పాకిస్తాన్ ఆర్మీకి చెంపచెళ్లు..
ఎల్వోసీలో ఐరాస సిబ్బందిపై భారత్ సైన్యం కాల్పులంటూ ప్రకటన
అదేమీ లేదంటూ తేల్చిచెప్పిన ఐరాస
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) మీదుగా ప్రయాణిస్తున్న ఐక్యరాజ్యసమితి వాహనంపై భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ పాకిస్థాన్ ఆర్మీ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని తేలింది. పాక్ సైన్యం వాదనను ఐరాస నిర్ద్వందంగా తిరస్కరించింది.
ఖంజర్ సెక్టార్లో బుధవారం భారత్-పాకిస్థాన్ వాహనంలో వెళుతున్న ఐరాస సైనిక పరిశీలక బృందాన్ని లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం కాల్పులు జరిపిందంటూ పాక్ సైనిక మీడియా విభాగాన్ని ఉటంకిస్తూ ఆ దేశ మీడియా కథనాలు ప్రచురించింది. భారత సైన్యం చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, భారత్ కాల్పులను దీటుగా ఎదుర్కొంటామని పాక్ ఆర్మీ చెప్పుకొచ్చింది. అయితే, పాక్ ఆర్మీ ప్రకటన ఎంతమాత్రం నిజం కాదని ఐరాస ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి బుధవారం మీడియాకు వివరణ ఇచ్చారు. భీంబర్ జిల్లాలో ఐరాస సైనిక పరిశీలక బృందం వాహనం పాక్ సైన్యం ఎస్కార్ట్‌తో వెళుతుండగా.. దూరంగా కాల్పుల శబ్దం వినిపించిందని, ఇది ఐరాస బృందం లక్ష్యంగా జరిగిన కాల్పులు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఇందులో ఐరాస సిబ్బంది ఎవరూ గాయపడలేదని తేల్చిచెప్పారు.