చతుర్ముఖుడు!
బాబూరావునాయుడుకు తాత్కాలికంగా మూడు కీలక బాధ్యతలు
వుడా వీసీతో పాటు కలెక్టర్, జేసీ, జీవీఎంసీ
కమిషనర్‌గా ఇన్చార్జి కిరీటాలు పది రోజులపాటు అన్నీ ఆయనే
విశాఖపట్నం : ఉన్నత స్థానాల్లో ఉన్న వారు ఒక బాధ్యత నిర్వహించడమే కత్తి మీద సాములా ఉంటుంది.. అలాంటిది ఏకంగా నాలుగు బాధ్యతలు.. అవి కూడా అత్యంత కీలకమైనవే అయితే ఇంకెలా ఉంటుందో ఊహించండి.. ఇప్పుడు అదే పరిస్థితి జిల్లాలో ఓ ఉన్నతాధికారికి ఎదురైంది.. ఆ ఒక్కడు.. వుడా వైస్ చైర్మన్ బాబూరావునాయుడు. జిల్లా పాలనాపగ్గాలతోపాటు మరో మూడు కీలక బాధ్యతలను నెత్తికెత్తుకున్న ఆయన సుమారు పది రోజులపాటు ఆయన చతుర్ముఖ పాలన సాగించనున్నారు. అయ్యవార్లెవరూ లేకపోవడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలన్నింటినీ ఆయనకు కట్టబెట్టింది.
జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్‌లు స్మార్ట్‌సిటీ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. మరోపక్క జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక్కటై రాజకీయ పైరవీలతో జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్‌ను బదిలీ పేరుతో సాగనంపారు. దీంతో కీలకమైన మూడు పోస్టులు ఒకేసారి ఖాళీ అయ్యాయి. మూడో తేదీ వరకు స్మార్ట్ సిటీ సదస్సులో పాల్గొననున్న కలెక్టర్, కమిషనర్లు.. అనంతరం ఈ నెల 10వ తేదీ వరకు సెలవు పెట్టారు. దీంతో సీనియర్ ఐఏఎస్‌గా ఉన్న వుడా ఉపాధ్యక్షుడు బాబూరావు నాయుడుకు ఈ బాధ్యతలన్నీ చుట్టుకున్నాయి. కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌తోపాటు జిల్లా జాయింట్ కలెక్టర్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు.
ఈ నెల 10వ తేదీ వరకు ఇన్ చార్జి కలెక్టర్, కమిషనర్‌గా వ్యవహరించనున్న బాబూరావునాయుడు.. ఆ తర్వాత కొత్త జేసీ వచ్చే వరకు ఇన్చార్జి జేసీ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ జీవోఆర్టీ నెం.2231ను జారీ చేశారు. దీంతో వుడా వీసీతో పాటు కీలకమైన కలెక్టర్, జేసీ, జీవీఎంసీ కమిషనర్‌గా చతుర్ముఖ పాలన సాగించనున్నారు. సోమవారం ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రీవెన్స్‌ను నిర్వహించారు.