2 వేల క్యూసెక్కులు వదలండి
కావేరి జలాలపై కర్ణాటకకు మళ్లీ సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: తమిళనాడుకు రోజుకు రెండు వేల క్యూసెక్కుల కావేరి జలాలను విడుదల చేయాలని కర్ణాటక రాష్ట్రానికి సుప్రీంకోర్టు మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఈ నీటిని విడుదల చేయాలని స్పష్టం చేసింది. విచారణ బుధవారమూ కొనసాగనుంది. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మసనం మంగళవారం ఈ అంశంపై తీర్పునిస్తూ.. రెండు ప్రభుత్వాలు శాంతి, సామరస్యం నెలకొనేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా కోర్టు నియమించిన పర్యవేక్షణ కమిటీ కావేరి జలాల వాస్తవ స్థితిగతులను పరిశీలించి, తయారుచేసిన నివేదికను అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధర్మాసనానికి నివేదించారు. కావేరి వాటర్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి వేసిన అప్పీళ్లపై విచారణ అనంతరం పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన నివేదికపై వాదనలు వింటామని ధర్మాసనం పేర్కొంది. అయితే రాజ్యాంగంలోని 131, 262 అధికరణలు, అంతర్రాష్ట్ర నదీజలాల వివాద చట్టం 1956 మార్గదర్శకాల ప్రకారం కావేరి జలాలపై రాష్ట్రాలు వేసిన అప్పీళ్లు విచారణార్హం కావని అటార్నీ జనరల్ వాదించారు.