Gatlin
-
నేను తప్పు చేయలేదు: గాట్లిన్
లండన్: ప్రపంచ స్ప్రింట్ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ తన శిక్షణ సిబ్బంది నిర్వాకంపై స్పందించాడు. ఓ బ్రిటిష్ దినపత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో తన కోచ్ మిచెల్, ఏజెంట్ వాగ్నర్ ఇద్దరు నిషేధిత ఉత్ప్రేరకాలు అమ్మేందుకు సిద్ధపడినట్లు తేలింది. ఈ వీడియో టేపులు అథ్లెట్ వర్గాల్లో పెను దుమారం రేపింది. దీనిపై 35 ఏళ్ల అమెరికన్ స్ప్రింట్ స్టార్ గాట్లిన్ మాట్లాడుతూ... వారిద్దరి నిర్వాకంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. ‘నా కోచ్, ఏజెం ట్ ఈ డోపింగ్ స్కామ్‌లో ఉండటం చూసి... నేను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యా. ఆశ్చర్యపోయా. వెంటనే వాళ్లిద్దరిని తొలగించా. నేను మాత్రం ఏ తప్పూ చేయలేదు. ఇప్పటికే రెండు సార్లు డోపీగా శిక్ష అనుభవించిన నేను మళ్లీ వాటి జోలికి వెళ్లలేదు’ అని గాట్లిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. -
ప్రపంచ చాంపియన్ గాట్లిన్‌కు మొండిచేయి
పారిస్: అయ్యో పాపం... గాట్లిన్! 100 మీటర్ల విభాగంలో ఇటీవలే ‘ట్రిపుల్ ఒలింపిక్ చాంపియన్’ ఉసేన్ బోల్ట్‌నే ఓడించి ప్రపంచ చాంపియన్ కూడా అయ్యాడు. కానీ గతం తాలుకు చేదు అనుభవం నీడలా వెంటాడుతోంది. గతంలో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో రెండేళ్ల నిషేధానికి గురైన ఈ వివాదాస్పద అథ్లెట్‌ను అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్)‘వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు జాబితా నుంచి తప్పించింది. 2017 ఏడాదికి సంబంధించి రూపొందించిన ఈ తుది జాబితాలో 10 మంది చొప్పున పురుష అథ్లెట్లు, మహిళా అథ్లెట్లు ఉన్నారు. కానీ ఇందులో గాట్లిన్‌కు మాత్రం చోటు దక్కలేదు. 2004 తర్వాత తుది జాబితాలో అతను స్థానం కోల్పోవడం ఇదే తొలిసారి. ఐఏఏఎఫ్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 2015 నుంచి మారిన నిబంధనల ప్రకారం శిక్ష అనుభవించిన డోపీలకు ఇందులో చోటు లేదని తేల్చింది. -
గుండెల్లో 'బోల్ట్' దిగింది!
►ట్రాక్‌పై బోల్ట్ విలవిల ►గాయంతో ఆగిన పరుగు ►పతకం లేకుండానే కెరీర్‌కు వీడ్కోలు జీవితంలో రెండు ఘటనలు ఎప్పుడూ జరగవని నమ్మాను... ఒకటి బోల్ట్ ఓడిపోవడం, రెండు బోల్ట్ పరుగు పూర్తి చేయలేకపోవడం... కానీ వారం వ్యవధిలో ఈ రెండింటినీ చూసేశాను... ఒక అభిమాని బాధ ఇది. నంబర్‌వన్‌గా నిలవకుండా మూడో స్థానంలో వచ్చిన రోజే ఆ పరుగు తడబడుతోందని అర్థమైంది. కానీ ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరో అవకాశం ఉందని ప్రపంచం సర్ది చెప్పుకుంది. కానీ ఆ వేదన ఇప్పుడు రెట్టింపయింది. బంగారు పతకాన్ని అందుకోవటాన్ని మార్నింగ్ వాక్కు వెళ్లినంత సులువుగా మార్చుకున్న ఆ పాదాలు... చివరకు దారి మధ్యలోనే ఆగిపోయాయి. మరో పది అంగల్లో ఎదురుగా లక్ష్యం కనిపిస్తున్నా ఇక నా వల్ల కాదంటూ, అడుగు పడలేదంటూ మొరాయించాయి. అవును...