ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ
జెడ్పీ స్థాయూ సంఘ సమావేశాల్లో గళమెత్తిన సభ్యులు
పాతగుంటూరు: జిల్లాలో నెలకొన్న సమస్యలపై బుధవారం జరిగిన జెడ్పీ స్థాయూ సంఘాల సమావేశాల్లో సభ్యులు సమగ్రంగా చర్చించారు. పలు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేస్తారా? లేదా? అని గుంటూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, కొల్లిపర జెడ్పీటీసీ సభ్యురాలు భట్టిప్రోలు వెంకటలక్ష్మి, ముప్పాళ్ల జెడ్పీటీసీ సభ్యురాలు మమత ప్రశ్నించారు.
జెడ్పీ సమావేశ మందిరంలో 1వ స్థాయూ సంఘ సమావేశం చైర్పర్సన్ జానీమూన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్థిక వ్యవహారాలు, బడ్జెట్, ఇతర స్థాయి సంఘాలకు సంబంధించిన పనుల సమన్వయంపై చర్చించారు. వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ దేవళ్ల రేవతి మాట్లాడుతూ ఇసుక రీచ్‌లను డ్వాక్రా గ్రూపులకు ఏ విధానంలో కేటాయిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిం చారు. దీంతో అధికారులు వివరాలతో కూడిన కాపీలను సభ్యులకు అందజేశారు.
జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్ అధ్యక్షతన జరిగిన రెండో స్థాయూ సంఘ సమావేశంలో గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, గృహ నిర్మాణ ం, సహకారం, పొదుపు, పరిశ్రమలు, ట్రస్టులపై చర్చ జరిగింది.
మూడో స్థాయూ సంఘ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాచర్ల, దాచేపల్లి, రెంటచింతల జెడ్పీటీసీ సభ్యులు శౌర్రెడ్డి, ప్రకాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి మాట్లాడుతూ పత్తి కొనుగోళ్ల తీరుపై ప్రశ్నించారు. మొదటి కేటగిరి పత్తినే కొనుగోలు చేస్తున్నారని, మిగిలిన రెండు కేటగిరిల పత్తిని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. సీసీఐ కేంద్రాల ద్వారా అన్నిరకాల పత్తిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. పూర్ణచంద్రరావు స్పందిస్తూ వ్యవసాయ శాఖ మంత్రితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
4వ స్థాయూ సంఘ సమావేశంలో విద్య, వైద్యం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం అంశాలపై చర్చ జరిగింది. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ కొన్ని మండలాల్లో పీహెచ్‌సీలు అధ్వానంగా ఉన్నాయని చెప్పారు. పీహెచ్‌సీల్లో వైద్యులు విధులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసినట్టే మిగిలిన వైద్యశాలల్లో కూడా క్యాంటిన్లు ఏర్పాటు చేయాలన్నారు.
ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ పీహెచ్‌సీల అభివృద్ధి కమిటీలను వెంటనే సమావేశపరిచి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి మాట్లాడుతూ దుగ్గిరాలలో పీహెచ్సీ ఏర్పాటు చేయాలని కోరారు. స్థలం ఇవ్వడానికి దాతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
మహిళల రక్షణ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని 5వ స్థాయూ సంఘ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు సంధ్యారాణి కోరారు.
మండలాల అభివృద్ధికి నిధులు కేటారుుంచాలని 7వ స్థాయూ సంఘ సమావేశంలో నరసరావుపేట జెడ్పీటీసీ సభ్యులు షేక్ నూరుల్ అక్తాఫ్ కోరారు. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలన్నారు. త్వరలోనే గ్రావెల్ రోడ్లు మంజూరవుతాయని అధికారులు చెప్పారు.