కలయా... నిజమా! పదేళ్లుగా 100 మీటర్ల ట్రాక్‌పై తన విశ్వరూపం ప్రదర్శించిన ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ కెరీర్ చివరి రేసులో మాత్రం చిన్నబోయాడు. ఎవ్వరూ ఊహించని విధంగా మూడో స్థానంలో నిలిచాడు. విశ్వవ్యాప్తంగా తన అభిమానులందరినీ నిరాశపరిచాడు. సెమీస్‌లో నెమ్మదిగా పరుగెత్తి రెండో స్థానంలో నిలిస్తే... ఫైనల్ రేసు కోసం వ్యూహాత్మకంగా బోల్ట్ తన శక్తినంతా దాచుకున్నాడని అందరూ భావించారు. కానీ అసలు రేసులోనూ ఈ జమైకా దిగ్గజం తడబడ్డాడు. ఈ క్రమంలో విశ్వవేదికపై తన కెరీర్‌లో చివరి 100 మీటర్ల రేసులో తొలిసారి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
లండన్: అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ట్రాక్‌పై అడుగు పెడితే స్వర్ణం తప్ప మరో పతకం ఊహించని ఉసేన్ బోల్ట్‌కు అనూహ్య పరాజయం ఎదురైంది. చివరిసారి 100 మీటర్ల రేసులో బరిలోకి దిగి పసిడి పతకంతో కెరీర్‌కు చిరస్మరణీయ ముగింపు పలకాలని బోల్ట్ ఆశించగా... అమెరికా వెటరన్ స్టార్ జస్టిన్ గాట్లిన్ నమ్మశక్యంకాని రీతిలో బోల్ట్‌కు షాక్ ఇచ్చి జమైకా దిగ్గజం ఆశలను అడియాసలు చేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 2 గంటల 15 నిమిషాలకు విఖ్యాత లండన్ ఒలింపిక్ స్టేడియంలో 60 వేల మంది ప్రేక్షకుల నడుమ పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసు జరిగింది. ఎనిమిది మంది బరిలోకి దిగిన ఈ ఫైనల్లో గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలిచాడు. క్రిస్టియన్ కోల్మన్ (అమెరికా) 9.94 సెకన్లతో రెండో స్థానం, ఉసేన్ బోల్ట్ 9.95 సెకన్లతో మూడో స్థానం సంపాదించారు.
ఆరంభం నుంచే వెనుకంజ...
సాధారణంగా రేసు ఆరంభంలో నెమ్మదిగా పరుగెత్తి... ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచి... చివర్లో తన ప్రత్యర్థులను వెనక్కి నెడుతూ లక్ష్యం వైపు దూసుకుపోవడం బోల్ట్ శైలి. కానీ ఈ రేసులో మాత్రం అలా జరగలేదు. రేసు మొదలైన క్షణం నుంచే బోల్ట్ వెనుకబడ్డాడు. రేసు ప్రారంభించడానికి ఎనిమిది మంది అథ్లెట్స్ తీసుకున్న స్పందన సమయంలో బోల్ట్ ఏడో స్థానంలో ఉన్నాడు. అందరికంటే వేగంగా స్పందించిన కోల్మన్, గాట్లిన్, యోహాన్ బ్లేక్, అకాని సింబని, ప్రెస్కోడ్, జిమ్మీ వికాట్ ముందుకు దూసుకుపోతుండగా వీరిని అందుకోవడానికి బోల్ట్ తీవ్రంగా ప్రయత్నించాడు.
చివరకు 90 మీటర్ల వద్ద కోల్మన్‌ను బోల్ట్ అందుకున్నట్లే అనిపించినా... మరోవైపు ఎవ్వరూ అంతగా పట్టించుకోని జస్టిన్ గాట్లిన్ తన అనుభవాన్నంతా రంగరించి బుల్లెట్ వేగంతో దూసుకుపోయి అందరికంటే వేగంగా గమ్యానికి చేరుకున్నాడు. 0.2 సెకన్ల తేడాతో కోల్మన్‌కు రెండో స్థానం, 0.1 సెకన్ల తేడాతో బోల్ట్‌కు మూడో స్థానం లభించాయి.
చిరుత చిన్నబోయింది!
Published Mon, Aug 7 2017 12:42 AM | Last Updated on Thu, Jan 11 2018 11:14 PM
Advertisement