కుంభమేళాలో అపశ్రుతి
భారీ వర్షం, పిడుగుపాటు, ఈదురు గాలులకు ఏడుగురు మృతి
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న సింహస్థ కుంభమేళాలో భారీ వర్షం, ఈదురు గాలులకు గుడారాలు కూలి ఆరుగురు మరణించగా.. పిడుగుపాటుతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటనలో 90 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈదురు గాలులకు యాత్రికులు, సాధువుల కోసం ఏర్పాటుచేసిన గుడారాలు కొట్టుకుపోయాయి. దీంతో పాటు తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గేట్లు ఎగిరి పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉజ్జయిని సమీపంలోని ఉండస ఘాట్ వద్ద పిడుగుపాటుకు గుర్తుతెలియని యాత్రికురాలు మృతి చెందినట్లు వెల్లడించారు. యాత్రాస్థలంలో విద్యుత్‌ను నిలిపేశారు.
గుడారాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కుంభమేళాలో అపశృతిపై ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన సాధు సంతులు, యాత్రికులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మోదీ ట్విటర్లో తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియాను చౌహాన్ ప్రకటించారు.