ఉసేన్ బోల్ట్ పరుగు పరాజయంతో ముగిసిపోయింది. ఇక ఈ ‘బ్యాటన్’ను ముందుకు తీసుకువెళ్లలేను అన్నట్లుగా కుప్పకూలిపోయి అతను పరుగు చాలించాడు. ట్రాక్‌కు కళ్లు లేవు... లేదంటే కన్నీరు కార్చేది. పతకానికి నోరు లేదు... ఉంటే గోడు వెళ్లబోసుకునేది. బ్యాటన్‌కు హృదయం లేదు... ఉంటే ద్రవించేది. నిజమే! వాటికి ఇవేవీ లేవు కాబట్టే... బోల్ట్ కథని ఇలా ముగించాయి. పరుగే ప్రాణంగా... పతకమే శ్వాసగా... విజయమే లక్ష్యంగా... ఇన్నాళ్లు సాగిన పయనం చివరకు విషాద గాయంతో ముగిసింది. బోల్ట్ అంటే చిరుత. బోల్ట్ అంటే విజేత. అతని అడుగుల వేగానికి మురిసిపోయిన అథ్లెటిక్స్ ట్రాక్‌లు కూడా ఇకపై వెక్కివెక్కి ఏడుస్తాయేమో! కానీ నిజం. ఈ వీడ్కోలు బాధించింది. 4గీ100 మీటర్ల రిలేలో విజయం చేరువైనంతలోపే దూరమైంది. పది సెకన్ల కాలం తీరని వేదనను మిగిల్చింది. పాదాల తాకిడినే మధుర స్పర్శగా భావించే ట్రాక్‌కు గుండె పగిలినంత పనైంది. బరిలోకి దిగితే పతకాల పనిపట్టే ఓ యోధుడి చివరి మజిలీ ఇలా అర్ధంతరంగా ముగిసింది. లక్ష్యం చేరే చివరి అంచెలో రాకాసి గాయం బోల్ట్‌కు అనుకోని విషాదాన్ని మిగిల్చింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కే ఊహించని మలుపునిచ్చింది. లండన్: ఒక్క ఉసేన్ బోల్ట్నో... కోట్లాది మంది అభిమానుల్నో... ఆతిథ్య వేదికనో కాదు... యావత్ అథ్లెటిక్స్ ప్రపంచాన్నే నిరాశకు గురి చేసిన దృశ్యం ఆవిష్కృతమైంది. బోల్ట్ చివరి పరుగు అనూహ్యంగా ముగిసింది. కళ్లకు అందని విషాదాన్ని మిగిల్చింది. తొడ కండరాల గాయంతో జమైకన్ స్టార్ ట్రాక్‌పైనే కూలబడ్డాడు. మెరుపు టైమింగ్‌లతో రికార్డులు బద్దలు కొట్టిన అతని పరుగు అసలు లక్ష్యాన్నే పూర్తిచేయకపోవడం కెరీర్లో ఇదే తొలిసారి. చివరిసారి కూడా! క్రీడాలోకమే మూగబోయే రేస్ శనివారం అర్ధరాత్రి జరిగింది. పురుషుల 4గీ100 మీటర్ల రిలేలో బోల్ట్ పూర్తిగా విఫలమయ్యాడు. ఎప్పట్లాగే నాలుగో రేసర్‌గా బోల్ట్ చివరి అంచెలో ట్రాక్‌పై సిద్ధంగా ఉన్నాడు. సహచరుడు యోహన్ బ్లేక్ నుంచి బ్యాటన్‌ను అందుకున్న బోల్ట్ రివ్వున దూసుకెళ్తున్నాడు. అతని కంటే ముందు ఇద్దరే ఉన్నారు. ఇంకో ఏడెనిమిది సెకన్లలో స్వర్ణం, లేదంటే రజతంతో ముగించే రేసును ఎడమ తొడ కండరాల గాయం మింగేసింది. అంతే బోల్ట్ విలవిలలాడాడు. జమైకన్ ప్రజలు, అభిమానుల ‘బోల్ట్... బోల్ట్...’ కేకలు ఒక్కసారిగా నిశబ్దాన్ని ఆవహించాయి. రేసు ముగియకుండానే కెరీర్ ముగిసింది. అయ్యో... బోల్ట్‌కు ఏమిటీ విషమ పరీక్ష అంటూ క్రీడాలోకమే నివ్వెరపోయింది. నిజానికి ఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు బోల్టే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన బోల్ట్‌పైనే అందరి కళ్లున్నాయి. కానీ ఆ కళ్లే అతని ట్రాక్ విలాపాన్ని చూశాయి. సరిగ్గా ఐదేళ్ల క్రితం (2012)... ఇదే ఒలింపిక్ స్టేడియంలో బోల్ట్ తన బీజింగ్ (2008) విశ్వరూపాన్ని మరోమారు కళ్లకు కట్టాడు. ట్రిపుల్ గోల్డ్ చాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకొని ప్రపంచంలోనే చురుకైన దిగ్గజంగా ఘనతకెక్కాడు. ఇప్పుడు మాత్రం కెరీర్‌ను వీడాల్సిన సమయంలో పతకాన్ని జారవిడుచుకోవాల్సి వస్తుందని ఏ ఒక్కరు కూడా ఊహించి ఉండరు. కానీ ఊహకందనిదే జరిగింది. బోల్ట్ పరుగు పూర్తిచేయకుండానే... టైమింగ్ నమోదు కాకుండానే రేసు ఓటమితో ముగిసింది. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 40 నిమిషాలకు జరిగిన ఈ రిలే రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. కూలబడిన బోల్ట్‌ను సహచరులు మెక్లీడ్, జులియన్ ఫోర్ట్, బ్లేక్‌లు ఊరడించారు. ట్రాక్‌పై అతని వెన్నంటే నడిచి రేస్‌ను తోడుగా ముగించి వీడ్కోలు పలికించారు. ఫలితాల జాబితాలో డీఎన్‌ఎఫ్... రికార్డు టైమింగ్‌లతో లేదంటే విజయ బావుటాతో ఫలితం జాబితా (రిజల్ట్ షీట్)లో అగ్రస్థానంలో ఉండే బోల్ట్ బృందం తొలిసారి డీఎన్‌ఎఫ్ (డిడ్ నాట్ ఫినిష్–రేసును ముగించలేదు)తో కనబడింది. అన్నీ స్వర్ణాలే... ఇక్కడికి రాకముందు బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. ఈ సారి కాంస్యం (100 మీ.) అంతకుముందు ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4గీ100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. ఆ పోజు ఇక చరిత్రే... పరుగుల చిరుతగా చరిత్రకెక్కిన బోల్ట్ రేసును విజయనాదంతో ముగించగానే ‘లైట్నింగ్ బోల్ట్’గా రెండు చేతుల్ని ఆకాశానికెత్తి చూపించే ‘టు ద వరల్డ్’ పోజు ఇక చరిత్రలో కలిసిపోయింది. మైదానంలో, టీవీల్లో ఇక ప్రత్యక్షంగా కనిపించదు. ‘బోల్ట్ గాయం నన్ను బాధపెట్టింది. నేను అర్థం చేసుకోగలను. టీవీల కోసం, ఇతరత్రా హైలైట్ల కోసం మమ్మల్ని నిరీక్షించేలా చేశారు. కానీ ట్రాక్ సూట్లను విడిచి రేస్‌కు సిద్ధం కావడంతో చలి కాస్త ఇబ్బంది పెట్టింది. అలా చాలాసేపు ఉండటం ఫలితాన్ని ప్రభావితం చేసింది.’ – గాట్లిన్, రజతం నెగ్గిన అమెరికా రిలే జట్టు సభ్యుడు నిర్వాహకులు మమ్మల్ని అదే పనిగా నిరీక్షణలో ఉంచారు. ఇది చాలా దుర్మార్గం. వార్మప్‌లో సుదీర్ఘ నిరీక్షణ వల్లే బోల్ట్ గాయపడ్డాడు. ఎవరైనా పోటీకి సిద్ధమై ఉండి... 20 నిమిషాల వెయిటింగ్లో ఉంచుతారా? దీని వల్లే ఆ దిగ్గజం (బోల్ట్) సతమతమయ్యాడు. పతకం గెలవకపోవడంతో బోల్ట్ సారీ చెప్పాడు. కానీ అతను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్లో అతనెంతో సాధించాడు. – జమైకన్ అథ్లెట్ యోహన్ బ్లేక్ -
ప్రేక్షకుల తీరు మారలేదు!
