అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు పక్షం రోజుల్లో ముసాయిదా
అనధికార కాలనీల క్రమబద్ధీకరణకు కేంద్ర ప్రభుత్వం కేంద్రం నడుం బిగించింది. ఇందులోభాగంగా 15 రోజుల్లో సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ ముసాయిదాను రూపకల్పన చేయనుంది.
న్యూఢిల్లీ: అనధికార కాలనీ వాసులకు త్వరలో మంచిరోజులు రానున్నాయి. ఈ కాలనీల క్రమబద్ధీకరణ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులోభాగంగా పదిహేనురోజుల్లోగా ఓ ముసాయిదాను రూపొందించనుంది. ఇందుకుసంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిందిగా తన శాఖ అధికారులను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం జరిగిన సమీక్షా సమీవేశంలో ఆదేశించారు. ఈ సమావేశం అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలోని జాతీయ ప్రాదేశిక ప్రాంత అభివృద్ధి, పట్టణీకరణ తదితర అంశాలపై ఆయన చర్చించారు. వీట న్నింటికీ ఇక మంచిరోజులు రానున్నాయన్నారు.
డీడీఏతోపాటు ఆయా కార్పొరేషన్లు తమ పరిధిలోని భూమిని వీలైనంత త్వరగా గుర్తించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇందుకోసం జీఐఎస్ను వినియోగించాలని కూడా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తమ తమ వెబ్సైట్ల ద్వారా అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించారు. దాదాపు మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఇంకా అనేక నిర్ణయాలు తీసుకున్నారు.
వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా డీడీయేని ఆదేశించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి నోటీసులు జారీ చేయాలని ప్రచార కార్యక్రమం చేపట్టాల్సిందిగా డీడీయేని కోరారు. ద్వారక తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం డీడీయే నిర్మించిన మౌలిక వసతులను తన అధీనంలోకి తీసుకోవాల్సిందిగా ఢిల్లీ జల్బోర్డును ఆదేశించారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో ఢిల్లీకి చెందిన పార్టీ ఎంపీలు, పట్టణ అభివృద్ధి శాఖ కార్యదర్శి, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు, డీజేబీ అధికారులు, ఎన్డీఎంసీ, సీపీడబ్ల్యూడీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పునరాలోచించండి
కాగా అనధికార కాలనీల క్రమబద్ధీకరణ అంశాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని అనేక అనధికార కాలనీలు 2007కు ముందు ఏర్పాటైనవేనన్నారు. కాగా షీలాదీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 895 అనధికార కాలనీలను క్రమబద్ధీకరించిన సంగతి విదితమే.