ఈ ఫ్యామిలీ వెరీ స్పెషల్..!
ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ దిగ్గజాల జాబితాలో స్విస్ కెరటం రోజర్ ఫెదరర్ పేరు మొదటి వరుసలో ఉంటుంది. 34 ఏళ్ల ఫెదరర్ తన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ రికార్డులతో పాటు కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ స్విస్ స్టార్ టెన్నిస్ కోర్టులోనే కాదు నిజజీవితంలోనూ చాలా హుందాగా ఉంటాడు. ఫెదరర్ టెన్నిస్ తర్వాత అధిక ప్రాధాన్యం ఇచ్చేది కుటుంబానికే. విశేషం ఏంటంటే.. ఫెడెక్స్ ఆటే కాదు అతని కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది.
ఫెదరర్ భార్య మిర్కా వావ్రినెక్ కూడా టెన్నిస్ క్రీడాకారిణి. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఫెదరర్, మిర్కా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. సిడ్నీలోనే వీరిద్దరికీ పరిచయమైంది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, ప్రేమగా మారింది. అనంతరం ప్రపంచ టెన్నిస్‌లో ఫెదరర్ ఓ కెరటంలా దూసుకెళ్లగా, మిర్కా మాత్రం గాయం కారణంగా 2002లో టెన్నిస్‌కు గుడ్ బై చెప్పింది. ఈ జంట 2009లో ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అదే ఏడాది వీరికి కవలలు (ఆడపిల్లలు) జన్మించారు. ఈ కవలల పేర్లు మిలా రోజ్, చార్లెనె రివా. ఫెదరర్ ఎక్కడ టెన్నిస్ ఆడినా.. మిర్కా భర్త వెంటే టూర్లకు వెళుతూ గ్యాలరీలె తన ఇద్దరు పిల్లలతో కనిపించేంది. మరో విశేషం ఏంటంటే.. ఏడాది క్రితం కూడా ఈ దంపతులకు మళ్లీ కవలలు పట్టారు. కాగా ఈ సారి ఇద్దరూ అబ్బాయిలు జన్మించారు. వారి పేర్లు లియో, లెన్నర్ట్. ఫెదరర్, మిర్కాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు సంతానం. ఫెదరర్‌కు ఏమాత్రం విరామం దొరికినా పిల్లలతో గడుపుతాడు. భార్య పిల్లలను షికారుకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తుంటాడు.
ఫెదరర్, మిర్కా అన్యోన్య దాంపత్యం, ముచ్చటైన వారి కుటుంబాన్ని చూసి నెటిజెన్లు సరదాగా కామెంట్లు పోస్ట్ చేశారు. వాట్సాప్‌లోని ఓ మెసేజ్ బాగా పాపులర్ అయ్యింది. అదేంటంటే..
ఫెదరర్‌కు కవలలైన ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.
కాబట్టి ఫెదరర్ ఫ్యామిలీ టెన్నిస్‌లో అన్ని విభాగాల్లో ఆడగలదు.
మెన్స్ సింగిల్స్
వుమెన్స్ సింగిల్స్
మెన్స్ డబుల్స్
వుమెన్స్ డబుల్స్
మిక్స్డ్ డబుల్స్.. ఇలా అన్ని విభాగాల్లో ఆడొచ్చు
దీన్ని గ్రాండ్ స్లామ్ ప్లానింగ్ అని పిలవచ్చు.