బహుమతి ప్రదానోత్సవ సమయంలో గాట్లిన్‌కు మళ్లీ వెక్కిరింతలు లండన్: ఒకవైపు అభిమాన ఆటగాడు బోల్ట్ ఓడిన అసంతృప్తి... మరోవైపు విజేతగా నిలిచిన వ్యక్తి గతంలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి తిరిగొచ్చినవాడు... దాంతో రేసు ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు తమ అసహనాన్ని దాచుకోలేకపోయారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా దానిని ప్రదర్శించారు. బోల్ట్ కాంస్య పతకం అందుకునే సమయంలో మైదానం మారుమోగేలా చప్పట్లతో అభినందించిన వారు గాట్లిన్ పేరు రాగానే ‘డోపీ... డోపీ...డోపీ’ అంటూ మళ్లీ వెక్కిరించారు. స్టేడియంలో ఒక మూలన కొంత మంది గాట్లిన్‌కు మద్దతు తెలిపినా... ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు గేలి చేయడాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో గాట్లిన్ మాత్రం ఎలాంటి భావోద్వేగాలు కనబర్చలేదు. అమెరికా జాతీయ గీతం వినిపించే సమయంలో గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిలబడ్డాడు. -
కొత్త స్టార్ వచ్చాడు...
రియో ఒలింపిక్స్ తర్వాత అంతగా ఫామ్‌లో లేని బోల్ట్‌కు గాట్లిన్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని... అయితే గతంలో మాదిరిగానే ఈసారీ గాట్లిన్‌ను బోల్ట్ ఓడిస్తాడని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బోల్ట్‌కు గాట్లిన్ నుంచి కాకుండా అమెరికాకే చెందిన 21 ఏళ్ల రైజింగ్ స్టార్ క్రిస్టియన్ కోల్మన్ నుంచి పోటీ ఎదురైంది. రెండు గంటల వ్యవధిలో బోల్ట్‌ను (సెమీఫైనల్, ఫైనల్) రెండుసార్లు ఓడించిన కోల్మన్ 100 మీటర్ల విభాగంలో భవిష్యత్ తారగా తెరపైకి వచ్చాడు. బోల్ట్, గాట్లిన్ రిటైర్మెంట్ తర్వాత 100 మీటర్ల ఈవెంట్‌కు ఆదరణ తగ్గకుండా తాను ఉన్నానని తాజా ప్రదర్శనతో కోల్మన్ నిరూపించుకున్నాడు. -
వెక్కిరింతల నడుమ విజయం...
గతంలో రెండుసార్లు (2001లో, 2006లో) డోపింగ్‌లో దొరికిపోయి ఆరేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న 35 ఏళ్ల జస్టిన్ గాట్లిన్ తాజా ఫలితంతో సంబరాలు చేసుకున్నాడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై బోల్ట్‌ను ఓడించాలని ఐదుసార్లు ప్రయత్నించి నాలుగుసార్లు రెండో స్థానంతో, మరోసారి మూడో స్థానంతో సరిపెట్టుకున్న గాట్లిన్ ఈసారి మాత్రం తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. డోపింగ్ నేపథ్యం ఉండటంతో... లండన్ ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్‌లో మాదిరిగా ఈసారీ గాట్లిన్‌కు ప్రేక్షకుల నుంచి వెక్కిరింతలు ఎదురయ్యాయి. హీట్స్‌లో, సెమీఫైనల్లో, ఫైనల్లో అతను ట్రాక్‌పై వచ్చినపుడు, అతడిని పరిచయం చేసినపుడు ప్రేక్షకులు గోల చేశారు. అయినా ఇవేమీ పట్టించుకోని గాట్లిన్ ఆఖరికి విజేతగా నిలిచి అందరి నోళ్లు మూయించాడు. రేసు పూర్తయ్యాక ఫలితం వచ్చిన వెంటనే గాట్లిన్... బోల్ట్‌కు ఎదురువెళ్లి మోకాళ్లపై కూర్చొని అభివాదం చేసి తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. మరోవైపు గాట్లిన్ విజయానికి అర్హుడని, అతనికి వెక్కిరింతలు అవసరంలేదని బోల్ట్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ పోటీల్లో 100 మీటర్ల ఫైనల్ రేసులో బోల్ట్‌కు ఎదురైన రెండో ఓటమి ఇదే కావడం గమనార్హం. చివరిసారి 2013 జూన్‌లో రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో బోల్ట్‌కు గాట్లిన్ చేతిలోనే ఓటమి ఎదురైంది. -
చిరుత చిన్నబోయింది!
