'మాకు శివసేన మద్దతు అవసరం లేదు'
పాట్నా:మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన మద్దతు అవసరం ఎంతమాత్రం లేదని బీజేపీ స్పష్టం చేసింది. తాము మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ అధికార ప్రతినిది సయ్యద్ షెహ్ నాజ్ తెలిపారు. తాజాగా జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన సహకారం ఏమైనా తీసుకుంటారా?అని ప్రశ్నించగా.. ఆ అవసరం తమ పార్టీ రాదని షెహ్ నాజ్ తెలిపారు.
ఏ పార్టీకి కూడా మెజారిటీ స్థానాలు రావని, బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీలు భారీ ఎత్తున నష్టపోతుండగా.. ఆ మేరకు బీజేపీ లాభపడనుందని, శివసేన రెండో అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని అవి పేర్కొంటున్నాయి. దీంతో ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీల గుండెల్లో అలజడి మొదలైంది.