ఇద్దరిని మింగిన మ్యాన్‌హోల్
- శుభ్రం చేస్తుండగా ఘటన
అత్తాపూర్, న్యూస్‌లైన్: మ్యాన్‌హోల్ ఇద్దరు కార్మికులను మింగేసింది. మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసే క్రమంలో ఒకరు అందులో పడిపోగా.. అతడిని కాపాడే క్రమంలో మరో మరోవ్యక్తి మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు... ఉప్పర్‌పల్లిలోని ఇంపీరియల్ రెసిడెన్సీఅపార్ట్‌మెంట్ ముందు భాగంలో ఉన్న మ్యాన్‌హోళ్లు నిండిపోవడంతో మురుగునీరు రోడ్డుపై పారుతోంది.
దీంతో అపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ వాహెద్ మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయించడానికి కనకదుర్గ కాలనీకి చెందిన నారాయణ(40), కిషన్‌బాగ్ కు చెందిన భీములు(26)ను సంప్రదించాడు. రూ.400లు ఇస్తానని చెప్పి ఇద్దరినీ శనివారం ఉదయం 10 గంటలకు తీసుకొచ్చాడు. ముందుగా అపార్ట్‌మెంట్ ముందు రోడ్డుపై ఉన్న ఒక మ్యాన్‌హోల్ మూత తీశారు. అది పూర్తిగా మురునీటితో నిండిపోవడంతో అపార్ట్‌మెంట్ ప్రధాన ద్వారం ముందున్న మరో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లారు.
అది కూడా మురుగునీటితో నిండిపోవడంతో భీములు లోపలికి దిగి శుభ్రం చేస్తున్నాడు. ఈక్రమంలో ఒక్కసారిగా జారి పడిపోయాడు. ఊపిరాడక పెద్దగా కేకలు వేస్తుండంతో అతడిని రక్షించేందుకు నారాయణ లోపలికి దిగి భీములును పైకి లాగేందుకు యత్నించాడు. పట్టుతప్పి ఇద్దరూ మ్యాన్‌హోల్‌లో పడి మునిగిపోయారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీసే పనులు ప్రారంభించారు. మ్యాన్‌హోల్ 18 అడుగుల లోతు ఉండటంతో జేసీబీ సహాయంతో మ్యాన్‌హోల్ పక్కనే మరో గొయ్యి తీయించి మృతదేహాలను బయటకు తీశారు. కాగా, కార్మికులిద్దరూ మ్యాన్‌హోల్‌లో పడిపోగానే సూపర్‌వైజర్ వాహెద్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఇద్దరి కుటుంబసభ్యులు మృతదేహాలపై పడి గుండెలు పగిలేలా రోదించారు.
కూలీల కళ్లముందే...
ఘటన జరిగిన మ్యాన్‌హోల్ పక్కన ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. మొదట మ్యాన్‌హోల్‌లో దిగిన భీములు కేకలు వేయడం ఆ ఇంటి వద్ద ఉన్న కూలీలు గమనించారు. అంతలోనే నారాయణ.. భీములను కాపాడేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగాడు. కూలీలు చూస్తుండగా ఇద్దరు మ్యాన్‌హోల్‌లో మునిగి మృతి చెందారు. తమ కళ్లముందే ఇద్దరూ నీట మునిగి చనిపోయారని ఆ కూలీలు కన్నీరు పెట్టుకున్నారు.
నాయకుల పరామర్శ....
టీడీపీ గ్రేటర్ ఫ్లోర్‌లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ కార్పొరేటర్‌లు ప్రేమ్‌దాస్‌గౌడ్, సత్యనారాయణలతో పాటు అమీర్‌పేట్ కార్పొరేటర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి, తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పత్తాలేని ఇంటి యజమాని....
ఘటన జరిగిన వెంటనే అపార్ట్‌మెంట్ యజమాని మసూద్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే, అతను సాయంత్రం 6 గంటల వరకు కూడా ఘటనా స్థలానికి రాలేదు. అతను వచ్చే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.
రూ.2 లక్షల నష్టపరిహారం...
రాజేంద్రనగర్: పోలీసుల జోక్యంతో అపార్ట్‌మెంట్ యజమాని మసూద్ శనివారం రాత్రి 8.30కి ఘటనా స్థలానికి వచ్చాడు. మృతుల కుటుంబసభ్యులకు రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.