సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావంతో మొదలుపెట్టిన వర్క్‌ఫ్రం హోం విధానాన్ని ముగించేందుకు ఐటీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అన్ని విభాగాల్లోని ఉద్యోగులను దశలవారీగా కార్యాలయాలకు రప్పించాలని నిర్ణయించాయి. మొదట సగం మంది చొప్పున ఉద్యోగులను వారం విడిచి వారం ఆఫీసులకు రప్పించాలని భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగులకు ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నాయి. నెలాఖరులోగా ఆఫీసులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నాయి.
దశల వారీగా..
దేశంలో ఐటీ ముఖ్య కేంద్రాల్లో హైదరాబాద్ కీలకం. ఇక్కడ అంతర్జాతీయ కంపెనీలు (ఎంఎన్‌సీ)లు మొదలు చిన్నవాటి వరకు కలిపితే 1,500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వాటిలో సుమారు 7 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020 జనవరి నుంచి దాదాపు రెండేళ్లుగా ఐటీ కంపెనీల్లోని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడం, మార్కెట్‌లోని అన్ని రంగాలూ సాధారణ స్థితికి చేరడంతో.. ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోంకు మారాలని నిర్ణయించాయి. అయితే ఒకేసారి అందరూ హాజరుకాకుండా.. దశలు దశలుగా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్నాయి.
సగం సగం మంది ఉద్యోగులను.. వారానికి మూడు రోజుల చొప్పునగానీ, వారం వారం గానీ రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు రోజు విడిచి రోజు సగం మంది చొప్పున ఆఫీసులకు పిలవాలని నిర్ణయించాయి. క్రమంగా హాజరు శాతాన్ని పెంచుతూ.. రెండు, మూడు నెలల్లోగా పూర్తిస్థాయిలో ఉద్యోగులు ప్రత్యక్ష విధులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి నూతన ఆర్థిక సంవత్సరం మొదలవుతుండటంతో.. ఆ రోజు నుంచే ఈ విధానాన్ని ప్రారంభించాలని ఐటీ కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు నిర్దేశించిన ఉద్యోగులను మార్చి 25 నుంచి 28వ తేదీ మధ్య కార్యాలయాల్లో రిపోర్టు చేయాలని సూచించాయి.
వర్క్ ఫ్రం హోం ఎండ్..! ఐటీ.. ఇక ఆన్ డ్యూటీ!
Published Tue, Mar 1 2022 4:07 AM | Last Updated on Tue, Mar 1 2022 4:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment