వర్షాల ఎఫెక్ట్: ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్?
భారీ వర్షాల కారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వీలైనంత వరకు 'వర్క్ ఫ్రమ్ హోమ్' ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీలను కోరింది. గత నాలుగు రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో పాటు ఇప్పటికీ కొత్తగా అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో ట్రాఫిక్ పరిస్థితి ఘోరంగా ఉంటోంది. ఎక్కడ గోతులున్నాయో, ఎక్కడ రోడ్డుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడటం, పలు ప్రాంతాల్లో రోడ్లపై నీళ్లు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఆర్మీ సహకారం కూడా తీసుకుంటోంది. వారికి గచ్చిబౌలి, నిజాంపేట, అల్వాల్, హకీంపేట లాంటి ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్‌లు ఇచ్చి వారి సహాయం తీసుకుంటున్నారు.
ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని, దానివల్ల వాళ్లు రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడాల్సిన బాధ ఉండదని తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు ఐటీ కంపెనీలకు ఒక అడ్వైజరీ పంపారు. దీనికి కంపెనీలు కూడా బాగానే స్పందిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా హైటెక్ సిటీ రోడ్డులో కూడా నీళ్లు ఎక్కువగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా ఏ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తున్నారు.