UK business
-
ఎం అండ్ ఎం దూకుడు: వచ్చే సెప్టెంబరులోనే
సాక్షి, ముంబై: దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ సెక్టార్లో దూసుకుపోనుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ ఈవీ ఎక్స్‌యూఏవీ 400ని ఆవిష్కరించ నున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ గురువారం అర్థరాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికతలతో ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తామన్నారు. అంతేకాదు 2027 నాటికి తమ ఎస్‌యూవీలలో 20 శాతం నుండి 30 శాతం వరకు ఎలక్ట్రిక్‌గా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రిక్ ఎస్యూవీ రంగంలో అగ్రగామిగా ఉండేందుకు మహీంద్రా భారీ కసరత్తే చేస్తోంది. 2022, ఆగస్ట్ 15 న జరిగే యూకే ఈవెంట్లో తమ విజన్‌ను ప్రకటిస్తామని ఆటో అండ్ అగ్రి విభాగానికి చెందిన రాజేష్ జెజురికర్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా ఉన్న తాము భవిష్యత్తులో 4వీల్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో కూడా టాప్‌లో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో అనిష్ షా తెలిపారు. తాజాగా ఎంఅండ్ఎం యూకే డెవలప్మెంట్ ఫైనాన్స్ సంస్థ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ) తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా కొత్త ఫోర్-వీలర్ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థను తీసుకురానుంది. ఇందులో రూ. 1,925 కోట్ల పెట్టుబడి ఒప్పందాన్ని చేసుకుంది. ఈ సంస్థలో బీఐఐ వాటా 2.75 శాతంగా, ఎం అండ్ ఎం వాటా 4.76 శాతంగా ఉంటుంది. తొలుత ఇరు కంపెనీలు రూ. 1,925 కోట్ల మూలధనాన్ని సమకూరుస్తాయి. రెండు విడతలుగా, రూ. 70,070 కోట్ల విలువైన మూలధన సమకూర నుందని అంచనా. ఈ డీల్ ప్రకటించిన తర్వాత ఎంఅండ్ఎం షేర్లు ట్రేడింగ్ ఆరంభంలో ఆల్-టైమ్ హైని నమోదు చేశాయి. -
స్వేచ్ఛా వాణిజ్యమే లక్ష్యం.. కలిసి అడుగులు వేస్తోన్న యూకే, ఇండియా
న్యూఢిల్లీ: ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, బ్రిటన్ మధ్య చర్చలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీ–మేరీ ట్రెవిల్యాన్ వీటిని ప్రారంభించారు. రెండు పక్షాలు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, భారత్–బ్రిటన్ మధ్య వస్తు, సేవల లావాదేవీల పరిమాణాన్ని పెంచుకునేందుకు తోడ్పడేలా వీలైనంత త్వరగా ఒప్పందం కుదిరేలా ఇరు దేశాల బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించగలవని ఆశిస్తున్నట్లు గోయల్ తెలిపారు. జనవరి 17 నుంచి తొలి విడత చర్చలు పూర్తి స్థాయిలో జనవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రతి అయిదు వారాలకోసారి ఇరు దేశాల బృందాలు సమావేశమవుతాయి. 2022 డిసెంబర్ నాటికి చర్చలను ముగించాల్సి ఉంటుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు తోడ్పడటం ఈ ఒప్పంద లక్ష్యం. ముందుగా, సుదీర్ఘ సమయం పట్టేసే సున్నితమైన అంశాల జోలికి పోకుండా, ఇరు దేశాలకు ఆమోదకరంగా, ప్రయోజనకరంగా ఉండే విషయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు గోయల్ వివరించారు. నిర్దేశించుకున్న గడువులోగా సులువుగానే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్, బ్రిటన్‌లోని మధ్య, లఘు పరిశ్రమలకు సమగ్రమైన, సముచితమైన, సమతుల్యమైన ఎఫ్‌టీఏ ప్రయోజనాలు అందించాలన్నదే రెండు దేశాల లక్ష్యమని మంత్రి చెప్పారు. ఎగుమతులకు ఊతం.. రంగాలవారీ సహకారం, మార్కెట్ సమస్యల పరిష్కారం.. వాణిజ్యపరమైన ఆంక్షల ఎత్తివేత తదితర చర్యల ద్వారా ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని గోయల్ తెలిపారు. భారత్‌లో తయారయ్యే లెదర్, ప్రాసెస్డ్ అగ్రి ఉత్పత్తులు, టెక్స్టైల్, జ్యుయలరీ మొదలైన వాటి ఎగుమతులకు మరింత దన్ను లభిస్తుందని పేర్కొన్నారు. ఐటీ, ఐటీఈఎస్, నర్సింగ్, విద్య, వైద్యం వంటి సర్వీసుల ఎక్స్పోర్ట్లను పెంచుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని, ఉద్యోగాలు.. వ్యాపారాలకు తోడ్పాటు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ట్రెవిల్యాన్ వివరించారు. -
