‘ఐరాస నివాసాలకు’ భారత్ నేతృత్వం
పాలక మండలికి వెంకయ్య సారథ్యం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సుస్థిర మానవ నివాసాల ఏర్పాటును ప్రోత్సహించే ఐక్య రాజ్యసమితి విభాగమైన యూఎన్–హాబిటాట్కు భారత్ రెండేళ్లపాటు నేతృత్వం వహించనుంది. కెన్యాలోని నైరోబీలో సోమవారం ప్రారంభమైన ఈ సంస్థ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్ష స్థానానికి భారత్ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
‘నూతన పట్టణ ఎజెండా – సమర్థవంతమైన అమలుకు అవకాశాలు’ అనే అంశంపై ఈ పాలక మండలి సమావేశం జరుగుతోంది. నైరోబీలో జరుగుతున్న ఈ సమావేశాలకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్య నాయు డు నేతృత్వం వహించారు. రెండేళ్లపాటు ఈ సంస్థ చర్చలకు వెంకయ్యే నాయకత్వం వహిస్తారు. ‘సరికొత్త పట్టణ భవిష్యత్తుపై పనిచేసేందుకు దీన్ని అవకాశంగా భావిస్తున్నా’ అని వెంకయ్య ట్వీట్ చేశారు. యూఎన్–హాబిటాట్కు భారత్ నేతృత్వం వహించడం ఇది మూడోసారి.