స్వచ్ఛ భారత్ కోసం నడుం బిగిద్దాం
సంగారెడ్డి రూరల్: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాల్సిన అవసరం ఉందని ఐఐటి హైదరాబాద్ డెరైక్టర్ , ప్రొఫెసర్ యూబీ దేశాయ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి మండలం ఎద్దుమైలారం ఓడిఎఫ్ ఎస్టేట్‌లోని ఐఐటిలో బుధవారం స్వచ్ఛభారత్ అభియాన్‌పై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో దేశాయ్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే వారని , సభర్మతీ ఆశ్రమంలోని పరిసరాలను ఆయనే స్వయంగా శుభ్రపర్చుకునేవారన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ సాధన కోసం విద్యార్థులతో పాటు యువత కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ ఏడాది వంద గంటలు లేదా ప్రతీ వారం రెండు గంటల పాటు శ్రమదానం నిర్వహించి స్వచ్ఛ భారత్ సాధనకు తోడ్పడాలన్నారు. ముందు తన కుటుంబం, తమ వీధి, గ్రామం, కార్యాలయం, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని వివరించారు.
ప్రతి ఒక్కరూ తమ చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకునేందుకు శ్రమదానం చేయడం వల్ల పరిశుభ్రమైన భారత్‌ను సాధించేందుకు వీలుపడతుందన్నారు. అంతకు ముందు పరిశుభ్రత కోసం పాటుపడతామని విద్యార్థులు, ఉద్యోగులు ప్రతిజ్ఙ చేశారు. అనంతరం ఐఐటి ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు.