ullipalem
-
ఉల్లిపాలెం వారధికి అంబటి బ్రాహ్మణయ్య పేరు
అవనిగడ్డ/కోడూరు: కృష్ణాజిల్లా ఉల్లిపాలెం–భవానీపురం వారధి ఇకమీదట అంబటి బ్రాహ్మణయ్య వారధిగా మారనుంది. ఎన్నికల సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేశారు. ఈ వారధికి అంబటి బ్రాహ్మణయ్య వారధిగా నామకరణం చేస్తూ రాష్ట్ర రోడ్డు, భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు 10వ నంబరు జీవోని శుక్రవారం విడుదల చేశారు. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా అవనిగడ్డ వంతెన సెంటర్లో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉల్లిపాలెం వారధికి దివంగత ఎంపీ అంబటి బ్రాహ్మణయ్య పేరు పెడతామని ప్రకటించారు. ఈ విషయాన్ని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారధికి అంబటి పేరు పెట్టారు. ఇచ్చినమాటకు కట్టుబడి ముఖ్యమంత్రి ఈ వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టడం పట్ల మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల ప్రజలు, ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టాలని ఆయన తనయుడు, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరినా పట్టించుకోలేదు. దీంతో ఆయన టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. ఇచ్చినమాట ప్రకారం వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టిన ముఖ్యమంత్రికి శ్రీహరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. వారధికి బ్రాహ్మణయ్య పేరు పెట్టడం ద్వారా ఆయన సేవలకు గుర్తింపు లభించినట్టయిందని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. -
ఉల్లిపాలెం వారధి పనుల పరిశీలన
కోడూరు : దివిసీమ ప్రజలు జిల్లా కేంద్రమైన మచిలీపట్నం వెళ్లేందుకు కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం–భవానీపురం’ వారధి తీరప్రాంతాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని న్యూఢిల్లీ నుంచి వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అన్నారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈ వారధి నిర్మించేందుకు ప్రపంచ బ్యాంకు రూ.77.5కోట్లు నిధులు కేటాయించింది. దీంతో ఇక్కడ నిర్మాణ తీరును పరిశీలించేందుకు శుక్రవారం బ్యాంకు సెక్టార్ కో–ఆర్డినేటర్ చిరంజీవిరెడ్డి, ఆర్అండ్బీ అధికారులతో కలిసి బ్రిడ్జి ఇంజనీర్ అకోల్ బుమిక్ ఉల్లిపాలెం వచ్చారు. ఉల్లిపాలెం, భవానీపురం వైపు జరుగుతున్న నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉల్లిపాలెం వైపు పూర్తిస్థాయిలో ఫైలింగ్, ఫైల్క్యాపుల నిర్మాణాలు పూర్తిచేసి, గడ్డర్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతంగా చేస్తున్నట్లు నవయుగ కంపెనీ ఇంజనీర్లు వివరించారు. గడ్డర్లు నిర్మాణం కూడా త్వరగా పూర్తిచేసి, లాంచర్ ద్వారా ఫైల్క్యాపులపై ఉంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని, అనుకున్న సమయానికి వారధిని పూర్తి చేయనున్నట్లు ప్రాజెక్టు మేనేజర్ ఖన్నన్ తెలిపారు. క్వాలిటీ ఇంజనీర్ పి.సీతారామరాజు, ఆర్అండ్బీ ఈఈ మురళీకృష్ణ, డీఈ వెంకటేశ్వరరెడ్డి, ఏఈ కామేశ్వరరావు పాల్గొన్నారు.