ప్రాణాలు తీసిన డ్రైనేజీ
► పనుల కోసం దిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన అడ్డాకూలీలు
► రెండు గంటల పాటు డ్రైనేజీలోనే శవాలు
► సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌లో కనిపించని మానవత్వం
► కార్మికుల దినోత్సవం రోజునే విషాద ఘటన
హైదరాబాద్: నగరంలో కార్మిక దినోత్సవం రోజునే ఇద్దరు అడ్డా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పనుల కోసం డ్రైనేజీలోకి దిగిన అడ్డా కూలీలు ఊపిరాడక మృత్యువాత పడిన విషాదకర సంఘటన ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా పెద్ద కొత్తపల్లికి చెందిన బి.వీరాస్వామి(35) కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి రాంకోఠి గణేష్‌టెంపుల్ వద్ద నివసిస్తున్నాడు. వీరాస్వామికి భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఊయలవాడ గ్రామానికి చెందిన కోటయ్య(34) కుటుంబం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి బడి చౌడిలో నివాసం ఉంటోంది. కోటయ్యకు భార్య, ఇద్దరు కూమారులు, ఒక కూమార్తె ఉన్నారు. వీరాస్వామి, కోటయ్య రాంకోఠిలో అడ్డాపై ప్రతిరోజు పని కోసం వస్తుంటారు.
ఆదివారం ఉదయం సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌కు చెందిన ఓ వ్యక్తి వీరిని డ్రైనేజీ శుభ్రం చేసేందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో కపాడియాలైన్‌లో పనుల నిమిత్తం కోటయ్య, వీరాస్వామి డ్రైనేజీలోకి దిగారు. సుమారు 12 గంటల ప్రాంతంలో ఇరువురు డ్రైనేజీలో ఊపిరి ఆడక మృతిచెందారు. స్థానికుల సమాచారంతో మధ్యాహ్నం 2 గంటలకు సుల్తాన్‌బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు విప్పిపెట్టిన బట్టల్లో సెల్‌ఫోన్ లభించడంతో అందులోని నంబర్ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు వారి బంధువులతోనే శవాలను బయటికి తీయించి రెండు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తండ్రి మృతదేహాన్ని చూసిన వీరాస్వామి ఆరేళ్ల, మూడేళ్ల కుమారులు వెక్కివెక్కి ఏడవడం అందరినీ కలచి వేసింది. తన భర్త చనిపోవడంతో తమను పోషించేవారు ఎవరని వీరాస్వామి భార్య భోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది. కాగా, వీరాస్వామి, కోటయ్యలను అసలు పనికి ఎవరు పిలిచారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కనుమరుగైన మానవత్వం..
సుల్తాన్‌బజార్ కపాడియాలైన్‌లో అధిక శాతం సంపన్న వర్గాల వారే నివసిస్తుంటారు. అయితే మృతులు వీరాస్వామి, కోటయ్య మధ్యాహ్నం 12 గంటల సమయంలో డ్రైనేజీలో ఊపిరి ఆడక మృతిచెందితే.. రెండు గంటలకు పోలీసులు వచ్చే వరకూ అక్కడ ఏమైంది అని చూసే నాథుడు లేడు. కనీసం వీరిని పనికి పిలిపించిన వ్యక్తులు సైతం ఆ పక్కకు రాలేదు.