ఎంతపని సేశావు సామీ..
‘అందరం సల్లంగుండాలని నీకు మొక్కులు చెల్లించడానికి బయలుదేరితే ఇదేం ఘోరం దేవుడా.. ఎంత పని చేశావు స్వామీ.. మేమేం తప్పు చేశాం భగవంతుడా.. పిల్లా జల్లా ఎట్లా మారిపోయారో చూడు స్వామీ..’ అంటూ ఓ కుటుంబం, ‘నీకేం తక్కువ చేశాం స్వామీ.. మాకిలా చేశావు.. అన్నిటికీ నీవే అండగా ఉండాలని మొక్కులు చెల్లించుకుంటిమిగద స్వామీ’ అని మరో కుటుంబం ఘటన స్థలిలో రోదించడం అందరినీ కలచి వేసింది.
రాజంపేట రూరల్, కడప అర్బన్ : రెండు వాహనాలు(తుఫాన్) ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజంపేట మండలం (కడప-రేణిగుంట హైవే) చొప్పావారిపల్లె క్రాస్ వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వృుతులు, క్షతగాత్రులందరూ కర్నూలు జిల్లాకు చెందిన వారు. క్షతగాత్రులను కడపలోని రిమ్స్‌కు తరలించారు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పలుకూరుకు చెందిన ఓ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని బుధవారం అర్ధరాత్రి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమైంది.
వీరు ప్రయాణిస్తున్న (ఏపీ02వై0872) వాహనంలో డ్రైవర్‌తో కలిపి 17మంది ఉన్నారు. అదే జిల్లాలోని గడివేములకు చెందిన వెంకటన్న తన మనవళ్లు ప్రశాంత్, శ్యామ్ప్రసాద్లకు తలనీలాలు తీయించే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి తుఫాన్ (ఏపీ21టీడబ్ల్యూ6199) వాహనంలో తిరుమలకు వెళ్తున్నారు. ఈ వాహనంలో డ్రైవర్‌తో కలిపి 16 మంది ఉన్నారు. ఈ రెండు వాహనాలు చొప్పావారిపల్లె క్రాస్ వద్దకు రాగానే వెంకటన్న కుటుంబం ఉన్న వాహన డ్రైవర్ చింతా జనార్ధన్ (నందికొట్కూరుకు చెందిన బాలస్వామి కుమారుడు) నిద్రమత్తుతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. వెంకటన్న కుటుంబానికి చెందిన చిన్నమ్మ (60) అక్కడికక్కడే మృతి చెందగా, ఇరు వాహనాల్లోని 30 మంది గాయపడ్డారు.
క్షతగాత్రులను ఎస్ఐ సుధాకర్, కానిస్టేబుళ్లు 108 ద్వారా రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘటన స్థలి, ఆస్పత్రి దద్దరిల్లింది. అనంతరం వారిలో 27 మందిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు పంపారు. తిరుమల నుంచి ఆదోనికి బయలు దేరిన వాహన డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్పష్టమైంది.
చిన్నారిని వదలని తల్లి
ప్రమాదం జరగ్గానే పలువురు ఇరు వాహనాల్లో ఇరుక్కుపోయారు. వెనుక వస్తున్న వాహనాల వారు, స్థానికులు వెంటనే సహాయక చర్యలకు ఉపక్రమించారు. వాహనాల్లో ఇరుక్కుపోయిన వారిని బయటకు లాగారు. ఆలోగా పోలీసులు 108ను రప్పించారు. అందరినీ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ తన ఏడాది చిన్నారిని రెండు చేతులతో ఒడిసి పట్టుకుని స్పృహ తప్పి ఉన్న దృశ్యం చూసి స్థానికుల కళ్లు చెమర్చాయి. ఇంత ప్రమాదం జరిగినా ఆ చిన్నారి మాత్రం గాయపడక పోవడం అదృష్టమని స్థానికులు చర్చించుకున్నారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కడప రిమ్స్‌కు తరలించగా కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన డ్రైవర్ జనార్దన్ (29) చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. గడివేములకు చెందిన అనంతమ్మ (32) పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రగాయాలతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఆర్తనాదాలు చేస్తుండటం అందరినీ కలచివేసింది. మన్నూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులు వీరే..
తిరుమల నుంచి పలుకూరుకు వెళుతున్న వాహనంలో ఉన్న అనంతమ్మ, హనుమంతు, రామలక్ష్మీ, గాయత్రి, మంగమ్మ, తేజ, సావిత్రి, కావ్వ, జయలక్ష్మీ, అనిత, లక్ష్మీ, హరిత, డ్రైవర్ ఫయాజ్ మరికొందరు.. గడివేముల నుంచి తిరుమలకు వెళుతున్న వాహనంలో వెంకటన్న, శ్రీనువాసులు, రమణ, మధుకిరణ్, సీ.శ్రీనువాసులు, ప్రణీత, తులసీ, రమణమ్మ, శీలం లక్ష్మీ, జనార్ధన్, మదన్‌కుమార్, శ్యాంప్రసాద్, మరికొందరు ప్రమాదంలో గాయపడ్డారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరిని గురువారం సాయంత్రం నంద్యాలకు తరలించారు.