Jamaica Star
-
'అదంతా అబద్ధం.. డబ్బు నాకు ముఖ్యం కాదు'
లెజెండరీ స్ప్రింటర్.. జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 97 కోట్ల 60 లక్షలు) మాయమైన సంగతి తెలిసిందే. కింగ్స్టన్ అనుబంధ కంపెనీలో స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్‌లో బోల్ట్ పెట్టుబడులు పెట్టగా.. షేర్స్‌లో నష్టాలు రావడంతో బోల్ట్ అనుమతి లేకుండానే అతని అకౌంట్ నుంచి డబ్బు మాయం చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం డబ్బులు మాయం చేసిన సంస్థపై కోర్టులో కేసు వేయగా విచారణ కొనసాగుతుంది. తాజాగా బోల్ట్ తన అకౌంట్ నుంచి డబ్బులు మాయమవడంపై స్పందించాడు. కోట్ల రూపాయలు నష్టపోవడంతో బోల్ట్ మానసికంగా కుంగిపోయాడని వార్తలు వచ్చాయి. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో బోల్ట్ ఆ వార్తలను ఖండించాడు. ''మనం కష్టపడి సంపాదించిన రూపాయి కళ్లముందే పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విషయం నాకు బాధాకరం.. చాలా నిరాశ చెందాను. అయితే నేను మానసిక వేదనకు గురయినట్లు కొన్ని వార్తలు వినిపించాయి. ఈ విషయంలో నాకు నేను కన్ఫ్యూజ్ అయ్యను. ఒక్క విషయం క్లారిటీగా చెప్తున్నా. డబ్బు పోయినందుకు బాధగానే ఉన్నప్పటికి మనసు మాత్రం ముక్కలవ్వలేదు. ఆ డబ్బు ఎలా రాబట్టుకోవాలనేది మా లాయర్లు చూసుకుంటారు. ఆ బాధ్యతను వారికి అప్పగించాను. నా ఫ్యామిలీని చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. మీకందరికి తెలుసు నాకు ముగ్గురు పిల్లలు.. వాళ్లతో పాటు నా తల్లిదండ్రులను కూడా చూసుకుంటున్నాను. ఈ పరిస్థితుల్లో అనవసర ఒత్తిడికి గురవ్వడం ఇష్టం లేదు. ఏం రాసిపెట్టుంటే అదే జరుగుతుంది.'' అని చెప్పుకొచ్చాడు. 2017లో అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పిన బోల్ట్.. దాదాపు పదేళ్ల పాటు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ ఈవెంట్స్‌ను శాసించాడు. 100, 200, 400 మీటర్ల విభాగంలో పరుగుల రారాజుగా నిలిచిపోయాడు. వరుసగా ఎనిమిదిసార్లు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన ఉసెన్ బోల్ట్ ఎవరికి సాధ్యం కాని రికార్డు నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. చదవండి: భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్ -
బోల్ట్‌కు గాయం
ఒలింపిక్స్‌కు ముందే కోలుకునే అవకాశం కింగ్స్టన్: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రియో ఒలింపిక్స్‌కు ముందు గాయపడ్డాడు. జమైకా నేషనల్ ఒలింపిక్ ట్రయల్స్‌లో శుక్రవారం జరిగిన 100మీ. సెమీఫైనల్ హీట్‌ను 10.04 సెకన్లలో ముగించి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ రేసు అనంతరం బోల్ట్ మోకాలు పైభాగంలో అసౌకర్యానికి గుర య్యాడు. ప్రస్తుతం బోల్ట్ తొడ కండరం నొప్పిని గ్రేడ్-1గా వైద్యులు నిర్ధారించారు. అయితే బోల్ట్ రియో ఆశలకు ఎలాంటి ప్రమాదం లేదు. మరో మూడు వారాల్లో లండన్‌లో జరగనున్న డైమండ్ లీగ్ ద్వారా బోల్ట్ రియో బెర్తు దక్కించుకోవచ్చు. -
ఈ ఏడాది ఇక ‘పరుగు’ లేదు
ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఈ ఏడాది పరుగుకు పుల్‌స్టాప్ పెట్టేశాడు. ఇటీవల చైనాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణ పతకాలు సాధించిన ఈ జమైకా స్టార్ వచ్చే ఏడాది ఆరంభం వరకు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బోల్ట్ డైమండ్ లీగ్ ఫైనల్లో బరిలోకి దిగడం లేదు. ఒలింపిక్స్‌కు ముందు ఎలాంటి గాయాలకు తావివ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోల్ట్ ప్రకటించాడు. -
బోల్ట్ ‘ట్రిపుల్’ ధమాకా
