వెక్కిరింతల నడుమ విజయం...
గతంలో రెండుసార్లు (2001లో, 2006లో) డోపింగ్‌లో దొరికిపోయి ఆరేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న 35 ఏళ్ల జస్టిన్ గాట్లిన్ తాజా ఫలితంతో సంబరాలు చేసుకున్నాడు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్ వేదికపై బోల్ట్‌ను ఓడించాలని ఐదుసార్లు ప్రయత్నించి నాలుగుసార్లు రెండో స్థానంతో, మరోసారి మూడో స్థానంతో సరిపెట్టుకున్న గాట్లిన్ ఈసారి మాత్రం తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. డోపింగ్ నేపథ్యం ఉండటంతో... లండన్ ఒలింపిక్స్, రియో ఒలింపిక్స్‌లో మాదిరిగా ఈసారీ గాట్లిన్‌కు ప్రేక్షకుల నుంచి వెక్కిరింతలు ఎదురయ్యాయి. హీట్స్‌లో, సెమీఫైనల్లో, ఫైనల్లో అతను ట్రాక్‌పై వచ్చినపుడు, అతడిని పరిచయం చేసినపుడు ప్రేక్షకులు గోల చేశారు.
అయినా ఇవేమీ పట్టించుకోని గాట్లిన్ ఆఖరికి విజేతగా నిలిచి అందరి నోళ్లు మూయించాడు. రేసు పూర్తయ్యాక ఫలితం వచ్చిన వెంటనే గాట్లిన్... బోల్ట్‌కు ఎదురువెళ్లి మోకాళ్లపై కూర్చొని అభివాదం చేసి తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. మరోవైపు గాట్లిన్ విజయానికి అర్హుడని, అతనికి వెక్కిరింతలు అవసరంలేదని బోల్ట్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ పోటీల్లో 100 మీటర్ల ఫైనల్ రేసులో బోల్ట్‌కు ఎదురైన రెండో ఓటమి ఇదే కావడం గమనార్హం. చివరిసారి 2013 జూన్‌లో రోమ్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్‌లో బోల్ట్‌కు గాట్లిన్ చేతిలోనే ఓటమి ఎదురైంది.