖాస్తులు రావడం విశేషం.
స్థానిక అథ్లెట్ కావడంతో ఫరా కోసం కూడా పెద్ద ఎత్తున టికెట్లు కొనేందుకు ఫ్యాన్‌స ఉత్సాహం చూపిస్తున్నారు. అన్ని ఈవెంట్లకు కలిపి 7 లక్షల వరకు టికెట్లు అందుబాటులో ఉంటే టికెట్లు కొనేందుకు దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య దానిని ఎప్పుడో దాటిపోయింది. మొత్తం 92 దేశాలనుంచి వరల్డ్ చాంపియన్‌షిప్ చూసేందుకు అభిమానులు టికెట్లు కోరుతుండటంతో నిర్వాహకులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.