బోల్ట్‌నే పడేశాడు..! | Bolt won the 200 meters world title for the fourth time | Sakshi
Sakshi News home page

బోల్ట్‌నే పడేశాడు..!

Published Fri, Aug 28 2015 9:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

బోల్ట్‌నే పడేశాడు..!

బోల్ట్‌నే పడేశాడు..!

నాలుగోసారి 200 మీటర్ల ప్రపంచ టైటిల్ బోల్ట్ కైవసం

♦ 19.55 సెకన్లలో గమ్యానికి చేరిన జమైకా స్టార్
♦ రెండో స్థానంలోనే గాట్లిన్
 
 పరుగుకు ప్రాణం ఉంటే అలసిపోయేదేమో...! వేగానికి రెక్కలు ఉంటే విలవిలలాడిపోయేవేమో...! భువికే అనుభూతి ఉంటే నిలువెల్లా వణికిపోయేదేమో...! లేడి పిల్ల కోసం పులి పరుగుపెట్టినట్లుగా... మానవ చిరుత ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులో ప్రకంపనలు సృష్టించాడు.  బుల్లెట్‌కు సైతం భయం పుట్టేలా... ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ... గాట్లిన్‌తో సహా యోధులు, ధీరులు అనుకున్న అందర్ని తన వేగంతో వేటాడేశాడు. రికార్డులు తిరగరాయకపోయినా... పరుగులో తనను కొట్టే మొనగాడే లేడని మరోసారి నిరూపించాడు.
 
 బీజింగ్ : స్ప్రింట్‌లో అలుపెరుగని యోధుడిలా దూసుకుపోతున్న జమైకా స్టార్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్... 200 మీటర్ల రేసులోనూ తడఖా చూపెట్టాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా గురువారం జరిగిన పురుషుల 200 మీటర్ల పరుగును బోల్ట్ 19.55 సెకన్లలో ముగించి స్వర్ణాన్ని సాధించాడు. దీంతో వరుసగా నాలుగోసారి తన ఖాతాలో పసిడిని జమ చేసుకున్నాడు. అమెరికా స్టార్ స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ 19.74 సెకన్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు.

19.87 సెకన్లలో రేసును ముగించిన జొబోడావాన్ (దక్షిణాఫ్రికా)కు కాంస్యం దక్కింది. 2008 ఒలింపిక్స్‌లో ఇదే వేదికపై రెండు విభాగాల్లో స్వర్ణాలు సాధించిన బోల్ట్... ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని చూపెట్టాడు. చివరి 12 వ్యక్తిగత ఒలింపిక్స్, వరల్డ్ స్ప్రింట్ టైటిల్స్‌లో బోల్ట్ 11 గెలవడం విశేషం. 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసును తప్పుగా మొదలుపెట్టి అనర్హతకు గురయ్యాడు. ఈ సీజన్‌లో నడుం సమస్యలతో ఇబ్బందిపడుతున్న బోల్ట్... 2009లో తాను నెలకొల్పిన ప్రపంచ రికార్డు (19.19 సెకన్లు)పై గురిపెట్టలేకపోయాడు.

 ఆరంభం అదుర్స్...
 ఈసారి గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఉంటుందని భావించినా.. రేసు మొత్తంలో ఎక్కడా ఇది కనబడలేదు. అద్భుతమైన ఆరంభంతో బోల్ట్.. సహచరుల కంటే చాలా ముందుగా దూసుకుపోయాడు. మరోవైపు గాట్లిన్ తొలి 100 మీటర్లలో కాస్త వెనుకబడినా... తర్వాతి 50 మీటర్లలో బాగా పుంజుకున్నాడు. కానీ జార్నెల్ హ్యూజ్ (బ్రిటన్), జొబోడావాన్‌ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్నాడు. బోల్ట్ మాత్రం తన సహజశైలిలో భారీ కటౌట్‌ను గాలి దిశకు అనుకూలంగా మల్చుకుంటూ చిరుతలా దూసుకుపోయాడు. తన పొడవైన కాళ్లతో ఒక్కో అడుగు వేస్తూ తొలి 100 మీటర్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టాడు. నడుం నొప్పితో ఆరు వారాలు శిక్షణకు దూరంగా ఉన్నా... రేసు ముగింపులో తనదైన ముద్రను చూపెట్టాడు.

 ఫైనల్లో వికాస్
 భారత మేటి అథ్లెట్ వికాస్ గౌడ.. పురుషుల డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఫైనల్ రౌండ్‌కు చేరాడు. గ్రూప్-ఎ అర్హత పోటీల్లో వికాస్ తొలి ప్రయత్నంలో ఇనుప గుండును 63.86 మీటర్ల దూరం విసిరాడు. దీంతో ఏడో స్థానంతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. శనివారం ఫైనల్ రౌండ్ పోటీలు జరుగుతాయి.
 
 బోల్ట్‌నే పడేశాడు..!
 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 200 మీటర్ల పరుగులో తాను స్వర్ణం గెలుస్తానని ముందే ఊహించినట్లు బోల్ట్ చెప్పాడు. కానీ అతను ఊహించని అనూహ్య ఘటన ట్రాక్‌పైనే జరిగింది. రేస్‌లో మొదటి స్థానంలో నిలిచాక సంబరంగా మైదానం అంతా తిరుగుతున్న బోల్ట్‌కు కెమెరామెన్ రూపంలో ప్రమాదం ఎదురైంది. చక్రాలతో ఉండే ‘సెగ్‌వే’పై బోల్ట్‌కు సమాంతరంగా అతడిని షూట్ చేస్తూ వస్తున్న కెమెరామెన్ అదుపు తప్పి పక్కనున్న రెయిలింగ్‌ను ఢీ కొన్నాడు.

తనను తాను నియంత్రించుకోలేక అతను ఒక్కసారిగా బోల్ట్‌ను ఢీకొన్నాడు. దాంతో పట్టు కోల్పోయిన బోల్ట్ బొక్కబోర్లా పడిపోయాడు. సెగ్‌వే నేరుగా బోల్ట్ మోకాలి కింది భాగంలోనే తాకింది. అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురవుతుండగా ప్రమాదం లేదంటూ స్టార్ స్ప్రింటర్ చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు. ఆ ‘బంగారు కాళ్ల’ విలువ ఏమిటో ప్రపంచానికి తెలుసు. నిజంగా ఏదైనా పెద్ద గాయం తగిలి ఉంటే బోల్ట్ కెరీరే ముగిసేపోయేదేమో! పెద్ద ప్రమాదం తప్పిన అనంతరం ‘అతను నన్ను చంపాలని చూశాడు’ అంటూ బోల్ట్ సరదాగా వ్యాఖ్యానించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement