ప్రజలు నూరు శాతం సంతోషంగా ఉండాలి: చంద్రబాబు
ఉగాది పండుగ తెలుగువారి జీవితాల్లో ఉషస్సులు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగువారికి ఆయన హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మన పండుగలు తెలుగు సంప్రదాయాలు, ఆచార సంస్కృతులతో అనుసంధానమై ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. తెలుగువారి మూల పురుషుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజుగా చరిత్రకారులు చెబుతారని ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రజలంతా నూరుశాతం సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన పంచాంగాల్లో శాస్త్రవేత్తలు పొందుపరిచిన వైజ్ఞానిక సూచనలను అనుసరించాలని చంద్రబాబు రైతులను కోరారు. జీవితం కూడా వసంత రుతువు లాంటిదేనని, చైతన్యంతో ఉండాలని సందేశమిచ్చే పండుగ ఉగాది అని ఆయన అన్నారు.