two workers
-
ఔటర్‌రింగు రోడ్డుపై దుర్ఘటన.. మొక్కలకు నీరు పడుతుండగా..
జిన్నారం (పటాన్చెరు): మొక్కలకు నీరు పడుతున్న ఇద్దరు కార్మికులను కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం సంగారెడ్డి జిల్లా బొల్లారం సమీపంలో ఔటర్‌రింగు రోడ్డుపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హత్నూర మండలం వడ్డెపల్లి గ్రామానికి చెందిన కంటిగారి సత్తయ్య (50) జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా తడ్వాయ్ గ్రామానికి చెందిన పాపల నవీన్ (19) లారీ ట్యాంకర్ క్లీనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ రోజులాగే జిన్నారం మండలంలోని బొల్లారం సమీపంలో ఓఆర్ఆర్పై మొక్కలకు ట్యాంకర్లో తీసుకువచ్చిన నీళ్లు పోస్తున్నారు. అదే సమయంలో రామచంద్రాపురానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి కారులో వేగంగా వస్తూ మొక్కలకు నీళ్లు పోస్తున్న నవీన్, సత్తయ్యలను ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు అదుపు తప్పి ట్యాంకర్‌నూ ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో మహేశ్వర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ ప్రశాంత్ చెప్పారు. -
గచ్చిబౌలిలో విషాదం: సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక..
సాక్షి, హైదరాబాద్: సెప్టిక్‌ట్యాంక్‌ను శుభ్రపరిచేందుకు లోపలికి దిగిన ఇద్దరు కార్మికులు మృతువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన కొండాపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో ఆదివారం జరిగింది. గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జి.సురేష్, మృతుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు.. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లోని సెప్టిక్‌ట్యాంక్ శుభ్రం చేయడానికి ప్రైవేటు సెప్టిక్ ట్యాంకర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ట్యాంకర్ డ్రైవర్, యజమాని అయిన స్వామి, హెల్పర్ జాన్ కలిసి క్లీనింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు. చంపాపేట్ సింగరేణి కాలనీ ఆదర్శనగర్‌కు చెందిన శ్రీనివాస్ (38) అలియాస్ శ్రీను, ఈ ప్రాంతానికే చెందిన ఆంజనేయులు (25)ను సెíప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే పనులకు రావాలని చెప్పారు. వీరిద్దరూ సరే అనడంతో ఆదివారం ఉదయం 8 గంటలకు గౌతమి ఎన్‌క్లేవ్‌లోని హేమదుర్గా ప్రెస్టీజ్ అపార్ట్‌మెంట్‌కు ట్యాంకర్‌తో పాటు చేరుకున్నారు. సెప్టిక్ ట్యాంక్ మూతలు తీసి పైపులతో కొంత నీటిని తొలగించారు. భద్రత చర్యలు నిల్.. సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలంటే ముందుగా భద్రత చర్యలు చేపట్టాలి. కానీ.. హేమదుర్గా అపార్ట్మెంట్లో లోపలికి దిగిన ఆంజనేయులు, శ్రీనివా స్ ముఖానికి మాస్కులతో కూడిన యంత్రాలు వాడకపోవడం, అంతకుముందే ఎగ్జాస్టింగ్ ఫ్యాన్‌ను వాడకపోవడం, మూత తెరిచి కనీసం అందులోని విషవాయువులు బయటకు వెళ్లి పోయేంత వరకు వేచి ఉండక పోవడంతోనే ఇద్దరు మృత్యువాత పడినట్లు భావిస్తున్నారు. సెప్టిక్ ట్యాంకర్ జీహెచ్ఎంసీలో రిజిస్టర్ చేసుకున్నా వారి ద్వారా వచ్చిన కాల్ కాకుండా ప్రైవేటుగా వచ్చిన కాల్తోనే వారు వచ్చి శుభ్రం చేసే పనులను చేపట్టినట్లు తెలుస్తోంది. మిన్నంటిన రోదనలు.. