అడుగులోతు నీళ్లలో బైకుపై వెళుతూ..!
హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. రోడ్లపై అడుగులోతు నీళ్లు చేరడంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మ్యాన్‌హోల్ తెరుచుకొని ఉందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో బైకుపై వెళుతున్న ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై అడుగులోతు నీళ్లలో నిదానంగా బైకు మీద వెళుతున్న అతను.. బైక్‌తో సహా తెరుచుకున్న మ్యాన్‌హోల్‌లోకి పడిపోయాడు.
అదృష్టం బావుండి అక్కడ స్థానికులు అప్రమత్తంగా ఉండటంతో ఆ యువకుడిని వారు కాపాడారు. చిన్న గాయాలతో అతను బయటపడ్డాడు. అతని బైకు మాత్రం నాలాలోకి కొట్టుకుపోయింది. నిజాంపేటలోని శ్రీనివాసనగర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. వర్షాలు తగ్గకపోవడంతో రోడ్ల మీద ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అడుగులోతు నీళ్లు.. అడుగడుగునా గుంతలు.. తెరచుకున్న మ్యాన్‌హోళ్లు.. వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షాలు తగ్గేవరకు చాలా అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని నీళ్లు చేరిన రోడ్డుపై వేగంగా వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు.