మన జిహ్వకు అనేక రుచులు!
ట్రివియా
నాలుక ఒక విలక్షణ కండరం. శరీరంలోని ఏ కండరాలైనా అలసిపోతాయి గానీ, నాలుక మాత్రం అలసిపోదు. అస్థిపంజరానికి అనుసంధానం కాకుండా పనిచేసే ఏకైక కండరం నాలుకే! మానవ శరీరంలో అత్యంత దృఢమైన కండరం, అతి సున్నితమైన కండరం కూడా నాలుకే! నానా రకాల రుచులను గ్రహించేవి నాలుకపై ఉండే రుచి మొగ్గలే (టేస్ట్‌బడ్స్). ఇవి కంటికి కనిపించవు. నాలుకపై చిన్న బొడిపెల్లా కనిపించే భాగాలు రుచిమొగ్గలు కావు. కంటికి కనిపించే ఈ బొడిపెలను ‘పాపిలే’ అంటారు.
రుచిమొగ్గలు అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. నాలుకపైనే కాకుండా, బుగ్గల లోపల, పెదవులపైన కూడా ఉంటాయి. నోట్లో దాదాపు పదివేల రుచిమొగ్గలు ఉంటే, వాటిలో అత్యధికంగా దాదాపు ఎనిమిదివేల రుచిమొగ్గలు నాలుకపైనే ఉంటాయి.నాలుక లాలాజలంతో తడిగా ఉన్నప్పుడు మాత్రమే రుచులను గ్రహించగలుగుతుంది.
నాలుక రంగు మన ఆరోగ్యానికి సంకేతంగా నిలుస్తుంది. ఆరోగ్యకరమైన నాలుక చక్కని గులాబీ రంగులో కనిపిస్తుంది. నాలుకపై తెల్లమచ్చలు ఉన్నట్లయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు భావించాలి. పసుపుగా ఉంటే కడుపులో సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. విటమిన్ లోపాల వల్ల నాలుక పూసినప్పుడు కాస్త ఎర్రబడటం సహజమే అయినా, నాలుక బాగా ఎర్రగా మారిపోయి, నొప్పి గొంతు వరకు వ్యాపించి జ్వరం సోకినట్లయితే తీవ్ర అనారోగ్య లక్షణంగా గుర్తించాలి. అలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, తప్పనిసరిగా డాక్టర్‌కు చూపించు కోవాల్సిందే.