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకొని గుండెలవిసేలా రోదించారు. శ్రీనివాస్, ఆంజనేయులు కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. శ్రీనివాస్ స్వస్థలం నల్లగొండ జిల్లా దేవరకొండ మంజు తండా. కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి ఆటో నడపడంతో పాటు ఇతర కూలిపనులు చేస్తున్నాడు. ఆయనకు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆంజనేయులుది నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట్‌లోని అక్కారం గ్రామం. భార్య పద్మ, అయిదేళ్ల కుమారుడు ఉన్నారు. సెప్టిక్ ట్యాంక్ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. ఊపిరి ఆడకపోవడంతోనే.. శుభ్రపరిచేందుకు శ్రీనివాస్, ఆంజనేయులు సెప్టిక్ ట్యాంక్ లోపలికి దిగారు. అరగంట అయినా ఎలాంటి ఉలుకూ పలుకూ లేకపోవడంతో స్వామి, జాన్ కూడా లోపలికి దిగారు. ఇది గమనించిన వాచ్‌మన్ మరికొందరితో కలిసి స్వామిని, జాన్‌ను బయటికి లాగారు. వారు ఊపిరి తీయడం తీవ్ర ఇబ్బందిగా ఉండటంతో కొండాపూర్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సెప్టిక్‌ట్యాంక్ లోపలే ఊపిరి ఆడక బయటకు రాలేకపోయిన శ్రీనివాస్, ఆంజనేయులును అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వెలికితీశారు. అప్పటికే వారిద్దరూ మృత్యువాత పడినట్లు గుర్తించారు. చదవండి: ఎన్టీఆర్ పార్కు ముందు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు -
ప్రాణాలు తీసిన డ్రైనేజీ
► పనుల కోసం దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన అడ్డాకూలీలు ► రెండు గంటల పాటు డ్రైనేజీలోనే శవాలు ► సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌లో కనిపించని మానవత్వం ► కార్మికుల దినోత్సవం రోజునే విషాద ఘటన హైదరాబాద్: నగరంలో కార్మిక దినోత్సవం రోజునే ఇద్దరు అడ్డా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పనుల కోసం డ్రైనేజీలోకి దిగిన అడ్డా కూలీలు ఊపిరాడక మృత్యువాత పడిన విషాదకర సంఘటన ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లికి చెందిన బి.వీరాస్వామి(35) కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి రాంకోఠి గణేష్టెంపుల్ వద్ద నివసిస్తున్నాడు. వీరాస్వామికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఊయలవాడ గ్రామానికి చెందిన కోటయ్య(34) కుటుంబం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి బడి చౌడిలో నివాసం ఉంటోంది. కోటయ్యకు భార్య, ఇద్దరు కూమారులు, ఒక కూమార్తె ఉన్నారు. వీరాస్వామి, కోటయ్య రాంకోఠిలో అడ్డాపై ప్రతిరోజు పని కోసం వస్తుంటారు. ఆదివారం ఉదయం సుల్తాన్‌బజార్ కపాడియాలైన్కు చెందిన ఓ వ్యక్తి వీరిని డ్రైనేజీ శుభ్రం చేసేందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కపాడియాలైన్‌లో పనుల నిమిత్తం కోటయ్య, వీరాస్వామి డ్రైనేజీలోకి దిగారు. సుమారు 12 గంటల ప్రాంతంలో ఇరువురు డ్రైనేజీలో ఊపిరి ఆడక మృతిచెందారు. స్థానికుల సమాచారంతో మధ్యాహ్నం 2 గంటలకు సుల్తాన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు విప్పిపెట్టిన బట్టల్లో సెల్‌ఫోన్ లభించడంతో అందులోని నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు వారి బంధువులతోనే శవాలను బయటికి తీయించి రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తండ్రి మృతదేహాన్ని చూసిన వీరాస్వామి ఆరేళ్ల, మూడేళ్ల కుమారులు వెక్కివెక్కి ఏడవడం అందరినీ కలచి వేసింది. తన భర్త చనిపోవడంతో తమను పోషించేవారు ఎవరని వీరాస్వామి భార్య భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కాగా, వీరాస్వామి, కోటయ్యలను అసలు పనికి ఎవరు పిలిచారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కనుమరుగైన మానవత్వం.. సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌లో అధిక శాతం సంపన్న వర్గాల వారే నివసిస్తుంటారు. అయితే మృతులు వీరాస్వామి, కోటయ్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో డ్రైనేజీలో ఊపిరి ఆడక మృతిచెందితే.. రెండు గంటలకు పోలీసులు వచ్చే వరకూ అక్కడ ఏమైంది అని చూసే నాథుడు లేడు. కనీసం వీరిని పనికి పిలిపించిన వ్యక్తులు సైతం ఆ పక్కకు రాలేదు. -
ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్
శుభ్రం చేస్తుండగా ఘటన అత్తాపూర్, న్యూస్‌లైన్: మ్యాన్‌హోల్ ఇద్దరు కార్మికులను మింగేసింది. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో ఒకరు అందులో పడిపోగా.. అతడిని కాపాడే క్రమంలో మరో మరోవ్యక్తి మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు... ఉప్పర్‌పల్లిలోని ఇంపీరియల్ రెసిడెన్సీఅపార్ట్మెంట్ ముందు భాగంలో ఉన్న మ్యాన్‌హోళ్లు నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపై పారుతోంది. దీంతో అపార్ట్మెంట్ సూపర్వైజర్ వాహెద్ మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయించడానికి కనకదుర్గ కాలనీకి చెందిన నారాయణ(40), కిషన్‌బాగ్ కు చెందిన భీములు(26)ను సంప్రదించాడు. రూ.400లు ఇస్తానని చెప్పి ఇద్దరినీ శనివారం ఉదయం 10 గంటలకు తీసుకొచ్చాడు. ముందుగా అపార్ట్మెంట్ ముందు రోడ్డుపై ఉన్న ఒక మ్యాన్‌హోల్ మూత తీశారు. అది పూర్తిగా మురునీటితో నిండిపోవడంతో అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం ముందున్న మరో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు. అది కూడా మురుగునీటితో నిండిపోవడంతో భీములు లోపలికి దిగి శుభ్రం చేస్తున్నాడు. ఈక్రమంలో ఒక్కసారిగా జారి పడిపోయాడు. ఊపిరాడక పెద్దగా కేకలు వేస్తుండంతో అతడిని రక్షించేందుకు నారాయణ లోపలికి దిగి భీములును పైకి లాగేందుకు యత్నించాడు. పట్టుతప్పి ఇద్దరూ మ్యాన్‌హోల్‌లో పడి మునిగిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీసే పనులు ప్రారంభించారు. మ్యాన్‌హోల్ 18 అడుగుల లోతు ఉండటంతో జేసీబీ సహాయంతో మ్యాన్‌హోల్ పక్కనే మరో గొయ్యి తీయించి మృతదేహాలను బయటకు తీశారు. కాగా, కార్మికులిద్దరూ మ్యాన్‌హోల్‌లో పడిపోగానే సూపర్వైజర్ వాహెద్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరి కుటుంబసభ్యులు మృతదేహాలపై పడి గుండెలు పగిలేలా రోదించారు. కూలీల కళ్లముందే... ఘటన జరిగిన మ్యాన్‌హోల్ పక్కన ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. మొదట మ్యాన్‌హోల్‌లో దిగిన భీములు కేకలు వేయడం ఆ ఇంటి వద్ద ఉన్న కూలీలు గమనించారు. అంతలోనే నారాయణ.. భీములను కాపాడేందుకు మ్యాన్హోల్లోకి దిగాడు. కూలీలు చూస్తుండగా ఇద్దరు మ్యాన్‌హోల్‌లో మునిగి మృతి చెందారు. తమ కళ్లముందే ఇద్దరూ నీట మునిగి చనిపోయారని ఆ కూలీలు కన్నీరు పెట్టుకున్నారు. నాయకుల పరామర్శ.... టీడీపీ గ్రేటర్ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ కార్పొరేటర్లు ప్రేమ్‌దాస్‌గౌడ్, సత్యనారాయణలతో పాటు అమీర్‌పేట్ కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పత్తాలేని ఇంటి యజమాని.... ఘటన జరిగిన వెంటనే అపార్ట్మెంట్ యజమాని మసూద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, అతను సాయంత్రం 6 గంటల వరకు కూడా ఘటనా స్థలానికి రాలేదు. అతను వచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు. రూ.2 లక్షల నష్టపరిహారం... రాజేంద్రనగర్: పోలీసుల జోక్యంతో అపార్ట్మెంట్ యజమాని మసూద్ శనివారం రాత్రి 8.30కి ఘటనా స్థలానికి వచ్చాడు. మృతుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.