UID numbers
-
ముంచుకొస్తున్న గడువు.. ఆ‘దారి’ చూపరు!
కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ 2012లో మొదలైన ఆధార్ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. రుణ మాఫీ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో దీనికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 40,46,601 కాగా.. వీరంతా ఆధార్‌కు అర్హులే. ప్రస్తుతం ఐదు లక్షల మంది ఆధార్ నమోదు చేయించుకున్నా యూఐడీ నెంబర్లు అందకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఐదారు సార్లు నమోదు చేసుకున్నా నెంబర్ రాకపోవడంతో లక్షలాది మంది ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారు. రెండు లక్షల మందికి పైగా ఇప్పటికీ నమోదు చేసుకోలేకపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. వేచి చూడాల్సిందే తప్ప తామేమీ చేయలేమనే సమాధానం ఇస్తుండటం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించినా.. ఆధార్ ఉంటేనే వర్తిస్తుందనే మెలిక పెట్టింది. అయితే చాలా మంది రైతులు ఇప్పటికీ ఆధార్ నమోదు చేసుకోకపోవడం.. కొందరికి యూఐడీ నెంబర్లు రాకపోవడంతో రుణ మాఫీకి అర్హులవుతామో లేదోననే బెంగ వెంటాడుతోంది. అదేవిధంగా ఈనెల 26లోగా ఆధార్ నెంబర్లు ఇస్తేనే ఆగస్టు నెల పింఛన్లు మంజూరవుతాయని డీఆర్డీఏ అధికారులు ప్రకటించారు. నెలాఖరులోగా రేషన్ కార్డుల్లోని కుటుంబ సభ్యులందరి పేర్లను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. పట్టాదారులను సైతం ఆధార్ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం ముమ్మరమైంది. ఎన్ఆర్ఈజీఎస్ కూలీల జాబ్ కార్డులను ఆధార్‌తో ముడిపెట్టి కూలీలకు ఆ నెంబర్ ఆధారంగానే పేమెంట్లు అందజేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ఆధార్‌తో లింకప్ చేయాలనే ఒత్తిళ్లు అధికమవడం తెలిసిందే. విద్యార్థుల స్కాలర్షిప్ సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఆధార్ ప్రామాణికం కానుండటంతో తమ పరిస్థితి ఏమిటని ఇప్పటి వరకు నెంబర్ అందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ యూఐడీ నెంబర్లు అందకపోవడంతో ఎంతో మంది విద్యార్థులు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2013-14 సంవత్సరానికి జిల్లాలో దాదాపు 10వేల మంది విద్యార్థులకు ఆధార్ లేకపోవడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 97 శాశ్వత ఆధార్ సెంటర్లు జిల్లాలో ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు లేవు. మీ-సేవ కేంద్రాల్లోనే ఆధార్ నమోదుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. ఇలా ప్రస్తుతం 97 మీ-సేవ కేంద్రాల్లో శాశ్వత ఆధార్ కిట్లను అమర్చారు. ఆధార్ ఎన్రోల్మెంట్ ఉచితంగా చేయాల్సి ఉండగా.. తప్పుల సవరణకు మాత్రమే రూ.15 ఫీజు వసూలు చేస్తారు. డిమాండ్ నేపథ్యంలో ఈ కేంద్రాల్లో కొన్ని దోపిడీకి చిరునామాగా మారాయి. నమోదుకు రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆధార్‌కార్డులు లేని పెన్షన్‌దారులు 62,882 మంది
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లాలో వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారు మొత్తం 2,28,861 మంది ఉండగా, వారిలో 62,882 మందికి ఆధార్ కార్డులు లేనట్లు గుర్తించామని పింఛన్ల పంపిణీ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (ఏపీవో) కిషన్ పేర్కొన్నారు. ఆధార్ కార్డులు లేని పింఛన్‌దారుల యూఐడీ నంబర్లను ఏపీ ఆన్లైన్లోని ఎస్ఎస్పీ సర్వర్‌కు అప్లోడ్ చేయాలని మండల కార్యాలయాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లకు సూచించారు. ఆ మేరకు జిల్లాలోని మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానిక టీటీడీసీలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేని పింఛన్‌దారులకు పింఛన్ పంపిణీని జనవరి నుంచి పోస్టల్‌శాఖ నిలిపివేసినట్లు తెలిపారు. అటువంటి పింఛన్‌దారులను ఇప్పటికే