సాక్షి, హైదరాబాద్: రా..రమ్మని..రా..రా..రమ్మని.. అంటూ ఓ సినిమా పాట తరహాలో మారింది నగరంలో టెకీల తీరు. నగరం కోవిడ్ నుంచి కోలుకోవడంతోపాటు.. ప్రస్తుతం అన్నిరకాల వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలు పూర్వస్థాయిలో ఊపందుకున్నాయి. కానీ ఇప్పటికీ ఐటీ రంగంలో పలు కంపెనీల ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఆఫీసులకు రావడం లేదు. వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అవసరమైతే తప్ప కార్యాలయాల మెట్లు ఎక్కడం లేదు. దీంతో పలు కంపెనీలు, ఐటీ శాఖ వర్గాలు వీరిని పూర్తిస్థాయిలో విధులకు హాజరు కావాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేకాదు వారితో నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ వర్గాలు సైతం ఉద్యోగులు ఆఫీసుల బాట పట్టేందుకు కృషి చేస్తుండడం విశేషం.
ఒకటికి మించి కొలువులు..?
గ్రేటర్ పరిధిలో చిన్న,పెద్ద,బహుళజాతి సంస్థలకు చెందిన 1600కు పైగా ఐటీ కంపెనీలున్నాయి. వీటిల్లో సుమారు 7.80 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ కాకపోయినా నగరానికి చెందిన పలు కంపెనీల ఉద్యోగులు ఏకకాలంలో రెండు కంపెనీల్లో పనిచేస్తూ నాలుగు చేతులా సంపాదిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో వర్క్ ఫ్రం హోం అవకాశం ఉండడం, రెండు కంపెనీల్లోనూ ఒకే రకమైన ప్రాజెక్టులు కావడం, రాత్రి వేళల్లో పనిచేసేందుకు పనివేళలు అనువుగా ఉండడం తదితర కారణాలే ఒకటికి మించి కొలువులు ఏకకాలంలో చేసేందుకు అవకాశం ఉందని ఈ రంగం నిపుణులు చెబుతున్నారు.
నచ్చినట్టుంటేనే....
ఇటీవలి కాలంలో నగర ఐటీ కంపెనీల్లో జంప్‌జలానీలు అధికమయ్యారని హైసియా తాజా అధ్యయనంలో తేలింది. వేతనాలు అధికంగా ఉన్నవి,ఇతర అలవెన్సులు, సెలవులు, పనివేళలు తమకు అనుకూలంగా ఉన్నవి, వర్క్ ఫ్రంహోంకు అనుమతించిన కంపెనీల్లో పనిచేసేందుకు టెకీలు ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమైంది. ఇళ్లు వీడి విధిగా ఆఫీసుకు రావాలని కోరితే కొందరు ఉద్యోగులు ఏకంగా ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీకి బైబై చెబుతున్నారట. దేశంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు స్థిరంగా కొన్నేళ్లపాటు ఒకే కంపెనీలో పనిచేస్తారన్న నమ్మకం కాస్తా సడలినట్లు హైసియా వర్గాలు చెబుతుండడం లేటెస్ట్ ఐటీ ట్రెండ్‌గా మారింది.
(చదవండి: ప్రీలాంచ్ మాయ)
Comments
Please login to add a commentAdd a comment