మేడికొండూరు, న్యూస్‌లైన్: ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బుధవారం డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో చోటుచేసుకుంది. నరసరావుపేట రూరల్ మండలం, జొన్నలగడ్డ గ్రామానికి చెందిన చిన్నపరెడ్డి శ్రీనివాసరెడ్డి (35), రంగారెడ్డిపాలేనికి చెందిన నాగిరెడ్డి(38)లు ద్విచక్రవాహనంపై విజయవాడ వెళ్లి తిరిగి వస్తుండగా డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలో ఫిరంగిపురం నుంచి ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. రెండు వాహనాలు వేగంగా వస్తుండడంతో ద్విచక్ర వాహనంపై వున్న శ్రీనివాసరెడ్డి, నాగిరెడ్డిలు ఎగిరి మార్జిన పక్క పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. ఇద్దరూ సమీప బంధువులు. టాటా ఏస్ వాహనాన్ని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి మేడికొండూరు ఎస్‌ఐ జె. అనూరాధ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.