బోల్ట్ ‘ట్రిపుల్’ ధమాకా
బీజింగ్ : బోల్ట్ బరిలో ఉంటే మిగతా వారు స్వర్ణ పతకం గురించి మర్చిపోవాలనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఈ జమైకా స్టార్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే 100, 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్ రేసుల్లో స్వర్ణ పతకాలను నెగ్గిన బోల్ట్... శనివారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో తన సహచరులు నెస్టా కార్టర్, అసఫా పావెల్, నికెల్ అష్మెడ్‌లతో కలిసి జమైకా జట్టును విజేతగా నిలిపాడు. జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో బోల్ట్‌కిది 11వ స్వర్ణం కాగా... ప్రస్తుత ఈవెంట్‌లో మూడో పసిడి పతకం కావడం విశేషం.
రిలే ఫైనల్లో బ్రొమెల్, జస్టిన్ గాట్లిన్, టైసన్ గే, మైక్ రోడ్జర్స్‌లతో కూడిన అమెరికా బృందం తొలుత రెండో స్థానాన్ని పొందినా... చివరి అంచెలో నిబంధనలకు విరుద్ధంగా టైసన్ గే నుంచి నిర్ణీత పరిధి దాటి రోడ్జర్స్ బ్యాటన్ అందుకున్నట్లు తేలడంతో రేసు ముగిసిన కొన్ని నిమిషాలకు నిర్వాహకులు అమెరికా జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో తొలుత కాంస్యం నెగ్గిన చైనా జట్టుకు రజతం, నాలుగో స్థానాన్ని పొందిన కెనడా జట్టుకు కాంస్యం ఖాయమయ్యాయి. మహిళల 4ఁ100 మీటర్ల రిలేలోనూ జమైకా జట్టు కే పసిడి పతకం లభించింది.
వెరోనికా, నటాషా, ఎలానీ థాంప్సన్, షెల్లీ ఫ్రేజర్‌లతో కూడిన జమైకా బృందం 41.07 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. డెకాథ్లాన్ ఈవెంట్ లో అమెరికా అథ్లెట్ యాష్టన్ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టిం చాడు. పది అంశాలతో కూడిన ఈ విభాగంలో ఈటన్ 9045 పాయిం ట్లు సంపాదించి... 9039 పాయింట్లతో ఇప్పటివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. భారత్‌కు చెందిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ (62.24 మీటర్లు) తొమ్మిదో స్థానాన్ని పొందగా... 50 కిలోమీటర్ల నడకలో సందీప్ కుమార్, మనీశ్ సింగ్ వరుసగా 26వ, 27వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.