గుండెల్లో 'బోల్ట్' దిగింది! | IAAF World Championships: Usain Bolt bows out in cruel fashion | Sakshi
Sakshi News home page

గుండెల్లో 'బోల్ట్' దిగింది!

Published Mon, Aug 14 2017 12:35 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

గుండెల్లో 'బోల్ట్' దిగింది!

గుండెల్లో 'బోల్ట్' దిగింది!

ట్రాక్‌పై బోల్ట్‌ విలవిల
గాయంతో ఆగిన పరుగు
పతకం లేకుండానే కెరీర్‌కు వీడ్కోలు  


జీవితంలో రెండు ఘటనలు ఎప్పుడూ జరగవని నమ్మాను... ఒకటి బోల్ట్‌ ఓడిపోవడం, రెండు బోల్ట్‌ పరుగు పూర్తి చేయలేకపోవడం... కానీ వారం వ్యవధిలో ఈ రెండింటినీ చూసేశాను... ఒక అభిమాని బాధ ఇది. నంబర్‌వన్‌గా నిలవకుండా మూడో స్థానంలో వచ్చిన రోజే ఆ పరుగు తడబడుతోందని అర్థమైంది. కానీ ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరో అవకాశం ఉందని ప్రపంచం సర్ది చెప్పుకుంది. కానీ ఆ వేదన ఇప్పుడు రెట్టింపయింది. బంగారు పతకాన్ని అందుకోవటాన్ని మార్నింగ్‌ వాక్‌కు వెళ్లినంత సులువుగా మార్చుకున్న ఆ పాదాలు... చివరకు దారి మధ్యలోనే ఆగిపోయాయి. మరో పది అంగల్లో ఎదురుగా లక్ష్యం కనిపిస్తున్నా ఇక నా వల్ల కాదంటూ, అడుగు పడలేదంటూ మొరాయించాయి. అవును...ఉసేన్‌ బోల్ట్‌ పరుగు పరాజయంతో ముగిసిపోయింది. ఇక ఈ ‘బ్యాటన్‌’ను ముందుకు తీసుకువెళ్లలేను అన్నట్లుగా కుప్పకూలిపోయి అతను పరుగు చాలించాడు.

ట్రాక్‌కు కళ్లు లేవు... లేదంటే కన్నీరు కార్చేది. పతకానికి నోరు లేదు... ఉంటే గోడు వెళ్లబోసుకునేది. బ్యాటన్‌కు హృదయం లేదు... ఉంటే ద్రవించేది. నిజమే! వాటికి ఇవేవీ లేవు కాబట్టే... బోల్ట్‌ కథని ఇలా ముగించాయి. పరుగే ప్రాణంగా... పతకమే శ్వాసగా... విజయమే లక్ష్యంగా... ఇన్నాళ్లు సాగిన పయనం చివరకు విషాద గాయంతో ముగిసింది.  బోల్ట్‌ అంటే చిరుత. బోల్ట్‌ అంటే విజేత. అతని అడుగుల వేగానికి మురిసిపోయిన అథ్లెటిక్స్‌ ట్రాక్‌లు కూడా ఇకపై వెక్కివెక్కి ఏడుస్తాయేమో!

కానీ నిజం. ఈ వీడ్కోలు బాధించింది. 4గీ100 మీటర్ల రిలేలో విజయం చేరువైనంతలోపే దూరమైంది. పది సెకన్ల కాలం తీరని వేదనను మిగిల్చింది. పాదాల తాకిడినే మధుర స్పర్శగా భావించే ట్రాక్‌కు గుండె పగిలినంత పనైంది. బరిలోకి దిగితే పతకాల పనిపట్టే ఓ యోధుడి చివరి మజిలీ ఇలా అర్ధంతరంగా ముగిసింది. లక్ష్యం చేరే చివరి అంచెలో రాకాసి గాయం బోల్ట్‌కు అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌కే ఊహించని మలుపునిచ్చింది.  

లండన్‌: ఒక్క ఉసేన్‌ బోల్ట్‌నో... కోట్లాది మంది అభిమానుల్నో... ఆతిథ్య వేదికనో కాదు... యావత్‌ అథ్లెటిక్స్‌ ప్రపంచాన్నే నిరాశకు గురి చేసిన దృశ్యం ఆవిష్కృతమైంది. బోల్ట్‌ చివరి పరుగు అనూహ్యంగా ముగిసింది. కళ్లకు అందని విషాదాన్ని మిగిల్చింది. తొడ కండరాల గాయంతో జమైకన్‌ స్టార్‌ ట్రాక్‌పైనే కూలబడ్డాడు. మెరుపు టైమింగ్‌లతో రికార్డులు బద్దలు కొట్టిన అతని పరుగు అసలు లక్ష్యాన్నే పూర్తిచేయకపోవడం కెరీర్‌లో ఇదే తొలిసారి. చివరిసారి కూడా! క్రీడాలోకమే మూగబోయే రేస్‌ శనివారం అర్ధరాత్రి జరిగింది. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో బోల్ట్‌ పూర్తిగా విఫలమయ్యాడు. 

ఎప్పట్లాగే నాలుగో రేసర్‌గా బోల్ట్‌ చివరి అంచెలో ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నాడు. సహచరుడు యోహన్‌ బ్లేక్‌ నుంచి బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్‌ రివ్వున దూసుకెళ్తున్నాడు. అతని కంటే ముందు ఇద్దరే ఉన్నారు. ఇంకో ఏడెనిమిది సెకన్లలో స్వర్ణం, లేదంటే రజతంతో ముగించే రేసును ఎడమ తొడ కండరాల గాయం మింగేసింది. అంతే బోల్ట్‌ విలవిలలాడాడు. జమైకన్‌ ప్రజలు, అభిమానుల ‘బోల్ట్‌... బోల్ట్‌...’ కేకలు ఒక్కసారిగా నిశబ్దాన్ని ఆవహించాయి. రేసు ముగియకుండానే కెరీర్‌ ముగిసింది. అయ్యో... బోల్ట్‌కు ఏమిటీ విషమ పరీక్ష అంటూ క్రీడాలోకమే నివ్వెరపోయింది. నిజానికి ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు బోల్టే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌. కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్‌పైనే అందరి కళ్లున్నాయి. కానీ ఆ కళ్లే అతని ట్రాక్‌ విలాపాన్ని చూశాయి.

సరిగ్గా ఐదేళ్ల క్రితం (2012)... ఇదే ఒలింపిక్‌ స్టేడియంలో బోల్ట్‌ తన బీజింగ్‌ (2008) విశ్వరూపాన్ని మరోమారు కళ్లకు కట్టాడు. ట్రిపుల్‌ గోల్డ్‌ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకొని ప్రపంచంలోనే చురుకైన దిగ్గజంగా ఘనతకెక్కాడు. ఇప్పుడు మాత్రం కెరీర్‌ను వీడాల్సిన సమయంలో పతకాన్ని జారవిడుచుకోవాల్సి వస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు. కానీ ఊహకందనిదే జరిగింది. బోల్ట్‌ పరుగు పూర్తిచేయకుండానే... టైమింగ్‌ నమోదు కాకుండానే రేసు ఓటమితో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 40 నిమిషాలకు జరిగిన ఈ రిలే రేసులో చిజిండు ఉజా, అడమ్‌ జెమిలి, డానియెల్‌ టాల్‌బోట్, నెథనీల్‌ మిచెల్‌ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్‌ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్‌లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్‌ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. కూలబడిన బోల్ట్‌ను సహచరులు మెక్‌లీడ్, జులియన్‌ ఫోర్ట్, బ్లేక్‌లు ఊరడించారు. ట్రాక్‌పై అతని వెన్నంటే నడిచి రేస్‌ను తోడుగా ముగించి వీడ్కోలు పలికించారు.

ఫలితాల జాబితాలో డీఎన్‌ఎఫ్‌...
రికార్డు టైమింగ్‌లతో లేదంటే విజయ బావుటాతో ఫలితం జాబితా (రిజల్ట్‌ షీట్‌)లో అగ్రస్థానంలో ఉండే బోల్ట్‌ బృందం తొలిసారి డీఎన్‌ఎఫ్‌ (డిడ్‌ నాట్‌ ఫినిష్‌–రేసును ముగించలేదు)తో కనబడింది.

అన్నీ స్వర్ణాలే...
ఇక్కడికి రాకముందు బోల్ట్‌ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. ఈ సారి కాంస్యం (100 మీ.) అంతకుముందు ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌ (2007)లో రజతాలు (200 మీ., 4గీ100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి.

ఆ పోజు ఇక చరిత్రే...
పరుగుల చిరుతగా చరిత్రకెక్కిన బోల్ట్‌ రేసును విజయనాదంతో ముగించగానే ‘లైట్‌నింగ్‌ బోల్ట్‌’గా రెండు చేతుల్ని ఆకాశానికెత్తి చూపించే ‘టు ద వరల్డ్‌’ పోజు ఇక చరిత్రలో కలిసిపోయింది. మైదానంలో, టీవీల్లో ఇక ప్రత్యక్షంగా కనిపించదు.

‘బోల్ట్‌ గాయం నన్ను బాధపెట్టింది. నేను అర్థం చేసుకోగలను. టీవీల కోసం, ఇతరత్రా హైలైట్ల కోసం మమ్మల్ని నిరీక్షించేలా చేశారు. కానీ ట్రాక్‌ సూట్లను విడిచి రేస్‌కు సిద్ధం కావడంతో చలి కాస్త ఇబ్బంది పెట్టింది. అలా చాలాసేపు ఉండటం ఫలితాన్ని ప్రభావితం చేసింది.’
– గాట్లిన్, రజతం నెగ్గిన అమెరికా రిలే జట్టు సభ్యుడు

నిర్వాహకులు మమ్మల్ని అదే పనిగా నిరీక్షణలో ఉంచారు. ఇది చాలా దుర్మార్గం. వార్మప్‌లో సుదీర్ఘ నిరీక్షణ వల్లే బోల్ట్‌ గాయపడ్డాడు. ఎవరైనా పోటీకి సిద్ధమై ఉండి... 20 నిమిషాల వెయిటింగ్‌లో ఉంచుతారా? దీని వల్లే ఆ దిగ్గజం (బోల్ట్‌) సతమతమయ్యాడు. పతకం గెలవకపోవడంతో బోల్ట్‌ సారీ చెప్పాడు. కానీ అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్‌లో అతనెంతో సాధించాడు.
– జమైకన్‌ అథ్లెట్‌ యోహన్‌ బ్లేక్‌

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement