NEET UG Rank 2022: నీట్ ఏ ర్యాంక్.. ఎక్కడ సీట్..?
సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల ఔత్సాహికులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)–యూజీ 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర స్థాయిలో ఏ ర్యాంక్ వస్తుంది? ఆ ర్యాంక్‌కు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది? అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంచనాలు వేసుకుంటున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి నీట్లో అర్హత పొందిన వారి సంఖ్య పెరిగింది. 2021లో రాష్ట్రం నుంచి 57,721 మంది పరీక్ష రాయగా 33,841 మంది అర్హత సాధించారు. ఇక ఈ ఏడాది (2022)లో 65,305 మంది నీట్‌కు హాజరు కాగా 40,344 మంది అర్హులుగా నిలిచారు. అంటే 61.77% మంది నీట్లో క్వాలిఫై అయ్యారు. ఈ లెక్కన నీట్–2021తో పోలిస్తే 2022లో రాష్ట్రంలో 16.11 శాతం మంది అధికంగా అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో 59.27 శాతం మంది మాత్రమే అర్హత సాధించగా రాష్ట్రంలో అంతకు మించి అర్హత పొందడం విశేషం.
20 శాతం పెరుగుదల
దేశవ్యాప్తంగా వైద్య విద్యకు ఏటా క్రేజ్ పెరుగుతోంది. 2019తో పోలిస్తే దేశవ్యాప్తంగా నీట్ రాసిన వారి సంఖ్య 2022 నాటికి 20 శాతం మేర పెరిగింది. 2019లో దేశవ్యాప్తంగా 14,10,755 మంది నీట్ రాయగా, ఈ ఏడాది 17,64,571 మంది పరీక్ష రాశారు. ఇక రాష్ట్రం విషయానికి వస్తే 2021తో పోలిస్తే 2022లో నీట్ రాసిన విద్యార్థుల సంఖ్య 11.61 శాతం మేర పెరిగింది. మరోవైపు వైద్య విద్యను అభ్యసించాలనుకునే వారిలో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా 6.18 లక్షల మంది అబ్బాయిలు, 8.63 లక్షల మంది అమ్మాయిలు పరీక్ష రాశారు. ఈ ఏడాది 7.63 లక్షల మంది అబ్బాయిలు, 10 లక్షల మందికి పైగా అమ్మాయిలు పరీక్షకు హాజరయ్యారు.
ఆంధ్రా వైద్య కళాశాలలో ఇలా..
సాధారణంగా రాష్ట్రంలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల మొదటి చాయిస్ విశాఖపట్నంలోని ఆంధ్రా వైద్య కళాశాలకే ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ 2021–22లో ఎస్టీ కేటగిరీలో 472 స్కోర్‌తో 1,10,270 ర్యాంక్ సాధించిన విద్యార్థికి చివరి సీటు వచ్చింది. ఎస్సీల్లో 79,876 ర్యాంక్ వరకు, బీసీ కేటగిరీల్లో 32,693 ర్యాంక్ వరకు, ఓసీల్లో 15,824 ర్యాంక్ వరకు, ఈడబ్ల్యూఎస్‌లో 20,137 ర్యాంక్ వరకు చివరి సీట్లు వచ్చాయి.
మరోవైపు డెంటల్ కోర్సులకు సంబంధించి విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ఓసీ కేటగిరీలో 86,787 ర్యాంక్ వరకు, బీసీ కేటగిరీలో 1,38,271 ర్యాంక్ వరకు, ఎస్సీ కేటగిరీలో 1,65,600 ర్యాంక్ వరకు, ఎస్టీ కేటగిరీలో 2,09,406 ర్యాంక్‌కు చివరి సీటు వచ్చింది.