అమెజాన్ కొంపముంచిన కోడ్.. స్టూడెంట్స్‌కు పండగ
లండన్: ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డ జనం.. ఏం కావాలన్నా బయటకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఈ-కామర్స్ సంస్థలు కూడా వినియోగదారులను ఆకర్షించేందుకు పెద్ద మొత్తంలో భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. భారత్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలు పండుగ సీజన్లో డిస్కౌంట్ ఆఫర్లతో భారీగా విక్రయాలు సాగిస్తున్నాయి. రోజురోజుకు ఆన్లైన్ షాపింగ్ పుంజుకుని.. మార్కెట్ బలపడుతున్న తరుణంలో కొన్నిసార్లు.. ఆయా వెబ్సైట్లలో లోపాల కారణంగా సంస్థలకు భారీ నష్టాలను మిగుల్చుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ స్టూడెంట్ డీల్‌లో.. డిస్కౌంట్ కోడ్‌లోని లోపం కారణంగా అమెజాన్ సంస్థకు నష్టం జరిగిన విషయాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటీవల ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ యూకేలోని కొత్త కస్టమర్లకు మొదటి కొనుగోలుపై 5 పౌండ్లు డిస్కౌంట్ ఇచ్చింది. అమెజాన్ సంస్థ 'వెల్కమ్5' అనే పేరుతో ఇచ్చిన డిస్కౌంట్ ఆఫర్ఫై ఎలాంటి షరతులు పెట్టకపోవడంతో ఒకే కోడ్‌పై వినియోగదారులు అనేకసార్లు విక్రయాలు జరిపి సంస్థకు నష్టం మిగిల్చారు. డిస్కౌంట్ కోడ్‌లో లోపమున్న కారణంగా ఒకే వినియోగదారుడు ఆఫర్‌ను అనేకసార్లు ఉపయోగించవచ్చనే విషయం కంపెనీకి 9 రోజుల పాటు తెలియకపోవడం గమనార్హం. అమెజాన్ డిస్కౌంట్ కోడ్‌లో లోపాన్ని గుర్తించిన యూకే విద్యార్థులు, డిస్కౌంట్ కోడ్‌ను తెగ వాడేసుకుని లాభపడ్డారు. డిస్కౌంట్ కోడ్‌ను ఉపయోగించి ఎన్ని సార్లయినా కొత్త వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చని కనుగొన్న కొందరు విద్యార్థులు మొత్తం క్యాంపస్ లైఫ్‌కు సరిపడా వస్తువులు భారీ మొత్తంలో కొనిపడేశారు. ఇక డిస్కౌంట్ కోడ్‌లో ఉన్న లోపం గురించి ఆ నోటా ఈ నోటా పడి యూకేలోని అన్ని క్యాంపస్‌లకు పాకింది. దీంతో వందలాది మంది విద్యార్థులు టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్టులు, బీర్ ప్యాక్‌లను పెద్దమొత్తంలో ఆర్డర్ చేసి పూర్తి ప్రయోజనం పొందారు. మరి కొంతమంది విద్యార్థులు మాత్రం ఈ లోపాన్ని ఒక వ్యసనంలా.. ఆటలా భావించి.. ఎప్పటికీ కొనవలసిన అవసరం లేకుండా.. టాయిలెట్ రోల్స్, టూత్‌పేస్టులు, బీర్ ప్యాక్‌లు, నవలలు, పెన్నులు, ఫోల్డర్లు, బ్యాటరీలు కొన్నామని పేర్కొన్నారు. అయితే 9 రోజుల తర్వాత లోపాన్ని గుర్తించిన అమెజాన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కోడ్ లోపంతో ఎంతమేరకు నష్టం వచ్చిందన్నది వెల్లడి కాలేదు. -
దూసుకుపోతున్న టాటా స్టీల్
సాక్షి, ముంబై: లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్మార్కెట్లో మంగళవారం టాటా స్టీల్ ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ స్టీల్ పెన్షన్ పథకానికి(బీఎస్పీఎస్)కు యూకే పెన్షన్ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన వార్తలతో టాటా స్టీల్ షేర్ భారీ లాభాలను నమోదు చేసింది. బ్రిటిష్ పెన్షన్ రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభించిందని టాటాస్టీల్ ఒక ప్రకటనలో ధృవీకరించింది. యూకే అనుబంధ సంస్థ టాటా స్టీల్, తదితర అనుబంధ సంస్థల నుంచి బీఎస్పీఎస్ను విడదీసేందుకు యూకే పెన్షన్ రెగ్యులేటర్ అనుమతించినట్లు దేశీ దిగ్గజం టాటా స్టీల్ పేర్కొంది టాటాస్టీల్ (యూకే) ద్వారా (బబీఎస్పీఎస్) 550 మిలియన్ పౌండ్లను చెల్లించినట్టు తెలిపింది. ఇది కంపెనీలోని 33 శాతం వాటాకి సమానమైన భాగాన్ని బీఎస్పీఎస్ ట్రస్టీకి జారీ చేశామని ఉక్కు దిగ్గజం తెలిపింది. మరోవైపు ఈ నెలలోనే టాటా స్టీల్‌తో యూరోపియన్ స్టీల్ బిజినెస్ విలీనానికి థిస్సెన్‌క్రుప్ ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఈ వార్తలతో టాటా స్టీల్ కౌంటర్లో కొనుగోళ్ళ జోరునెలకొంది. 3శాతంపైగా లాభాలతో ఆరేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది.