త్వరలో గూగుల్ ట్యాబ్ ‘ట్యాంగో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ శక్తివంతమైన ట్యాబ్లెట్ పీసీ ‘ట్యాంగో’ ఈ ఏడాది చివరికల్లా వస్తోంది. ఎన్విడియా టెగ్రా కె1 ప్రాసెసర్‌తో రూపుదిద్దుకుంటోంది. 7 అంగుళాల స్క్రీన్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, వైఫై, 4జీ ఇతర విశేషాలు. నిర్మాణాలు, రోడ్లు, కదిలే వస్తువులు, వ్యక్తులు ఎంత దూరంలో ఉన్నారు, పరిమాణం.. ఇలా పరిసరాలను పూర్తిగా అర్థం చేసుకునేలా ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఫర్నీచర్ దుకాణానికి వెళ్లే ముందు ఇంటి లోపలి పరిసరాలను కెమెరాలో బంధిస్తే చాలు. దుకాణానికి వెళ్లిన తర్వాత అక్కడి ఫర్నీచర్ మీ ఇంట్లో ఎంతమేర స్థలాన్ని ఆక్రమిస్తుందో ఇట్టే చెప్పేస్తుంది.
పరిసరాలను 3డీలో స్కాన్ చేసేందుకు వీలుగా మోషన్ ట్రాకింగ్ కెమెరాలు మూడింటిని వెనుకవైపు అమరుస్తున్నారు. సెకనుకు 2.5 లక్షలకుపైగా 3డీ కొలతలను ఇవ్వగలదు. మొబైల్ 3డీ సెన్సింగ్ రంగంలో పనిచేసేవారికి ఉపయుక్తంగా ఉంటుంది. తొమ్మిది దేశాలకు చెందిన యూనివర్సిటీలు, పరిశోధన శాలలు, పరిశ్రమ నిపుణులతో కూడిన బృందం దీని అభివృద్ధిలో నిమగ్నమయ్యారు. ధర రూ.60 వేలు ఉండే అవకాశం ఉంది.