ఆఫ్రికా అథ్లెట్స్ అదుర్స్
మూడు విభాగాల్లో స్వర్ణాలు
♦ 200 మీటర్ల సెమీస్‌లోకి బోల్ట్, గాట్లిన్
♦ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
బీజింగ్ : పేరుకు వెనుకబడిన దేశాలకు చెందిన వారైనా... ప్రపంచ పరుగుల వేదికపై పతకాల వేటలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ ఆఫ్రికా దేశాల అథ్లెట్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన ఐదు ఫైనల్స్‌లో ఆఫ్రికా అథ్లెట్స్ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా రెండోసారి పసిడిపతకాన్ని దక్కిం చుకోగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కెన్యా యువతార నికోలస్ బెట్ తొలిసారి తమ దేశానికి స్వర్ణాన్ని అందించాడు. ఇక మహిళల 1500 మీటర్ల రేసులో గెన్‌జెబి దిబాబా విజేతగా నిలిచి ఈ మెగా ఈవెం ట్‌లో ఇథియోపియా పసిడి ఖాతాను తెరిచింది. నాలుగో రోజు పోటీలు ముగిశాక కెన్యా 4 స్వర్ణాలు, 3 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం తొమ్మిది పతకాలతో అగ్రస్థానంలో ఉండటం విశేషం.
►లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత మోకాలి గాయంతో కొంతకాలం అథ్లెటిక్స్‌కు దూరంగా ఉన్న రుదీషా తాజా ప్రదర్శనతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 800 మీటర్ల రేసును రుదీషా ఒక నిమిషం 45.84 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఆడమ్ క్సాజోట్ (పోలండ్-1ని:46.08 సెకన్లు) రజతం, అమెల్ టుకా (బోస్నియా-1ని:46.30 సెకన్లు) కాంస్యం సాధించారు. 2011లో తొలిసారి ప్రపంచ టైటిల్ నెగ్గిన రుదీషా 2013లో గాయం కారణంగా బరిలోకి దిగలేదు.
►పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో గతంలో ఏనాడూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గలేకపోయిన కెన్యాకు నికోలస్ బెట్ ఆ కొరతను తీర్చాడు. బెట్ 47.79 సెకన్లలో రేసును పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. అంతేకాకుండా 1991లో శామ్యూల్ మెటెటె (జాంబియా) తర్వాత ఈ విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఆఫ్రికా అథ్లెట్‌గా బెట్ గుర్తింపు పొందాడు.
►మహిళల 1500 మీటర్ల రేసులో ఇథియోపియా అమ్మాయి గెన్‌జెబి దిబాబా 4ని:08.09 సెకన్లలో లక్ష్యానికి చేరుకొని తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. విఖ్యాత అథ్లెట్స్ తిరునిష్, ఎజెగాయెహు దిబాబాలకు సోదరి అయిన గెన్‌జెబి గత నెలలో మొనాకోలో జరిగిన మీట్‌లో 3ని:50.07 సెకన్లలో తన పేరిట ప్రపంచ రికార్డును లిఖించుకుంది. పురుషుల లాంగ్‌జంప్‌లో ఒలింపిక్ చాంపియన్ గ్రెగ్ రూథర్‌ఫర్డ్ (బ్రిటన్-8.41 మీటర్లు)... మహిళల డిస్కస్ త్రోలో డెనియా కాబాలెరో (క్యూబా-69.28 మీటర్లు) స్వర్ణ పతకాలు సాధించారు.
►పురుషుల 200 మీటర్ల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఉసేన్ బోల్ట్ (జమైకా), మాజీ చాంపియన్ జస్టిన్ గాట్లిన్ (అమెరికా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. మూడో హీట్‌లో పాల్గొన్న బోల్ట్ 20.28 సెకన్లలో... నాలుగో హీట్‌లో బరిలోకి దిగిన గాట్లిన్ 20.19 సెకన్లలో గమ్యానికి చేరుకున్నారు.