నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తన భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (BHIM) యాప్‌ను ఒక స్వతంత్ర అనుబంధ సంస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే బీహెచ్ఐఎమ్ (భీమ్) తన ఉనికిని విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం లలితా నటరాజ్‌ను బీహెచ్ఐఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది.
లలితా నటరాజ్ గతంలో ఐడీఎఫ్‍సీ ఫస్ట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో పనిచేశారు. కాబట్టి నటరాజన్ 'బీహెచ్ఐఎమ్'ను వేగంగా అభివృద్ధి చేస్తారని భావిస్తున్నారు. ఈ అభివృద్ధికి ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సహరిస్తున్నట్లు సమాచారం.
భారతదేశంలో ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఈ యాప్‌ల మీద ప్రజలు ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం బీహెచ్ఐఎమ్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి ఆలోచిస్తోంది. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా 85 శాతం లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం భవిష్యత్తులో ఆందోళన కలిగిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బీహెచ్ఐఎమ్ అనేది 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ యాప్‌ని నేరుగా బ్యాంక్ చెల్లింపులు చేయడానికి లేదా యూపీఐ చెల్లింపులు చేయడానికి ఉపయోగించుకుపోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్ పే వాడకంలోకి వచ్చిన తరువాత బీహెచ్ఐఎమ్ వినియోగం తగ్గిపోయింది. కాబట్టి దీనికి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment