సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా సుమారు రెండున్నరేళ్లుగా బోసిపోయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల కార్యాలయాలు, ఐటీ కారిడార్లు మళ్లీ పాత కళను సంతరించుకుంటున్నాయి. కరోనా మూడో దశ ముగియడం, దేశంలో కరోనా కేసుల సంఖ్య కనిష్ట స్థాయికి చేరడంతో ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించేందుకు ఐటీ సంస్థలు చర్యలు వేగవంతం చేశాయి.
కరోనా తొలి కేసు నమోదు కావడంతో 2020 మార్చి మొదటి వారంలో హైదరాబాద్ ఐటీ సంస్థలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’విధానానికి శ్రీకారం చుట్టగా, కొద్ది నెలలుగా వారంలో ఒకటి రెండు రోజులు ఆఫీసుకు వచ్చేలా ‘హైబ్రిడ్’పద్ధతిని అవలంబిస్తున్నాయి. అయితే ఇప్పటికే చిన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆఫీసుల నుంచే విధులు నిర్వర్తిస్తుండగా, ప్రస్తుతం మధ్య తరహా, దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆఫీసులకు ఉద్యోగులను రప్పించడంపై దృష్టి కేంద్రీకరించాయి.
యాపిల్, విప్రో, టీసీఎస్, మహీంద్రా, ఆర్‌పీజీ గ్రూప్ వంటి పెద్ద ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసుకు రావాలంటూ మెయిల్స్, మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ కంపెనీల్లో ఆఫీసులకు వస్తున్న ఉద్యోగుల సంఖ్య 70 శాతం మేర ఉండొచ్చని ‘హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్’(హైసియా) అంచనా వేస్తోంది. ఐటీ కంపెనీల్లో వివిధ అంశాలపై తరచూ సర్వేలు నిర్వహించే హైసియా.. అక్టోబర్‌లో ఉద్యోగుల హాజరు శాతంపై తాజాగా సర్వేకు సన్నద్ధమవుతోంది.
ఐటీ కంపెనీలను వెన్నాడుతున్న ‘మూన్ లైటింగ్’
‘ఇంటి నుంచే పని’విధానంతో లభించిన వెసులుబాటువల్ల కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాల్లో కొనసాగుతున్నట్లు ఐటీ సంస్థలు అనుమానిస్తున్నాయి. ‘మూన్ లైటింగ్’గా ప్రాచుర్యం పొందిన ఈ విధానంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగులను విప్రో సంస్థ తొలగించడంతో ఐటీ ఉద్యోగుల్లో ఉలికిపాటు కనిపిస్తోంది. అయితే మధ్య, చిన్న తరహా ఐటీ సంస్థలు మూన్‌లైటింగ్ సమస్యను అధిగమించేందుకు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడమే పరిష్కారంగా భావిస్తున్నాయి.
చిన్నా, పెద్ద సంస్థలు తమ ఉద్యోగుల్లో ప్రతీ రోజూ కనీసం 70 శాతం మందిని ఆఫీసుకు రప్పించేలా రోస్టర్‌ను తయారు చేసి అమలు చేస్తున్నాయి. ఉద్యోగులను రప్పించేందుకు పలు కంపెనీలు, క్లయింట్ సంస్థలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. టీ షర్టులు, మధ్యాహ్న భోజనం, రవాణా సదుపాయం, కెఫెటేరియాలు, క్యాంటీన్లలో సబ్సిడీల వంటివి వర్తింపచేస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో 3,500 పైగా హాస్టళ్లు సుమారు రెండున్నర లక్షల మంది ఐటీ, అనుబంధ రంగాలకు చెందిన ఉద్యోగులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment