భారత షట్లర్ కృష్ణ ప్రసాద్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: తెలుగు షట్లర్ గరగ కృష్ణప్రసాద్ డోపీగా తేలడంతో నాలుగేళ్ల నిషేధానికి గురయ్యాడు. అయితే తను మాత్రం డోపీని కానే కాదని, తన ఒంట్లో ఎలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలకు చోటే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. 2022లో థామస్ కప్‌లో టైటిల్ గెలిచిన భారత జట్టులో కృష్ణ ప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడు. అతను సాయిప్రతీక్‌తో జోడీగా పురుషుల డబుల్స్‌లో పోటీపడ్డాడు.
అయితే గతేడాది అతని రక్త,మూత్ర నమూనాలను పరిశీలించగా అందులో నిషిద్ధ ఉత్ప్రేరకం “హ్యూమన్ క్రొనిక్ గొనడొట్రొపిన్ (హెచ్‌సీజీ) ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తాజాగా అతనిపై నాలుగేళ్ల నిషేధం విధించింది. నిజానికి గత సెప్టెంబర్‌లోనే ‘నాడా’ చర్యలు తీసుకోవాల్సి ఉండగా... తెలుగు షట్లర్ అప్పీలుకు వెళ్లాడు. ఇటీవలే అప్పీలును తిరస్కరించడంతో కృష్ణ ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
2019లో జరిగిన దక్షిణాసియా క్రీడల్లో కృష్ణ ప్రసాద్ డబుల్స్ టైటిల్ సాధించాడు. అతనితో పాటు శ్వేతపర్ణ పండాపై కూడా “నాడా’ వేటు పడింది. కోవిడ్ సమయంలో వాడిన దగ్గు టానిక్‌లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు ఉండటంతో అప్పట్లో కూడా ఇలాంటి ఆరోపణల్నే కృష్ణ ప్రసాద్ ఎదుర్కొన్నాడు. అయితే నేరుగా కావాలని తీసుకోకపోవడంతో అప్పుడు తేలిగ్గానే బయటపడ్డాడు. ఈసారి మాత్రం నిషేధానికి గురయ్యాడు.
‘నాపై విధించిన నిషేధంపై భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సార్‌ను సంప్రదించాలని అనుకుంటున్నాను. ఈ కేసు, సమస్యపై ఆయనకే వివరిస్తాను’ అని కృష్ణప్రసాద్ అన్నాడు. సాధారణంగా హార్మోన్ల సమతూకం లోపించినపుడు కూడా హెచ్‌సీజీ నివేదికలో తేడాలొస్తాయని అతను వాదిస్తున్నాడు. మరోవైపు శ్వేతపర్ణ తన సస్పెన్షన్‌పై స్పందించేందుకు తిరస్కరించింది. ఆమె సోదరి రుతుపర్ణ కూడా షట్లరే! ఇద్దరు ఇంటా బయటా జరిగిన పలు టోర్నీల్లో రాణించారు.
Comments
Please login to add a commentAdd a comment