కలయా... నిజమా! పదేళ్లుగా 100 మీటర్ల ట్రాక్‌పై తన విశ్వరూపం ప్రదర్శించిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ కెరీర్ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు. విశ్వవ్యాప్తంగా తన అభిమానులందరినీ నిరాశపరిచాడు. సెమీస్‌లో నెమ్మదిగా పరుగెత్తి రెండో స్థానంలో నిలిస్తే... ఫైనల్ రేసు కోసం వ్యూహాత్మకంగా బోల్ట్ తన శక్తినంతా దాచుకున్నాడని అందరూ భావించారు. కానీ అసలు రేసులోనూ ఈ జమైకా దిగ్గజం తడబడ్డాడు. ఈ క్రమంలో విశ్వవేదికపై తన కెరీర్లో చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. లండన్: అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ట్రాక్‌పై అడుగు పెడితే స్వర్ణం తప్ప మరో పతకం ఊహించని ఉసేన్ బోల్ట్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. చివరిసారి 100 మీటర్ల రేసులో బరిలోకి దిగి పసిడి పతకంతో కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు పలకాలని బోల్ట్ ఆశించగా... అమెరికా వెటరన్ స్టార్ జస్టిన్ గాట్లిన్ నమ్మశక్యంకాని రీతిలో బోల్ట్‌కు షాక్ ఇచ్చి జమైకా దిగ్గజం ఆశలను అడియాసలు చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 15 నిమిషాలకు విఖ్యాత లండన్ ఒలింపిక్ స్టేడియంలో 60 వేల మంది ప్రేక్షకుల నడుమ పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసు జరిగింది. ఎనిమిది మంది బరిలోకి దిగిన ఈ ఫైనల్లో గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా) 9.94 సెకన్లతో రెండో స్థానం, ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానం సంపాదించారు. ఆరంభం నుంచే వెనుకంజ... సాధారణంగా రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తి... ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచి... చివర్లో తన ప్రత్యర్థులను వెనక్కి నెడుతూ లక్ష్యం వైపు దూసుకుపోవడం బోల్ట్ శైలి. కానీ ఈ రేసులో మాత్రం అలా జరగలేదు. రేసు మొదలైన క్షణం నుంచే బోల్ట్ వెనుకబడ్డాడు. రేసు ప్రారంభించడానికి ఎనిమిది మంది అథ్లెట్స్ తీసుకున్న స్పందన సమయంలో బోల్ట్ ఏడో స్థానంలో ఉన్నాడు. అందరికంటే వేగంగా స్పందించిన కోల్మన్, గాట్లిన్, యోహాన్ బ్లేక్, అకాని సింబని, ప్రెస్కోడ్, జిమ్మీ వికాట్ ముందుకు దూసుకుపోతుండగా వీరిని అందుకోవడానికి బోల్ట్ తీవ్రంగా ప్రయత్నించాడు. చివరకు 90 మీటర్ల వద్ద కోల్మన్ను బోల్ట్ అందుకున్నట్లే అనిపించినా... మరోవైపు ఎవ్వరూ అంతగా పట్టించుకోని జస్టిన్ గాట్లిన్ తన అనుభవాన్నంతా రంగరించి బుల్లెట్ వేగంతో దూసుకుపోయి అందరికంటే వేగంగా గమ్యానికి చేరుకున్నాడు. 0.2 సెకన్ల తేడాతో కోల్మన్కు రెండో స్థానం, 0.1 సెకన్ల తేడాతో బోల్ట్‌కు మూడో స్థానం లభించాయి.