బీజింగ్ : బోల్ట్ బరిలో ఉంటే మిగతా వారు స్వర్ణ పతకం గురించి మర్చిపోవాలనే విషయాన్ని మరోసారి నిరూపిస్తూ ఈ జమైకా స్టార్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మూడో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే 100, 200 మీటర్ల వ్యక్తిగత స్ప్రింట్ రేసుల్లో స్వర్ణ పతకాలను నెగ్గిన బోల్ట్... శనివారం జరిగిన పురుషుల 4ఁ100 మీటర్ల రిలేలో తన సహచరులు నెస్టా కార్టర్, అసఫా పావెల్, నికెల్ అష్మెడ్లతో కలిసి జమైకా జట్టును విజేతగా నిలిపాడు. జమైకా బృందం 37.36 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో బోల్ట్కిది 11వ స్వర్ణం కాగా... ప్రస్తుత ఈవెంట్లో మూడో పసిడి పతకం కావడం విశేషం. రిలే ఫైనల్లో బ్రొమెల్, జస్టిన్ గాట్లిన్, టైసన్ గే, మైక్ రోడ్జర్స్లతో కూడిన అమెరికా బృందం తొలుత రెండో స్థానాన్ని పొందినా... చివరి అంచెలో నిబంధనలకు విరుద్ధంగా టైసన్ గే నుంచి నిర్ణీత పరిధి దాటి రోడ్జర్స్ బ్యాటన్ అందుకున్నట్లు తేలడంతో రేసు ముగిసిన కొన్ని నిమిషాలకు నిర్వాహకులు అమెరికా జట్టుపై అనర్హత వేటు వేశారు. దాంతో తొలుత కాంస్యం నెగ్గిన చైనా జట్టుకు రజతం, నాలుగో స్థానాన్ని పొందిన కెనడా జట్టుకు కాంస్యం ఖాయమయ్యాయి. మహిళల 4ఁ100 మీటర్ల రిలేలోనూ జమైకా జట్టు కే పసిడి పతకం లభించింది. వెరోనికా, నటాషా, ఎలానీ థాంప్సన్, షెల్లీ ఫ్రేజర్లతో కూడిన జమైకా బృందం 41.07 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్లకు రజత, కాంస్య పతకాలు దక్కాయి. డెకాథ్లాన్ ఈవెంట్ లో అమెరికా అథ్లెట్ యాష్టన్ ఈటన్ ప్రపంచ రికార్డు సృష్టిం చాడు. పది అంశాలతో కూడిన ఈ విభాగంలో ఈటన్ 9045 పాయిం ట్లు సంపాదించి... 9039 పాయింట్లతో ఇప్పటివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును తిరగరాశాడు. భారత్‌కు చెందిన డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ (62.24 మీటర్లు) తొమ్మిదో స్థానాన్ని పొందగా... 50 కిలోమీటర్ల నడకలో సందీప్ కుమార్, మనీశ్ సింగ్ వరుసగా 26వ, 27వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. -
బోల్ట్‌నే పడేశాడు..!
నాలుగోసారి 200 మీటర్ల ప్రపంచ టైటిల్ బోల్ట్ కైవసం ♦ 19.55 సెకన్లలో గమ్యానికి చేరిన జమైకా స్టార్ ♦ రెండో స్థానంలోనే గాట్లిన్ పరుగుకు ప్రాణం ఉంటే అలసిపోయేదేమో...! వేగానికి రెక్కలు ఉంటే విలవిలలాడిపోయేవేమో...! భువికే అనుభూతి ఉంటే నిలువెల్లా వణికిపోయేదేమో...! లేడి పిల్ల కోసం పులి పరుగుపెట్టినట్లుగా... మానవ చిరుత ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులో ప్రకంపనలు సృష్టించాడు. బుల్లెట్‌కు సైతం భయం పుట్టేలా... ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ... గాట్లిన్తో సహా యోధులు, ధీరులు అనుకున్న అందర్ని తన వేగంతో వేటాడేశాడు. రికార్డులు తిరగరాయకపోయినా... పరుగులో తనను కొట్టే మొనగాడే లేడని మరోసారి నిరూపించాడు. బీజింగ్ : స్ప్రింట్‌లో అలుపెరుగని యోధుడిలా దూసుకుపోతున్న జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులోనూ తడఖా చూపెట్టాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగును బోల్ట్ 19.55 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని సాధించాడు. దీంతో వరుసగా నాలుగోసారి తన ఖాతాలో పసిడిని జమ చేసుకున్నాడు. అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకన్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 19.87 సెకన్లలో రేసును ముగించిన జొబోడావాన్ (దక్షిణాఫ్రికా)కు కాంస్యం దక్కింది. 2008 ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించిన బోల్ట్... ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చూపెట్టాడు. చివరి 12 వ్యక్తిగత ఒలింపిక్స్, వరల్డ్ స్ప్రింట్ టైటిల్స్‌లో బోల్ట్ 11 గెలవడం విశేషం. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును తప్పుగా మొదలుపెట్టి అనర్హతకు గురయ్యాడు. ఈ సీజన్లో నడుం సమస్యలతో ఇబ్బందిపడుతున్న బోల్ట్... 2009లో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డు (19.19 సెకన్లు)పై గురిపెట్టలేకపోయాడు. ఆరంభం అదుర్స్... ఈసారి గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఉంటుందని భావించినా.. రేసు మొత్తంలో ఎక్కడా ఇది కనబడలేదు. అద్భుతమైన ఆరంభంతో బోల్ట్.. సహచరుల కంటే చాలా ముందుగా దూసుకుపోయాడు. మరోవైపు గాట్లిన్ తొలి 100 మీటర్లలో కాస్త వెనుకబడినా... తర్వాతి 50 మీటర్లలో బాగా పుంజుకున్నాడు. కానీ జార్నెల్ హ్యూజ్ (బ్రిటన్), జొబోడావాన్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. బోల్ట్ మాత్రం తన సహజశైలిలో భారీ కటౌట్‌ను గాలి దిశకు అనుకూలంగా మల్చుకుంటూ చిరుతలా దూసుకుపోయాడు. తన పొడవైన కాళ్లతో ఒక్కో అడుగు వేస్తూ తొలి 100 మీటర్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టాడు. నడుం నొప్పితో ఆరు వారాలు శిక్షణకు దూరంగా ఉన్నా... రేసు ముగింపులో తనదైన ముద్రను చూపెట్టాడు. ఫైనల్లో వికాస్ భారత మేటి అథ్లెట్ వికాస్ గౌడ.. పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్లో ఫైనల్ రౌండ్‌కు చేరాడు. గ్రూప్-ఎ అర్హత పోటీల్లో వికాస్ తొలి ప్రయత్నంలో ఇనుప గుండును 63.86 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ఏడో స్థానంతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. శనివారం ఫైనల్ రౌండ్ పోటీలు జరుగుతాయి. బోల్ట్‌నే పడేశాడు..! ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో తాను స్వర్ణం గెలుస్తానని ముందే ఊహించినట్లు బోల్ట్ చెప్పాడు. కానీ అతను ఊహించని అనూహ్య ఘటన ట్రాక్‌పైనే జరిగింది. రేస్‌లో మొదటి స్థానంలో నిలిచాక సంబరంగా మైదానం అంతా తిరుగుతున్న బోల్ట్‌కు కెమెరామెన్ రూపంలో ప్రమాదం ఎదురైంది. చక్రాలతో ఉండే ‘సెగ్వే’పై బోల్ట్‌కు సమాంతరంగా అతడిని షూట్ చేస్తూ వస్తున్న కెమెరామెన్ అదుపు తప్పి పక్కనున్న రెయిలింగ్‌ను ఢీ కొన్నాడు. తనను తాను నియంత్రించుకోలేక అతను ఒక్కసారిగా బోల్ట్‌ను ఢీకొన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన బోల్ట్ బొక్కబోర్లా పడిపోయాడు. సెగ్వే నేరుగా బోల్ట్ మోకాలి కింది భాగంలోనే తాకింది. అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతుండగా ప్రమాదం లేదంటూ స్టార్ స్ప్రింటర్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. ఆ ‘బంగారు కాళ్ల’ విలువ ఏమిటో ప్రపంచానికి తెలుసు. నిజంగా ఏదైనా పెద్ద గాయం తగిలి ఉంటే బోల్ట్ కెరీరే ముగిసేపోయేదేమో! పెద్ద ప్రమాదం తప్పిన అనంతరం ‘అతను నన్ను చంపాలని చూశాడు’ అంటూ బోల్ట్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం. -
‘డైమండ్’ బోల్ట్
జ్యూరిచ్: జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఇటీవల మాస్కోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన బోల్ట్ అదే జోరును డైమండ్ లీగ్ మీట్లోనూ కొనసాగించాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల 100 మీటర్ల రేసులో బోల్ట్ విజేతగా నిలిచాడు. అతను ఈ రేసును 9.90 సెకన్లలో పూర్తి చేశాడు. నికెల్ (జమైకా,9.94 సెకన్లు), జస్టిన్ గాట్లిన్ (అమెరికా, 9.96 సెకన్లు) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. వచ్చే నెల 6న బ్రస్సెల్స్‌లో జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో బోల్ట్ పోటీపడే అవకాశముంది. ‘పూర్తి ఫిట్‌గా లేకపోయినా పరిగెత్తాను. సీజన్ కొనసాగుతున్నకొద్దీ నేను అలసిపోతాను. ఎలాంటి గాయాలు లేకుండా సీజన్‌ను ముగించాలని భావిస్తున్నాను’ అని బోల్ట్ వ్యాఖ్యానించాడు.