ముంబైని ముంచెత్తిన మహాకుంభవృష్టి!
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబైకర్లు అతలాకుతలం అవుతున్నారు. 'టైఫూన్ తరహా వాతావరణం' నగరాన్ని చుట్టేయడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 2005 జూలై 26న ముంబై నగరాన్ని భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఆ తర్వాత అంతటి విపత్తు ఇదేనని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల ధాటికి ముంబై నగరంలోని రోడ్లు, వీధులు, ఆస్పత్రులు, వ్యాపార సముదాయాలు, రైల్వే పట్టాలు, స్టేషన్లు నీటమునిగాయి. చాలా ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు నిలువడంతో రోడ్లు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ దాదాపుగా స్తంభించింది. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 4 గంటలవరకు ఇదేవిధంగా వర్షాలు కొనసాగితే ముంబైని వరదలు ముంచెత్తవచ్చునని ఆందోళన వ్యక్తమవుతోంది.
భారీ వర్షాలు కొనసాగితే సాయంత్రం 4 గంటల తర్వాత భారీ సముద్ర అల ముంచెత్తే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ), విపత్తు నిర్వహణ విభాగం అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద నడుములోతు నీళ్లు నిలిచినట్టు, భవనాల్లోకి నీళ్లు వస్తున్నట్టు సమాచారం అందుతోంది. పలు ప్రభుత్వ ఆస్పతుల్లోనూ వరదనీరు వచ్చి చేరుతుండటంతో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు ఎవరూ ఇంటినుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల తర్వాత కూడా ఉద్యోగులను బయటకు పంపించొద్దని, వర్షాలు తగ్గేవరకు ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండటమే మేలని సూచించారు. ముంబై పొరుగున ఉన్న థానే నగరంలోనూ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
This is KEM Hospital now! Appalling status of healthcare in Mumbai @Dev_Fadnavis #MumbaiRains pic.twitter.com/0wIRkGHgxN
— Preeti Sharma Menon (@PreetiSMenon) August 29, 2017