![ప్రేక్షకుల తీరు మారలేదు!](/styles/webp/s3/article_images/2017/09/17/81502131223_625x300.jpg.webp?itok=06mhifyE)
ప్రేక్షకుల తీరు మారలేదు!
బహుమతి ప్రదానోత్సవ సమయంలో గాట్లిన్‌కు మళ్లీ వెక్కిరింతలు
లండన్: ఒకవైపు అభిమాన ఆటగాడు బోల్ట్ ఓడిన అసంతృప్తి... మరోవైపు విజేతగా నిలిచిన వ్యక్తి గతంలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడి తిరిగొచ్చినవాడు... దాంతో రేసు ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు తమ అసహనాన్ని దాచుకోలేకపోయారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో కూడా దానిని ప్రదర్శించారు. బోల్ట్ కాంస్య పతకం అందుకునే సమయంలో మైదానం మారుమోగేలా చప్పట్లతో అభినందించిన వారు గాట్లిన్ పేరు రాగానే ‘డోపీ... డోపీ...డోపీ’ అంటూ మళ్లీ వెక్కిరించారు.
స్టేడియంలో ఒక మూలన కొంత మంది గాట్లిన్‌కు మద్దతు తెలిపినా... ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు గేలి చేయడాన్ని కొనసాగించారు. అయితే ఆ సమయంలో గాట్లిన్ మాత్రం ఎలాంటి భావోద్వేగాలు కనబర్చలేదు. అమెరికా జాతీయ గీతం వినిపించే సమయంలో గుండెల మీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిలబడ్డాడు.