అదాని చేతికి ల్యాంకో ఉడిపి ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉడిపిలో నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను అదాని గ్రూపునకు విక్రయించినట్లు ల్యాంకో ఇన్ఫ్రా ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువ రూ. 6,000 కోట్లపైనే ఉంటుందని, దీని ద్వారా ల్యాంకోకు రూ.2,000 కోట్ల నగదు లభించడమే కాకుండా రూ.4,000 కోట్లకు పైగా రుణ భారం తగ్గుతుందని కంపెనీ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం అదాని గ్రూపు చైర్మన్ గౌతమ్ ఆదాని హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు 2020 నాటికి 20,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ పర్యటన అనంతరం ఈ అతిపెద్ద డీల్ జరగడం విశేషం. ప్రస్తుతం అదాని గ్రూపు 8,500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశీయ విద్యుత్ పరిశ్రమలో విలువ పరంగా ఇది రెండో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్యనే అనిల్ అంబానీకి చెందిన రిల యన్స్ పవర్ రూ.10,000 కోట్లకు జేపీ అసోసియేట్స్‌కు చెందిన విద్యుత్ ప్రాజెక్టులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఉడిపి విద్యుత్ ప్లాంట్ గురించి
దిగుమతి చేసుకున్న బొగ్గుతో ఏర్పాటైన తొలి స్వతంత్ర విద్యుత్ ప్రాజెక్టుగా ఉడిపి విద్యుత్ రికార్డులకు ఎక్కింది. 1,200 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును దిగుమతి చేసుకోవడానికి మంగుళూరు పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన సొంత జెట్టీలు ఉన్నాయి. అవసరమైతే ఈ జెట్టీ సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ టన్నులకు పెంచుకోవచ్చు. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో 90 శాతం కర్ణాటక రాష్ట్రానికి, మిగిలిన 10 శాతం పంజాబ్ రాష్ట్రానికి విక్రయించే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విద్యుత్ ప్లాంట్ సామర్థ్యాన్ని అదనంగా 1,320 మెగా వాట్లకు పెంచడానికి కర్ణాటక ప్రభుత్వంతోల్యాంకో ఈ మధ్యనే ఒప్పందం కుదుర్చుకుంది.