గుర్తించామని, వారి వేలిముద్రలు, ఫొటోలను మండల కో ఆర్డినేటర్ల ద్వారా సేకరించి ఏపీ ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. దీనివల్ల ఆధార్‌కార్డులు వచ్చేంత వరకూ కూడా వారికి పింఛన్ అందుతుందని వివరించారు. అదేవిధంగా ధ్రువీకరణ పరీక్షల నిమిత్తం సదరమ్ క్యాంపులకు రానివారు జిల్లాలో 5,800 మంది ఉన్నారని, వారంతా వెంటనే క్యాంపులకు వచ్చి ధ్రువీకరణ పత్రాలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లాలోని 56 మండలాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పెన్షన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తు దాటని ‘ఫీజు’ కథ
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రోజుకో కొత్త నిబంధనను తీసుకుని వస్తూ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులపాలు చేస్తోంది. దానికి కళాశాలల ప్రిన్సిపాళ్ల నిర్లక్ష్యం కూడా తోడవడంతో ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. మొత్తం విద్యార్థుల్లో ఇప్పటి వరకు సగం మందికూడా దరఖాస్తులు ఇవ్వలేకపోయారు. ఈ నెలాఖరుకు గడువు ముగుస్తుండడంతో విద్యార్థుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. గతేడాది వరకు ఆధార్‌కార్డు నంబర్, వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) నంబర్ లేకున్నా విద్యార్థులు ఫీజుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలతో పాటు గతేడాది చదివిన కోర్సుకు సంబంధించిన మార్క్స్‌మెమో, బ్యాంక్ పాసు పుస్తకం మొదటి పేజీని స్కాన్ చేసి ఈ పాస్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే సరిపోయేది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ ధ్రువీకరణ పత్రాలన్నింటితో పాటు ఆధార్‌కార్డు, హైసెక్యూరిటీ పాస్ వర్డ్ వచ్చేందుకు వీలుగా మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలని నిబంధనలు పెట్టింది. నిరుపేద కుటుంబాల్లో ఒకే సెల్‌ఫోన్ ఉంటే ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఆ నంబర్‌ను ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. మిగిలిన వారి కోసం మళ్లీ ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బంధువులు లేక ఇతరుల మొబైల్ నంబర్ ఇస్తే వారికి మెసేజ్‌లు వెళ్తాయి కాబట్టి భవిష్యత్‌లో విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే ఆధార్‌కార్డు లేనివారు కూడా ఫీజుకు దరఖాస్తు చేసేందుకు అనర్హులు. జిల్లాలో ఫీజుకు అర్హులైన విద్యార్థులు అన్ని కోర్సుల్లో కలిపి (ఫ్రెష్, రెన్యూవల్) దాదాపు 1 లక్ష మంది ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 44 వేల మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 56 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అందులో చాలా మంది విద్యార్థుల వద్ద ఆధార్ (యూఐడీ)నంబర్లు లేవు. కేవలం ఈఐడీ నంబర్లు మాత్రమే ఉన్నాయి. యూఐడీ నెంబర్లను మాత్రమే సిస్టమ్ అంగీకరిస్తుండడంతో ఈఐడీ నంబర్లున్న విద్యార్థులు డీలా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈఐడీ నంబర్లు ఉన్న విద్యార్థులు వారు చదువుతున్న కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా ఆయా నంబర్లను జిల్లా సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయానికి పంపితే వారికి యూఐడీ నంబర్లను తెప్పిస్తామని జిల్లాస్థాయి అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ విషయంలో స్పందించకపోవడం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. అర్హత కలిగిన విద్యార్థులందరూ ఆధార్ నమోదు చేసుకునేలా జిల్లా అధికార యంత్రాంగం పలు ప్రాంతాల్లో ఆధార్ కిట్లు ఏర్పాటు చేసినా, అనుకున్న స్థాయిలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. దానికితోడు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించడంతో ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.