‘టచ్ స్క్రీన్’ టైలర్
• వస్త్ర ప్రపంచంలో వినూత్న సేవలు..
• భాగ్యనగరిలో కొటియోర్ స్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెడీమేడ్స్ అయితే ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. ఇవి నచ్చనివారైతే టైలర్ దగ్గరకు వెళ్లి దుస్తులు కుట్టించుకుంటారు. టైలర్ పనితనంపైనే డ్రెస్ తుది రూపు ఆధారపడి ఉంటుంది. కొలతల్లో ఖచ్చితత్వంతోపాటు డ్రెస్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో ముందే చూసుకోగలిగితే.. ప్రీమియం వస్త్రాల పంపిణీలో ఉన్న జార్జియా గుల్లిని ఫ్యాషన్స్ ఈ సేవలను భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన కొటియోర్ స్టోర్లలో టచ్ స్క్రీన్ అనే ప్రత్యేక పరికరం ముందు కస్టమర్ నిలుచుంటే చాలు. మూడు నిముషాల్లో 3డీ రూపంలో కొలతలు తీసుకుంటుంది. షర్ట్, ప్యాంట్, సూట్.. ఇలా వినియోగదారు తాను ఎంచుకున్న వస్త్రంతో ఏది కావాలంటే అది స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. అంటే కస్టమర్ నిజంగా వాటిని వేసుకున్నట్టే చూపిస్తుంది. వినియోగదారు తనకు నచ్చిన డిజైన్‌లో దుస్తులను సిద్ధం చేసుకోవచ్చన్న మాట.
అనుభూతి కోసం..
జార్జియా గుల్లిని గ్వాలియర్, నాగ్‌పూర్‌లో ఇప్పటికే కొటియోర్ స్టోర్లను తెరిచింది. తాజాగా దక్షిణాదిన తొలిసారిగా హైదరాబాద్ రికబ్గంజ్లోని చిమన్లాల్ సురేష్ కుమార్ (సీఎస్కే) టెక్స్‌టైల్స్‌లో షాప్ ఇన్ షాప్‌ను ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల్లో మరో మూడు నగరాల్లో ఫ్రాంచైజీ ఔట్లెట్లను ప్రారంభిస్తున్నట్టు జార్జియా గుల్లిని మార్కెటింగ్ హెడ్ విక్రం మాథుర్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. దుస్తుల డిజైన్ విషయంలో కస్టమర్లకు వినూత్న అనుభూతి ఉంటుందని అన్నారు. ఫ్రాంచైజీ ఏర్పాటుకు రూ.7.5 లక్షలు చెల్లిస్తే చాలని చెప్పారు. వస్త్రాలను తామే సరఫరా చేస్తామన్నారు. సంప్రదాయ పద్ధతితో పోలిస్తే వస్త్రాలు కుట్టేందుకు ఎటువంటి అదనపు చార్జీలు లేవన్నారు.
సీఎస్కే విస్తరణ..: అయిదు దశాబ్దాలకుపైగా వస్త్ర వ్యాపారంలో ఉన్న సీఎస్కే టెక్స్టైల్స్ మే నాటికి మెహిదీపట్నంలో దుకాణాన్ని తెరుస్తోంది. హైదరాబాద్‌లో డిసెంబర్‌కల్లా మరో నాలుగు స్టోర్లు ప్రారంభిస్తామని కంపెనీ డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ తెలిపారు. 100కుపైగా బ్రాండ్ల వస్త్రాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సాలో 1,000కిపైగా రిటైలర్లకు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఏడాదిన్నరలో 10 కొటియోర్ స్టోర్లను ఫ్రాంచైజీలో తెరుస్తామని మరో డైరెక్టర్ రక్షిత్ అగర్వాల్ వెల్లడించారు. సీఎస్కే గ్రూప్ కంపెనీ అయిన సీఎస్కే రియాల్టర్స్‌కు డీఎల్ఎఫ్ వంటి ప్రముఖ కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి.